మీరెళ్లిపోతూ..మమ్మల్ని ఏడిపించొద్దు

‘భూదేవంత అరుగు.. ఆకాశమంత పందిరి వేసి.. ఊరందరినీ పిలిచి నీ పెళ్లి గ్రాండ్‌ జరిపిస్తా కన్నా...’ ఈ మాట నాన్న నాతో ఎన్నిసార్లు అనేవారో! అన్నయ్య పెళ్లినాటికి మా పరిస్థితేం బాగా లేదు. తన వేడుక సరిగా చేయలేకపోయారు. మూడేళ్ల కిందట నా సీఏ పూర్తై, మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావడంతో పరిస్థితి మెరుగైంది.

Updated : 01 Oct 2022 07:21 IST

‘భూదేవంత అరుగు.. ఆకాశమంత పందిరి వేసి.. ఊరందరినీ పిలిచి నీ పెళ్లి గ్రాండ్‌ జరిపిస్తా కన్నా...’ ఈ మాట నాన్న నాతో ఎన్నిసార్లు అనేవారో! అన్నయ్య పెళ్లినాటికి మా పరిస్థితేం బాగా లేదు. తన వేడుక సరిగా చేయలేకపోయారు. మూడేళ్ల కిందట నా సీఏ పూర్తై, మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావడంతో పరిస్థితి మెరుగైంది. త్వరలోనే నా పెళ్లి చేస్తామన్నారు. నాన్న మాట నాకెప్పుడూ శాసనమే. ఓరోజు నా చేతిలో ఒకమ్మాయి ఫొటో పెట్టారు. ‘పేరు వందన’ అన్నారు. విషయం నాకర్థమైంది. అమ్మాయి చుక్కల్లో చందమామలా లేదుగానీ చూడ్డానికి లక్షణంగానే ఉంది. మంచిరోజు చూసుకొని వెళ్లాం. వందనలో వంక పెట్టడానికేం లేదు. చీరకట్టులో మహాలక్ష్మిలా ఉంది. బీటెక్‌ అయ్యాక ఏడాది సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసి మానేసిందట. మాటల్లో అణకువ, పెద్దలంటే గౌరవం.. నన్నాకట్టుకున్నాయి. కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. మాటల్లో ఎంతో పరిణతి. తను నాకోసమే పుట్టిందనిపించింది.
2020, ఏప్రిల్‌ 25న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం. ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ ఈలోపే కరోనా కల్లోలం మొదలైంది. ‘కొద్దిమందే అతిథులుండాలి.. భౌతిక దూరం పాటించాలి..’ అంటూ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. పెద్ద చిక్కే వచ్చి పడింది. కొన్నాళ్లు ఆగుదాం అనుకుంటే రెండేళ్లదాకా ముహూర్తాలు లేవన్నారు. నాన్న డీలా పడిపోయారు. గ్రాండ్‌గా చేయాలనుకున్న నా పెళ్లి కొద్దిమంది బంధువులు, అతిథుల
సమక్షంలో జరిగింది.
వందన అడుగు పెట్టిన వేళావిశేషం.. నాకు ప్రమోషన్‌ వచ్చింది. తను ఇంట్లోనూ అందరితో బాగా కలిసిపోయింది. ‘వందూ వందూ’ అంటూ అమ్మ ఎప్పుడూ తన పేరే కలవరించేది. వదిన, తను అయితే సొంత అక్కాచెల్లెళ్లలా మెలిగేవారు. నాన్నకైతే వందన చేసిన కూరలే నచ్చేవి. వీటన్నింటితోపాటు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మా అందర్నీ కంటికిరెప్పలా కాపాడుకునేది. ఒక్కమాటలో చెప్పాలంటే తనొచ్చాక మా ఇంటి కళే మారిపోయింది.
అందరికీ ఇష్టసఖిగా మారిన నా ప్రియసఖి పుట్టినరోజు అక్టోబరు 14. సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నా. ఓ హోటల్‌లో పెద్ద హాల్‌ తీసుకొని బాగా ముస్తాబు చేయించా. అన్ని ఏర్పాట్లూ చేసి బయల్దేరుతుండగా ఇంట్లోంచి ఫోన్‌. ‘వందూ గడియ పెట్టుకొని చాలా సేపట్నుంచి లోపలే ఉంది. ఎంత పిలిచినా తీయడం లేదు’ అంది అమ్మ గాబరాగా. అది వినగానే నా ఒంట్లో వణుకు. పరుగుపరుగున వెళ్లా. అందరం ఎంత బతిమిలాడినా, తలుపు బాదినా బయటికి రావడం లేదు. ఇక డోర్‌ పగలగొట్టే ప్రయత్నాలు మొదలెట్టాం. అప్పుడు తీసింది. బయటికొస్తూనే నన్ను పట్టుకొని వెక్కివెక్కి ఏడవసాగింది. నాకంతా అయోమయం. పక్కకి తీసుకెళ్లి అనునయంగా అడిగా. అప్పుడు నోరు విప్పింది. మా పెళ్లిరోజే వందన తమ్ముడి పుట్టినరోజట. మూడేళ్ల కిందట తను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషయం ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. తమ్ముడంటే తనకి ప్రాణం. బాధతో కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. మధ్యాహ్నం తన పుట్టినరోజని గుర్తుకు రాగానే అలా చేసిందట. అది వినగానే చాలా బాధ అనిపించినా.. తను క్షేమంగా ఉండటంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం.
వందూ మామూలు మనిషి కావడానికి రెండ్రోజులు పట్టింది. మరుసటి ఏడాది మా పెళ్లిరోజుకీ మళ్లీ ఏడుపు సీన్‌. సైకాలజిస్టు దగ్గరికి తీస్కెళ్లి కొన్నాళ్లు కౌన్సెలింగ్‌ ఇప్పించా. కొద్దిరోజులయ్యాక అసలు ఏం జరిగిందని అడిగా. వాళ్ల తమ్ముడు బీటెక్‌ ఫైనలియర్‌లో ఉండగా జరిగిందా దారుణం. రోజూ కాలేజీ బస్సులో వెళ్లొచ్చేవాడు. ఆరోజు మిస్‌ కావడంతో ఆర్టీసీ బస్సులో వెళ్లాడు. అప్పటికే ముందు వెళ్లిన ఫ్రెండ్స్‌ తన కోసం బస్టాప్‌లో ఎదురుచూస్తున్నారు. తను కనబడగానే అరుస్తూ చేతులూపారు. వాళ్లను తొందరగా కలవాలనే ఆత్రంలో వెనకాముందూ చూసుకోకుండా రోడ్డు దాటబోయాడు. వేగంగా వచ్చిన లారీ అతడ్ని ఢీ కొట్టింది. ఇక అంతే. తర్వాత తేదీ, ప్రమాదం జరిగిన ప్రదేశం గురించి చెప్పగానే నాకు షాక్‌. ఎందుకంటే ఆరోజు నేను ఆర్టీసీ బస్సులో వందన తమ్ముడి పక్కనే కూర్చున్నా. పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ నా కాలేజీరోజుల గురించీ తనకి చెప్పా. నేనప్పుడు స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నా. అప్పటిదాకా నాతో సరదాగా మాట్లాడిన తను లారీ కింద పడి గిలగిలా కొట్టుకొని చనిపోవడం కళ్లారా చూశా. ఆరోజంతా బాధ పడ్డా.
యాదృచ్ఛికం అయినా.. నా బావమరిదిని పెళ్లికి ముందే కలిశా. తను బతికి ఉంటే నన్ను ‘బావా’ అని పిలుస్తూ జీవితాంతం సరదాగా ఉండేవాడు. తల్లిదండ్రులకు కడుపుకోత తప్పేది. ప్రాణంలా చూసుకునే నా శ్రీమతికి ఏడుపు ఉండకపోయేది. తను చేసిన చిన్న తప్పిదంతో రెండు కుటుంబాలు బాధ పడుతున్నాయి. అందుకే.. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు కానరాని లోకాలకు వెళ్లిపోయి మీమీదే ఆశలు పెట్టుకున్న వారిని జీవితాంతం ఏడ్చేలా చేయకండి.                       

 - కిరణ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు