గాళ్‌ఫ్రెండ్‌గా ఉండటానికైనా ఓకే!

మీరు నిజంగానే ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్టుగానే అనిపిస్తోంది. ప్రేమ, పెళ్లి, జీవిత భాగస్వామి విషయంలో సరిజోడు చూసుకోవాలంటారు. ఆ హీరోపై మీకు ఇష్టం, అభిమానం సరే.. ఒక్కసారి వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి ఆలోచించండి.

Published : 03 Sep 2022 00:18 IST

మనలో మనం

నా సమస్య మీకు చిత్రంగా అనిపించినా.. నాది తీర్చలేనంత బాధ. నాకు బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ అంటే పిచ్చి. ఆయన పేరుని చేతిపై టాటూ కూడా వేయించుకున్నా. తన ప్రతి సినిమా కనీసం పదిసార్లైనా చూస్తుంటా. తనని ఎవరైనా చిన్న మాట అన్నా సహించలేను. ఆయనను కలవడానికి ఓసారి ఇంట్లో చెప్పకుండా ముంబయి వెళ్లొచ్చాను. నాకు తనని పెళ్లి చేసుకోవాలని ఉంది. సాధ్యం కాకపోతే కనీసం తన గాళ్‌ఫ్రెండ్‌గా ఉండటానికైనా ఓకే. ఇవన్నీ చెబుతుంటే ఫ్రెండ్స్‌ పిచ్చిదానిలా చూస్తున్నారు. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు.

- ఓ అమ్మాయి, ఈమెయిల్‌

మీరు నిజంగానే ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్టుగానే అనిపిస్తోంది. ప్రేమ, పెళ్లి, జీవిత భాగస్వామి విషయంలో సరిజోడు చూసుకోవాలంటారు. ఆ హీరోపై మీకు ఇష్టం, అభిమానం సరే.. ఒక్కసారి వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి ఆలోచించండి. తెరపై కనపడే సినిమా తారలు వేరు. వాళ్ల వ్యక్తిగత ప్రపంచం వేరు. వాళ్లు వేసుకునే దుస్తులు, చెప్పే డైలాగులు, చేసే సాహసాలు.. ఇవన్నీ భిన్నంగా ఉంటాయి. మీరేకాదు.. మీలాగా అదే హీరోని ప్రేమించే అమ్మాయిలు వేలు, లక్షల్లో ఉంటారు. మరి వాళ్లందరినీ ఆయన ప్రేమించలేడు కదా.. కనీసం మనతో మాట కలపడానికైనా వాళ్లకి సమయం కుదరదు. వాళ్ల ప్రాధాన్యతలు, జీవన శైలి వేరుగా ఉంటాయి. మీకు ఆ హీరో అంటే ఇష్టం ఉంటే నిరభ్యంతరంగా అభిమానించండి. తన సినిమాలు బాగా చూడండి. తన తరపున ప్రచారం చేయండి. ఒకవేళ ఆ పరిధి దాటి తనని ప్రేమిస్తున్నాను అంటే.. అదీ చేయండి. అంతేగానీ తనూ మిమ్మల్ని ప్రేమించాలి, పెళ్లాడాలి.. అంటే ఆచరణసాధ్యం కాదు. అయినా ఇంకా మీరు అదే భావనలో ఉంటే అది ప్రేమ కాదు.. ఒట్టి భ్రమే అవుతుంది. మనం ఒక వ్యక్తిని అభిమానించడం కాదు.. మనల్ని ఇతరులు అభిమానించే స్థాయికి చేరాలి. చదువు, కెరియర్‌లో విజయం సాధించినప్పుడు, ఏదైనా మంచి పని చేసినప్పుడు.. మనల్ని అభిమానించే వాళ్లు, స్ఫూర్తిగా తీసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి అభిమానం పొందినప్పుడు వచ్చే సంతృప్తే వేరు. అది సాధించడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మర్చిపోయి సాధ్యం కాని విషయాల గురించి మొండిగా వాదిస్తుంటే స్నేహితులు, సన్నిహితుల వద్ద చులకనయ్యేది మీరే. అయినా ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోతుంటే.. ఒక్కసారి మానసిక నిపుణుడిని సంప్రదించండి. కౌన్సెలింగ్‌ ఇచ్చి మీ మనస్తత్వాన్ని మార్చే అవకాశం ఉంది.

- డా.టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని