ఓర్రీ.. నీ ఫాలోయింగో..!

పొద్దున సారా అలీఖాన్‌తో సెల్ఫీ... మధ్యాహ్నం జాన్వీకపూర్‌తో ఫొటోషూట్‌... సాయంత్రం సల్మాన్‌ ఖాన్‌తో సరదాగా కబుర్లు... రాత్రుళ్లు అనన్య పాండేతో పార్టీ...  ఓర్రీ ఎక్కడుంటే సెలెబ్రిటీలూ అక్కడే! ఎవరీ వైరల్‌ వీరుడు అని అంతర్జాలంలో తెగ వెతుకుతున్నారు.

Updated : 20 Jan 2024 04:52 IST

పొద్దున సారా అలీఖాన్‌తో సెల్ఫీ... మధ్యాహ్నం జాన్వీకపూర్‌తో ఫొటోషూట్‌... సాయంత్రం సల్మాన్‌ ఖాన్‌తో సరదాగా కబుర్లు... రాత్రుళ్లు అనన్య పాండేతో పార్టీ...  ఓర్రీ ఎక్కడుంటే సెలెబ్రిటీలూ అక్కడే! ఎవరీ వైరల్‌ వీరుడు అని అంతర్జాలంలో తెగ వెతుకుతున్నారు. ఇదిగోండి అతడి సంగతులు.

 నేపథ్యం: ఓర్రీ అసలు పేరు ఆర్హన్‌ అవత్రమణి. బాలీవుడ్‌ సూపర్‌స్టారేం కాదు.. కానీ కరీనాకపూర్‌, దీపికా పదుకొణె, అలియా భట్‌, షారుక్‌ఖాన్‌, కియారా అడ్వాణీ దిశా పటానీ లాంటి సీనియర్లతో సాన్నిహిత్యం ఉంది. జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్‌, నైసా దేవగణ్‌, అనన్య పాండే, సుహానా ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌.. లాంటి స్టార్ల పిల్లలకి తను బీఎఫ్‌ఎఫ్‌. వాళ్లది సంపన్న కుటుంబం. లిక్కర్‌, హోటల్‌, స్థిరాస్తి వ్యాపారాలున్నాయి. ముంబయిలో, అమెరికాలో బాలీవుడ్‌ స్టార్ల పిల్లలతో కలిసి చదువుకున్నాడు. కియారా అడ్వాణీకి జూనియర్‌. అందుకే అందరితో అంత చొరవ.

వెలుగులోకి: హాలీవుడ్‌ స్టార్‌ కైలీ జెన్నర్‌, రిలయన్స్‌ నీతా అంబానీతో సన్నిహితంగా సెల్ఫీలు దిగడం.. వాటిని సామాజిక మాధ్యమంలో పంచుకోవడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తర్వాత ప్రముఖ ఛానెళ్లు, మేగజైన్లు అతడి వెంట పడ్డాయి. సెలెబ్రిటీలతో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఓర్రీకి ఓ సిగ్నేచర్‌ స్టైల్‌ ఉంటుంది. వాళ్ల ఛాతి లేదా భుజాలపై చేయేసి పోజు పెడతాడు. ఇది వాళ్లు ఎంతో దగ్గర అనే విషయం తెలియజేస్తుంది.  

  • మార్కెటింగ్‌ మహారాజు: ఓర్రీ నడక, నడత, వేషధారణ.. చిత్రంగా ఉంటుంది. రంగురంగుల డ్రెస్‌లు, ప్రత్యేక డిజైన్లు.. పిలక జుట్టు.. ఇవన్నీ ఇతడు ప్రత్యేకం అనేలా చేస్తాయి. అన్నట్టు తనకి ‘మినియన్స్‌’ అని ప్రత్యేకంగా ఓ గ్రూప్‌ ఉంటుంది. వీళ్లూ ఓర్రీలాగే మాట్లాడతారు. డ్రెస్‌ చేసుకుంటారు. వీళ్లందరి లక్ష్యం అతగాడి ఫాలోయింగ్‌ పెంచడం.

  • మల్టీ టాలెంటెడ్‌: ఎప్పుడు చూసినా తారలతో షికార్లే కదా.. ఇంక తనేం పని చేస్తాడు అనుకునేరు! తను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో స్పెషల్‌ ప్రాజెక్టు మేనేజర్‌. సింగర్‌, సాంగ్‌ రైటర్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌, స్టైలిస్ట్‌, మంచి ఫుట్‌బాల్‌ ఆటగాడు.. చూడ్డానికి కాస్త అమాయకంగా కనిపించినా ఎంతో ప్రతిభ అతడి సొంతం.
  • సంపాదనలో మేటి: తన సంపాదన స్టార్లను మించి ఉంటుంది. ప్రతి సెలెబ్రిటీతో సెల్ఫీలు దిగడమే కాదు.. ఫొటోలు క్లిక్‌మనిపించినందుకు, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసినందుకూ ఒక్కో పోస్ట్‌కి రూ.20లక్షలపైనే పుచ్చుకుంటాడట. ఎవరితోనైనా పార్టీలకు వెళ్లినా డబ్బులు ముట్టాల్సిందే. ఇవన్నీ చూసుకోవడానికి ఇద్దరు సోషల్‌మీడియా మేనేజర్లు, ఒకరు పీఆర్‌ మేనేజర్‌, బ్రాండ్‌ మేనేజర్‌, ఫుడ్‌ మేనేజర్‌.. ఓర్రీ దగ్గర పని చేస్తున్నారు.
  •  వివాదాల రాజు: ఫేం మాత్రమే కాదు.. అతడి ఖాతాలో వివాదాలూ ఉన్నాయి. బాలీవుడ్‌ నటి పాలక్‌ తివారీతో గొడవ రచ్చకెక్కింది. వీరిద్దరి మధ్య వాట్సప్‌ చాటింగ్‌ అంతర్జాలంతో వైరల్‌ అయ్యింది. ఆఖరికి ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకునేదాకా వచ్చింది. నాతో సెల్ఫీ తీసుకోవడానికి అందరూ ఆరాటపడుతుంటే.. సీనియర్‌ నటి కాజోల్‌ వద్దంటూ తెగ పోజులు కొట్టిందంటూ నోరు పారేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని