Updated : 08 Jan 2022 05:59 IST

వెంటాడా..వేడుకుంటున్నా

నేను మరీ ఆకతాయిని కాదుగానీ అల్లరోడ్నే. అమ్మాయిల్ని ఆటపట్టించడం.. వాళ్లతో ఫ్రెండ్షిప్‌ చేయడం.. నాకు ట్వీట్‌ చేసినంత తేలిక. పైగా అందగాణ్ని.. జిమ్‌ చేసి కండలు పెంచినవాణ్ని. పదిమందిలో ఉన్నా తడుముకోకుండా మాట్లాడతా. అందుకే బీటెక్‌ ఫైనలియర్‌కొచ్చేసరికి నా స్నేహితుల జాబితాలో అమ్మాయిలే ఎక్కువ.

నేను హీరోనైతే.. కుళ్లుకునేవాళ్లూ ఉంటారుగా! ‘రేయ్‌.. నువ్వు నిజంగా పోటుగాడివైతే సీఎస్‌ఈ బ్రాంచ్‌ దివ్య (పేరు మార్చాం)ని పడెయ్‌రా చూద్దాం..’ అంటూ రెచ్చగొట్టాడో క్లాస్‌మేట్‌. ఇలాంటివి నాకు భలే కిక్‌నిస్తాయి. వెంటనే ‘సై’ అన్నా. ఓ నెలలో తనతో లంచ్‌ లేదా డిన్నర్‌ చేయాలి.. సెల్ఫీ తీసుకోవాలి.. ఇదీ పందెం.

మర్నాడే బస్టాప్‌లో వాలిపోయా. వెన్నెలంతా మొహంలో ఒంపుకొని.. తారల్ని కళ్లల్లో తురుముకొని వచ్చిన తను నిజంగా సౌందర్యరాశే. ఫ్రెండ్స్‌తో ఏదో మాట్లాడుతుంటే ‘ఎక్స్‌క్యూజ్‌మీ.. ఇబ్రహీంపట్నం వెళ్లే బస్సులు ఇక్కడే ఆగుతాయా?’ అన్నా. ఎగాదిగా చూసి, పక్కనే బస్సుల వివరాలున్న బోర్డువైపు చూసింది. మాట కలపాలనే మొదటి ప్రయత్నం ఫెయిల్‌. అయినా ఓ వారంపాటు అనుసరించా. తల ఎత్తేదే కాదు. వారం వారం సాయిబాబా గుడికెళ్తుందని రెండు వారాలు వెంబడించా. రెండు కళ్లూ దేవుడిపైనే పెడుతోందిగానీ దీనంగా వెనకాలే తిరుగుతున్న నన్ను పట్టించుకోదే! తర్వాత ఐదురోజులు కాలేజీ గేటు ముందు కాపు కాశా. ఓరోజు గమనించింది. పులిని చూసిన లేడిపిల్లలా వణికింది. మొదటిసారి నాలో విలన్‌ లక్షణాలున్నాయేమో అని నామీద నాకే అనుమానం వచ్చింది. చివరికి నెంబర్‌ సంపాదించి వాట్సప్‌ మెసేజ్‌ పెడితే బ్లాక్‌ చేసింది. ఎలా ముందుకెళ్లాలో తెలిసేది కాదు. మరోవైపు గడువు తరుముకొస్తోంది. ఓపిక నశించి ఓరోజు బస్టాపులోనే అడ్డగించా. ‘నేనంటే అమ్మాయిలు పడి చస్తారు.. అలాంటిది నీ ఫ్రెండ్షిప్‌ కోసం వస్తే తెగ బెట్టు చేస్తున్నావ్‌ ఏంటి?’ అన్నా అందరిముందే. ‘నువ్వెవరసలు? మ్యానర్స్‌ లేదా? నీతో ఎందుకు మాట్లాడాలి?’ అంది కోపంగా. తల తీసేసినట్టైంది.

మూడ్రోజులే మిగిలాయి. ఓటమి జీర్ణించుకోలేను. ఆ రాత్రంతా ఆలోచించా. చివరికో ఉపాయం తట్టింది. మర్నాడే అమల్లో పెట్టా. ఓ లెటర్‌ రాసి, పట్టుకెళ్లి దివ్య చేతిలో పెట్టా.. బతిమాలా. ఉత్తరం తెరిచింది. నా గుండె వేగం రెట్టింపైంది. చదివాక.. ‘రేపు మధ్యాహ్నం రెండింటికి అమీర్‌పేట్‌ బస్టాప్‌లో కలుద్దాం’ అంది. ‘యెస్‌..యెస్‌..’ అంటూ గాల్లోకి పిడిగుద్దులు విసిరా. మా ఫ్రెండ్స్‌తో పందెం.. తనతో మాట్లాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ వివరించి.. ఒక్కసారి రెస్టరెంట్‌లో కలిసి లంచ్‌ చేద్దాం అని అర్థించా ఆ ఉత్తరంలో.

చెప్పిన సమయానికి తను రాలేదుగానీ, ఓ ఒక జీప్‌ వచ్చింది.. పోలీస్‌ జీప్‌. ‘పద బాబూ.. నీకు లంచ్‌, డిన్నర్‌.. అన్నీ తినిపిస్తాం..’ అన్నారు. సీన్‌ అర్థమైంది! దివ్య ఇలా ఇరికిస్తుందనుకోలేదు. స్టేషన్‌కి తీసుకెళ్లి దుస్తులు విప్పించి డ్రాయర్‌పై కూర్చోబెట్టారు. బూతులు తిట్టారు. రోషమొచ్చి ‘నేనేం తప్పు చేశా. నన్ను ఇక్కడికి తీసుకొచ్చే హక్కు మీకెవరిచ్చారు?’ గట్టిగా నిలదీశా. వెంటనే నా చెంప ఛెళ్లుమంది. ‘దివ్య వెంటపడిందెవడ్రా.. రెస్టరెంట్‌కి రమ్మని బెదిరించిందెవడ్రా.. బస్టాప్‌లో సీసీకెమెరా వీడియోలు కూడా తెప్పించమంటావా?’ ఎస్‌ఐ మాటలకి నా గొంతు పడిపోయింది. పేరెంట్స్‌ని పిలిపిస్తామన్నారు. కాళ్లబేరానికెళ్లా. ఇంకోసారి ఏ అమ్మాయి వెంటా పడనని లెటర్‌ రాయించుకొని వదిలేశారు.  

ఇక కళ్లు మూసినా, తెరిచినా ఆ అవమానమే గుర్తొచ్చేది. అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయమేసేది. కొన్నాళ్లకి దాన్నో పీడకలగా మర్చిపోయి, చదువు మీద దృష్టిపెట్టా. క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యా. ఆ గాయం మానుతోంది అనుకుంటుండగా ఒక ఊహించని ట్విస్ట్‌. మొన్న డిసెంబరులో బాబాయ్‌ వరుసయ్యే వ్యక్తి పెళ్లికెళ్లా. పెళ్లిపీటల మీద కూర్చుంది మరెవరో కాదు.. దివ్యనే. నా గుండెలదిరిపోయాయి. వెంటనే వెనక్కొచ్చేశా. అప్పట్నుంచి తను నా పాత విషయం ఎవరికైనా చెబుతుందేమో అనే భయం మొదలైంది. నేనిప్పుడు ఆకతాయిని కాదు.. బాధ్యతగల ఉద్యోగిని. అది అర్థం చేసుకొని, నన్ను కాపాడుతుందని ఆశిస్తున్నా.

- జీఆర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts