Published : 23 Apr 2022 01:24 IST

వలపు వల.. గిలగిల

ఇన్‌స్టా తెరిచి నాకిష్టమైన పూజా హెగ్డే ఫొటోలు చూస్తున్నా. ఇంతలో ఇన్‌బాక్స్‌కి ఓ మెసేజ్‌. ‘హాయ్‌ హ్యాండ్సమ్‌.. ఎలా ఉన్నారు?’ అని. అవతలివైపు అప్సరసలాంటి అమ్మాయి. గుండె వేగం రెట్టింపైంది. వేళ్లలోకి కరెంట్‌ పాకింది. చకచకా చాటింగ్‌లోకి దిగిపోయా. ‘మీ ఆఫీసు పక్కనుండే ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నా. ఆ పక్కనున్న కెఫేలో ఓసారి మిమ్మల్ని చూశా’ అంటూ పరిచయం చేసుకుంది. ఇష్టాయిష్టాలు, ఫ్యాషన్‌ షోలు, సినిమాలు.. అన్నీ మాట్లాడుకున్నాం. ‘ఇంతకీ నువ్వు సింగిలే కదా’ అంది ఆఖర్న. ఆ ప్రశ్నతో నా గుండె జారిపోయింది. ‘యెస్‌.. అయామ్‌ సింగిల్‌.. రెడీ టు మింగిల్‌’ అంటూ అబద్ధమాడేశా. నాకు పెళ్లై పాప కూడా ఉందంటే ఎక్కడ మాట్లాడదోననే భయంతో. ‘స్వీటీ’గా తను నా కాంటాక్ట్‌ లిస్ట్‌లో చేరిపోయింది. నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాక మా ఫోన్లకి కునుకే ఉండేది కాదు. తేనెల వర్షం కురిపిస్తున్నట్టుండేవి తన మాటలు. 

‘ఎక్కడ కలుద్దాం’ అందోరోజు. ‘ఇనార్బిట్‌ మాల్‌ కాఫీ షాప్‌లో’ ఠక్కున చెప్పా. సమయానికే వచ్చింది. లెగ్గింగ్స్‌, స్లీవ్‌లెస్‌ టాప్‌లో మోడ్రన్‌గా ఉన్న తనని చూడగానే మతిపోయింది. రాగానే చొరవగా చేయందించి, చిన్నగా హగ్‌ కూడా ఇచ్చింది. ఆ ఒంటి నుంచి వచ్చిన పరిమళం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ క్షణం నా అంత లక్కీఫెలో లేడనిపించింది. 

కొద్దిరోజులకే పూర్తిగా  స్వీటీ మైకంలో పడిపోయా. కొత్త ఏడాది, ప్రేమికుల రోజు, పుట్టినరోజు.. ప్రతి సందర్భంలో ఏదో గిఫ్ట్‌ కొనేవాణ్ని తనకోసం. ఎప్పట్లాగే ఓ ఆదివారం సినిమాకెళ్లాం. షాపింగ్‌ చేశాం. సాయంత్రం రూం దగ్గర దింపి వెళ్తుంటే.. ఫ్రెషప్‌ అయ్యి వెళ్దువుగానీ లోపలికి రా అంది. సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా.. సడెన్‌గా భుజాలపై చేతులేసి పెదాలపై ముద్దు పెట్టింది. నా ఒంట్లో సన్నగా వణుకు మొదలైంది. తన ‘ఉద్దేశం’ అర్థమైంది. ‘మనం ఏ అమ్మాయినైనా బలవంతం చేస్తే తప్పు.. వాళ్లే అవకాశం ఇస్తే తప్పే కాదు..’ ఫ్రెండ్‌ మాటలు గుర్తొచ్చాయి. ముందుకెళ్లాలా? వద్దా? నా మెదడులో లక్ష ఆలోచనలు. ఆ క్షణమే నాపై విపరీతమైన ప్రేమ చూపించే భార్య గుర్తొచ్చింది. తప్పు చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్‌ మొదలైంది. ‘సారీ.. నాకు పెళ్లైంది స్వీటీ’ అని చెప్పేసి వేగంగా బయటికొచ్చేశా.

మరుసటి రోజు నుంచే నాకు టార్చర్‌ మొదలైంది. ‘నువ్వు చీటర్‌వి. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా. నన్ను మోసం చేశావ్‌’ అనేది స్వీటీ. క్షమించమన్నా. మంచి స్నేహితుల్లా ఉందామన్నా. కొద్దిరోజులయ్యాక మేం దిగిన సెల్ఫీలు, రొమాంటిక్‌గా మాట్లాడుకున్న రికార్డింగ్స్‌ మా ఆవిడకు పంపుతానని బెదిరించడం మొదలుపెట్టింది. ముందుజాగ్రత్తగా జరిగినదంతా మా ఆవిడకి చెప్పి, ఇంకోసారలా జరగదని సారీ చెప్పా. ముందు కొంచెం బాధపడ్డా.. ఏదోలా క్షమించేసింది. గండం గడిచింది అనుకుంటుంటే.. ప్రేమ పేరుతో వాడుకున్నానని కేస్‌ పెడతాననేది స్వీటీ. అస్తమానం ఫోన్‌ చేసి విసిగించేది. ఓసారైతే నేరుగా ఆఫీసుకే వచ్చి గోల చేసింది. ఆ పది రోజులు ఎంత క్షోభ అనుభవించానంటే.. ఒక దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. చివరికి ‘అడిగినంత డబ్బులిస్తే నీ జోలికి రాను’ అంది. అంత ఇవ్వలేనని బతిమాలి ఆఖరికి రూ.3లక్షలు ఇచ్చి తనని వదిలించుకున్నాను. 

పాత ఉద్యోగం మానేసి ప్రస్తుతం వేరే కంపెనీలో చేరాను. పెళ్లైన నేను పరాయి అమ్మాయి సాన్నిహిత్యం కోరుకోవడం తప్పే. అదే నా కొంప ముంచింది. ఆ ఆశే నన్ను చిక్కుల్లోకి నెట్టేసింది. ఈ ఆశను క్యాష్‌ చేసుకోవాలనుకునే వాళ్లు కాచుకొని ఉంటారు.. జాగ్రత్త.        

 - ఆర్కేఆర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts