Updated : 12 Feb 2022 02:44 IST

రూపమేంటి? ఉనికేంటి..

ప్రియాతి ప్రియమైన ప్రేమ..!
అసలు నీ రూపమేంటి? నీ ఉనికేమిటి? జీవం లేని నువ్వు.. ప్రేమికులకు ఆరోప్రాణమయ్యావు. ప్రేమ దక్కదని తెలిస్తే ఆ ప్రాణాన్నే బలి కోరే పిశాచిలా మారావు. గిట్టనివాళ్లు నిన్ను గుడ్డిదానివంటారు. పట్టం కట్టేవాళ్లు ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అని ఆరాధిస్తారు. నీ రాక కొందరి జీవితంలో వెన్నెల వెలుగులు పంచితే.. చాలామందికి అమావాస్య చీకట్లే ఎందుకు మిగుల్చుతోంది?

నిన్ను ఆరగించటం వల్లే వాళ్లలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి నువ్వు ఘన పదార్థం కాదు. తాగితే మైకం కమ్మేస్తుందనటానికి ద్రవ పదార్థానివీ కావు. పీల్చటం వల్ల ప్రేమ పిచ్చి పట్టిందనుకోవడానికి వాయు పదార్థానివీ అసలే కావు. రంగు, రుచీ, వాసన లేని జడ పదార్థానివి అంతకన్నా కావు. మరెలా మనిషిని ఆవహిస్తున్నావ్‌? సమాజం కుళ్లు సంకెళ్లు తెంచుకొని.. యువతీయువకులు స్వేచ్ఛగా విహరించేలా ఎలా చేయగలుగుతున్నావ్‌?

అన్నట్టు.. నువ్వు అన్నెంపున్నెం తెలియని నూనూగు మీసాల కుర్రాడు.. లేత చెక్కిళ్ల అమ్మాయినే ఎందుకు మోహిస్తున్నావు? అన్నీ తెలిసి స్వచ్ఛమైన ప్రేమనిచ్చే నాలాంటి ప్రేమికుడ్ని ఎందుకు వేధిస్తుంటావు? నా జీవితంలోకి రమ్మని నిన్నెప్పుడైనా అడిగానా? ఆ అమ్మాయిని చూడగానే గుండె వేగంగా కొట్టుకొనేలా, మనసు గాల్లో ఎగిరేలా చేయమని ప్రాధేయపడ్డానా? లేదే!! మేం ఎవరిమో, ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో నీకు తెలీదు. తొలిచూపులోనే మమ్మల్ని ఏకం చేశావు. ఆ క్షణం నుంచే మా లోకాన్ని రంగులమయం చేశావు. జీవితంలో స్థిరపడే సమయంలో వచ్చావు. జీవితం అంటే ఏంటో తెలిశాక మా నుంచి మాయమైపోయావు. జీవితం అనుకున్న అమ్మాయిని దూరం చేసేశావు. కన్న కలల్ని కరిగిపోయేలా చేశావు. కన్నీళ్లే మిగిల్చావు. మరి ఇప్పుడేది నీ జాడ? ఎక్కడుంది నీ నీడ?

నువ్వు ఎక్కడ పుట్టావో.. ఎలా పుట్టావో తెలియదు. అయినా మాకోసమే పుట్టావనుకున్నాం. మనుషులు స్వేచ్ఛగా సంచరించే ప్రాంతాలన్నీ నీవే అనుకున్నాం. మా మనసుల్లో చోటిచ్చి, నీకు గుండెల్లో గుడి కట్టాం. నిన్ను స్మరిస్తూ ప్రతి యేడు ఫిబ్రవరి 14న వేడుకలు చేస్తున్నాం. నీ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాం. కవితలు గుప్పిస్తున్నాం. మరి నువ్వేం చేశావ్‌? కలిసిన మనసుల్ని కలపాల్సిన కన్నవాళ్లని రాక్షసుల్ని చేశావు. కులం, మతం, ప్రాంతం, వర్గమంటూ కడుపున పుట్టినవాళ్లని కర్కశంగా కాటికి పంపేస్తుంటే చోద్యం చూస్తున్నావు. పెద్దల్ని ఒప్పించలేక.. ప్రేమను వదల్లేక.. తనువు చాలించే అమాయకులను జాలిగా చూస్తున్నావు. మోసాలు చేస్తున్నవారినీ, పాపాలకు పాల్పడుతున్నవాళ్లనీ ఏం అనలేకపోతున్నావు.. ఆపలేకపోతున్నావు. నాకే కాదు.. నిన్ను ఆశ్రయించిన అత్యధికులదీ ఇదే పరిస్థితి. నీకెందుకు మాపై ఇంత కక్ష? ఎందుకు వేస్తున్నావ్‌ ఈ శిక్ష? ఈ ప్రేమికుల రోజైనా నీలో మార్పు రావాలని ఇదంతా చెప్తున్నా. తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. అభ్యర్థిస్తున్నా.

-రవి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని