సైగ చేసి.. రమ్మంది

నేను ఇంటర్‌ చదివేటప్పుడు క్లాసులో వెనకబెంచీలో కూర్చునేవాడిని. మా ఇంగ్లిష్‌ లెక్చరర్‌ రోజూ నన్నే లేపి ప్రశ్నలడిగి సమాధానం చెప్పమనేవారు. కావాలనే టార్గెట్‌ చేస్తున్నారనుకునేవాడిని

Published : 20 Jan 2024 00:46 IST

నేను ఇంటర్‌ చదివేటప్పుడు క్లాసులో వెనకబెంచీలో కూర్చునేవాడిని. మా ఇంగ్లిష్‌ లెక్చరర్‌ రోజూ నన్నే లేపి ప్రశ్నలడిగి సమాధానం చెప్పమనేవారు. కావాలనే టార్గెట్‌ చేస్తున్నారనుకునేవాడిని. ఓరోజు వెళ్లి ముందు బెంచీలో కూర్చున్నా. అప్పుడు నన్ను కాకుండా వెనక బెంచీ వాళ్లని అడిగారు. అప్పు డర్థమైంది.. నేను కాదు.. లాస్ట్‌ బెంచీనే ఆయన టార్గెట్‌ అని. అప్పట్నుంచి ముందే కూర్చునేవాడిని. అక్కడి నుంచి చూస్తే పక్కనున్న సైన్స్‌ గ్రూప్‌ తరగతి కనిపించేది. ఎందుకో ఓసారి అటువైపు చూస్తే ముందు బెంచీలో ఉన్న ఒకమ్మాయి నన్నే చూస్తూ కనిపించింది. నేను నవ్వితే తను నవ్వింది. చేయి ఊపింది. రమ్మంటున్నట్టుగా సైగలు కూడా చేసింది. గాల్లో తేలిపోయా. వెంటనే వాష్‌రూంకి వెళ్లి మొహం కడుక్కొని, తల దువ్వుకున్నా. నన్ను నేనే అద్దంలోనే చూసుకొని ‘అందగాడివిరా.. ఒక్క చూపుతోనే అమ్మాయిని పడేశావు’ అని ముసిముసిగా నవ్వుకున్నా. ఈ సంతోషాన్ని పట్టలేక జరిగినదంతా ఓ ఫ్రెండ్‌కి చెప్పేశా. వాడు నాతోపాటు వచ్చి దూరంగా నిల్చున్నాడు. నే ఆ అమ్మాయి దగ్గరికెళ్లి ‘హాయ్‌’ అన్నా. ఆశ్చర్యంగా చూసి ‘ఎవరు మీరు?’ అంది. ‘అదేంటి.. ఇప్పటివరకు ఒకర్నొకరం చూసుకున్నాం.. నవ్వుకున్నాం కదా. రమ్మని పిలిచావు కూడా’ అంటుంటే.. నన్ను ఎగాదిగా చూసి.. ‘ఆ సైగలు మీకు కాదు.. పక్క సెక్షన్‌లో ఉన్న మా ఫ్రెండ్‌కి’ అనడంతో తెల్లమొహం వేశా. వెనక నుంచి ఇదంతా గమనించిన నా స్నేహితుడు బిగ్గరగా నవ్వాడు. నేను వెంటనే అక్కణ్నుంచి పరిగెత్తా. ఏళ్లు గడిచినా ఈ సంఘటన ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది.

- కె.దుర్గారావు, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని