Updated : 21 May 2022 07:06 IST

ఉషా దూరమైన నేను..

కొన్నిసార్లు మౌనం మనసుకి మాయని గాయం చేస్తుంది. జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. దానికి నేనే సాక్ష్యం.

   - ఎంబీకే

యోగా చేద్దామని ఉదయాన్నే టెర్రస్‌పైకి వెళ్లా. ఎదురు బిల్డింగ్‌పై పొడవాటి కురుల్ని ఆరబెట్టుకుంటూ నన్నాకర్షించిందో అమ్మాయి. చారడేసి కళ్లు.. తీర్చిదిద్దిన కాటుకతో అందమంతా ఆ కళ్లలోనే ఉందనిపించింది. కొన్ని క్షణాలు కన్నార్పకుండా చూశాక సడెన్‌గా గుర్తొచ్చింది.. తను మా ఆఫీసులో కొత్తగా చేరిన ఉషేనని. 

ఉష అందరితో కలిసిపోయే రకం. కట్టిపడేసే కళ్లకితోడు తీయని గొంతు. అబ్బాయిలంతా చుట్టూ మూగేవాళ్లు. నేనూ మాట కలిపా. తన అందం, కలుపుగోలుతనం వర్ణిస్తుంటే.. ‘అంతటితో ఆగిపో. ఎక్కువ మాట్లాడావో.. వేట కొడవలితో నరుకుతా. మాదసలే రాయలసీమ’ అంటూ నవ్వేసింది. కొద్దిరోజుల్లోనే క్లోజ్‌ అయ్యాం. నేను కొంచెం మెతక. ముక్కుసూటిగా మాట్లాడతా. ఆ తీరే నచ్చిందేమో! సరదాగా తిట్టేది. ‘నేనేమన్నా నీకు కోపం రాదా? మీ ఇంట్లో, మీ ఊర్లో అంతా ఇంతేనా?’ అని ఉడికించేది. తనలా చొరవ తీసుకోవడం భలే నచ్చేది.

ఉషతో సాన్నిహిత్యం కోసం కిరాణా కొట్టు, పాల బూత్, బస్టాపు.. అన్నిచోట్లా కాపు కాసేవాణ్ని. నన్ను చూడగానే తన పెదాలూ విచ్చుకునేవి. కళ్లు పలకరించేవి. ఈ సంతోషం పూర్తిగా ఆస్వాదించకముందే తను ఒక్కసారిగా మాయమైంది. వీధిలో కనిపించదు.. ఆఫీసుకీ రాదు. ఏమైందోనని అల్లాడిపోయా. నెలలు గడిచాక ఇక రాదని ఫిక్సయ్యా.

ఓ రోజు ఆఫీసు వెళ్లడానికి బస్సెక్కా. తర్వాత స్టాప్‌లో ఒకమ్మాయి ఎక్కి నా ముందు సీట్లో కూర్చుంది. వెనక నుంచి చూస్తే అవే కురులు. కొంచెం ముందుకు జరిగి చూశా. అవే కళ్లు. నా ఉషానే. ఆ క్షణం నాలో పట్టలేనంత సంతోషం, చెప్పలేనంత కోపం. అయినా ఫీలింగ్స్‌ బయటికి కనపడకుండా అణచుకున్నా. రెండు నిమిషాలయ్యాక ‘హలో సర్‌.. నేను గుర్తున్నానా?’ అంది వెనక్కి తిరిగి. ‘ఇంతకీ నేను మీకు తెలుసా?’ నేనూ వెటకరించా. ‘తెలుసులెండి.. నన్ను ఇంప్రెస్‌ చేయడానికి మీరు పడ్డ పాట్లు కూడా తెలుసు. నేను ఆఫీసుకి రావడం లేదని నా ఫ్రెండునూ అడిగారట’ అంది ముసిముసిగా. అమ్మకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఊరెళ్లానని అసలు విషయం చెప్పింది.

మేం దూరమై, దగ్గరయ్యాక మా మనసులు మరింత దగ్గరయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా ప్రేమపక్షుల్లా విహరించేవాళ్లం. పార్కులు, థియేటర్లు, రెస్టరెంట్లు.. అన్నీ మా ప్రేమ కేంద్రాలే. ‘నాకు ఏ సమస్య వచ్చినా నువ్వే గుర్తొస్తావు. మంచి విషయం ముందు నీతోనే పంచుకోవాలి అనిపిస్తుంది’ అంటుంటే మేమిద్దరం ఒక్కటయ్యే రోజు దగ్గర్లోనే ఉందనిపించేది. అలా సంతోషంగా సాగిపోతున్న మా జీవితంలో ఓ కుదుపు. ‘అర్జెంట్‌గా నిన్ను కలవాలి. ఓ ముఖ్య విషయం చెప్పాలి’ అంటూ ఫోన్‌ చేసిందో రోజు. పెళ్లి విషయం కావొచ్చని ఆశగా పరిగెత్తుకెళ్లా. ‘ఇద్దరక్కయ్యలు ఇంట్లో చెప్పకుండా ప్రేమపెళ్లి చేసుకున్నారు. నేనూ అలాగే చేస్తే తట్టుకోలేమని అమ్మ ఏడుస్తోంది. మావయ్యలు నాపై నిఘా పెట్టారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకంతా అయోమయం. ‘నువ్వు నాకు ఎప్పటికీ మరపురాని జ్ఞాపకానివి. ఇకనుంచి మనం కలవడం కుదరదేమో’ అంటుంటే ఊపిరి ఆగినంత పనైంది.

ఎంత ప్రయత్నించినా తను చెప్పినట్టు చేయడం నావల్ల కాలేదు. పెద్దల్ని కలిసి మాట్లాడదాం అని బతిమాలా. ‘పరిస్థితులేంటో నాకు తెలుసు. వాళ్లు ఒప్పుకోరు’ అంది. ఎదురుపడితే ముఖం తిప్పుకునేది. వాట్సాప్‌కి వస్తే ఆఫ్‌లైన్‌ అయ్యేది. రాన్రానూ తనపై ప్రేమ స్థానంలో కోపం మొదలైంది. నేనూ బెట్టు చేయడం మొదలెట్టా. ‘ఇంకొద్ది రోజులే ఉద్యోగం చేస్తా. తర్వాత నీకు కనపడనేమో.. స్నేహితులుగా ఉందాం’ అని మెసేజ్‌ చేసిందోసారి. వాళ్ల పెద్దల్ని కలవడానికి ఒప్పుకోలేదనే కోపం, తనే వచ్చి మాట్లాడాలనే పంతంతో సమాధానం ఇవ్వలేదు. ఇక అంతే. తను మళ్లీ కనపడలేదు. తన గొంతు నా మనసుని తాకి నాలుగేళ్లైంది. అయినా ఇప్పటికీ ఉష నా ఊహల్లోంచి చెరిగిపోలేదు. ఏరోజుకైనా తను మళ్లీ నా ముందుకొస్తుందనే ఆశతోనే బతుకుతున్నా. 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని