Updated : 15 Jan 2022 05:02 IST

బతుకునిచ్చి.. కనుమరుగయ్యావు

నాపై నాకే నమ్మకం లేనప్పుడు.. నువ్వు ఎప్పటికైనా గొప్ప స్థానంలో ఉంటావు అంది. తన మాటలు నిజమయ్యాయి.. కానీ ఆమె నా కళ్ల ముందు లేదు.

కార్పొరేట్‌ ఆసుపత్రిలో నర్స్‌ తను. అక్కడే క్యాంటీన్‌లో పనివాణ్ని నేను. ఆమె కళ్లు.. కళగా ఉండే ముఖం.. మాట తీరు.. నన్నాకర్షించేవి. పని కల్పించుకుని మరీ తన చుట్టూ తిరిగేవాణ్ని. ఓ నెలయ్యాక పసిగట్టింది. అప్పట్నుంచి ఎదురుపడితే ఓ చిరునవ్వు విసిరేది. కళ్లతోనే పలకరించేది. నా మనసు ఉప్పొంగేది.

ఓసారి ధైర్యం చేసి నంబరడిగా. బాగా బతిమాలించుకొని ఇచ్చింది. చెయ్యాలా.. వద్దా..? మూడువారాల తర్జనభర్జనలయ్యాక చేశా. ‘ఫర్వాలేదే.. నీకూ ధైర్యముంది. ఇంక అసలు చేయవేమో అనుకున్నా’ అంది. తనపై నా ఇష్టానికి గ్రీన్‌ సిగ్నల్‌ అది.
నా నంబర్‌ని తన ఫోన్‌లో అమ్మాయి పేరుతో సేవ్‌ చేశా. ఎందుకంది. ‘నువ్వు నాతో స్నేహంగా ఉన్నట్టు తెలిస్తే.. నీ స్థాయి తగ్గిపోతుంది. అది నాకిష్టంలేదు’ అన్నా. ‘పిచ్చివాడా.. నేను నీ మంచితనం చూసే దగ్గరయ్యా. నీ స్థాయి గురించి ఆలోచించలేదు’ ఆమె మాటతో ఓపెన్‌ అయ్యా. మాది పేద కుటుంబం. హాస్టళ్లలో ఉంటూ ఇంటర్‌ దాకా చదివా. పని చేస్తూ డిగ్రీ చదవాలని సిటీకొచ్చా. నాలుగు రోజులు బ్రెడ్‌ ముక్కలు తిని, బస్టేషన్‌లో పడుకున్నా. చివరికి ఒకరి సాయంతో ఈ పనిలో చేరా. సెలవులు దొరకవు. పైగా ఓటీలు. డిగ్రీలో చేరినా పరీక్షలు రాయలేదు. రెండేళ్లు గడిచాయి. నా కథంతా విని ‘నువ్వు కష్టపడితే భవిష్యత్తులో తప్పకుండా మంచి స్థాయికి చేరతావ్‌’ అంది. నాపై తన నమ్మకానికి నవ్వొచ్చింది.

‘ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అందోరోజు. నేను ఎగిరి గంతేసే మాటది. కానీ తనని చేసుకునే అర్హత నాకుందా? అదే అడిగాను. ‘ఈ పని మానెయ్‌. నిన్ను నేను చదివిస్తా. మీ ఇంటికీ డబ్బులు పంపిస్తా’ అంటుంటే.. నా కళ్లు చెమర్చాయి. ఆఖరుకి నన్ను తప్ప వేరొకర్ని చేసుకోనని వాళ్లింట్లోనూ చెప్పేసింది. అదేరోజు వాళ్లన్నయ్య వచ్చి ఊరు తీసుకెళ్లిపోయాడు. అప్పుడర్థమైంది.. తను లేకుండా నేను ఒక్కరోజు కూడా బతకలేనని. ఫోన్‌ చేసి బతిమాలాను. ‘నువ్వు మంచివాడివని చెల్లి చెప్పింది. అందుకే కొట్టకుండా వదిలేస్తున్నాం. తనని మర్చిపో’ అన్నాడు వాళ్లన్నయ్య. అయినా ఓ ఫ్రెండ్‌ సాయంతో తనని హైదరాబాద్‌కి రప్పించాను. గుడిలో పెళ్లి చేసుకోవాలనేది మా ప్లాన్‌. చూచాయగా ఆ విషయం వాళ్లకి తెలియజెప్పా. ఆ పని చేయొద్దు. మేం ఘనంగా మీ పెళ్లి జరిపిస్తామని రిప్లై ఇచ్చారు. నమ్మాం. మర్నాడే పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. మాకు ఏడెనిమిదెకరాల ఉందని అబద్ధం చెప్పమంది తను. అలాగైతేనే పెళ్లికి ఒప్పుకుంటారంది. కానీ నాకది నచ్చలేదు. నిజాలే చెప్పా. బహుశా.. నా అతి మంచితనమే కొంప ముంచిందేమో. ముహుర్తాలు చూసి కబురు చేస్తాం అన్నారు. అప్పట్నంచి నా ప్రాణసఖి జాడే లేదు.

ఆ మోసంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. పని చేసే చోట ప్రతిక్షణం ఆమె జ్ఞాపకాలే వెంటాడేవి. దాంతో ఉద్యోగం మానేసి వేరేచోటికి వెళ్లిపోయా. ఏడాదిన్నర గడిచింది. ఓరోజు అన్నయ్య ఫోన్‌. నీ తరపున డీ.ఎడ్‌కి అప్లై చేశాను.. వచ్చి పరీక్ష రాయమని. అంతకుముందు ఏడాది రాసినా ఫలితం లేదు. ఇప్పుడూ వస్తుందనే నమ్మకమూ లేదు. ఆ సమయంలో తన మాటలే గుర్తొచ్చాయి. ఆ రాత్రంతా చదివి పరీక్ష రాశా. మార్కులు తక్కువొచ్చినా అదృష్టంకొద్దీ కన్వీనర్‌ కోటాలో సీటొచ్చింది. ఓ ప్రైవేటు కాలేజీలో చేరాను. నాలుగేళ్ల తర్వాత పుస్తకం అందుకున్నా. పొద్దంతా చదవడం.. సాయంత్రాలు ట్యూషన్లు చెప్పడం. డీ.ఎడ్‌ పూర్తైంది. 2013లో టెట్‌కి, 2017లో ఉపాధ్యాయ నియామక పరీక్షకి కష్టపడి చదివాను. సెలెక్టెడ్‌ జాబితాలో నా పేరుంది. ఆ క్షణం నా కంటి నిండా నీళ్లు. తను నా ముందుంటే ‘నీ నమ్మకాన్ని గెలిపించాను చూడు’ అంటూ గట్టిగా అరిచి చెప్పేవాణ్ని. కానీ పదకొండేళ్లైంది.. తను ఎక్కడుందో తెలియదు. నేనిప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నానంటే ఆమె చలవే. నిష్కల్మషంగా తను నాపై చూపిన ప్రేమే. ఇప్పటికీ ఒక్కటే ఆశ. తను ఎప్పుడైనా తారసపడితే ‘ఈ జీవితం నీ భిక్షే’ అని చెప్పాలి. ఈ శిలను శిల్పంగా మలిచిన శిల్పికి ప్రణమిల్లాలి.. అంతే!

- శంకర్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని