ప్రవచనం

‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన.

Published : 24 Mar 2024 00:47 IST

‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. తెలిసినవారికి చెబుదామంటే మహా పండితుడన్న కీర్తి పొందుతాడనే ఈర్ష్యతో పెడచెవిన పెడతారు- తామే పండితులం అనుకునేవారు. పాలకులకు సహజంగా గర్వం ఉంటుంది. మాకు మరొకడు నీతులు చెప్పేవాడా అని ఆగ్రహిస్తారు. సామాన్య జనానికి సుభాషితాలు విని అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు. అలా అనుకున్నా భర్తృహరి ఊరుకోలేదు. చెప్పదలచుకున్నాను వినండంటూ నీతి శతకం చెప్పాడు.

అందరూ పండితులు కాలేరు. చాలామంది పాఠకులూ కాలేరు. అక్షర జ్ఞానం లేనివారున్నారు కదా! వినడం తేలిక. శ్రద్ధగా విని అర్థం చేసుకోగలిగినవారికి మంచి చెప్పడం ఒక ధర్మమే కాదు, సామాజిక బాధ్యత కూడా. లోక వ్యవహారం అంతా నియమబద్ధ రీతిలో నడిచేటట్లు చేసిన పరమేశ్వరుడు ఒక్క మానవబుద్ధికి మాత్రం స్వాతంత్య్రం ఇచ్చాడు. అందుకే మనిషి బుద్ధి క్రమపద్ధతిలో ప్రవర్తించదు. ఒక్కొక్కరి బుద్ధి ఒక్కో రకంగా ఉంటుంది. మానవజన్మ ఉత్తమమైంది అన్నారు. మనిషిగా పుట్టినవాడు బుద్ధిబలంతో సన్మార్గాన్ని అవలంబిస్తూ తానున్న స్థితికంటే ఉన్నతమైన స్థితిని చివరికి మోక్షాన్ని పొందగలగాలి. మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది చక్కని సంస్కారాలు పెంపొందేలా చూడటం విజ్ఞుల కర్తవ్యం. సమాజంలో నైతిక విలువలు పాదుగొల్పాలి. నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలకన్నా భిన్నమైనవి కావు. జీవితానికి ఒక దిశను గమ్యాన్ని ఏర్పరచి, అర్థవంతమైన జీవితం గడిపేలా మార్గదర్శనం చేసేవే ఆ విలువలు. విశ్వం గురించి, విశ్వంలో తన స్థానం గురించి తన జన్మ పరమార్థం గురించి మనిషి తెలుసుకోవడానికి దోహదం చేసేది ఆధ్యాత్మిక జ్ఞానం. పిల్లలకు ‘నైతిక దిక్సూచి’ని బహూకరించవలసిన బాధ్యత పెద్దలది. క్రమశిక్షణ, సత్యం, న్యాయం, మంచి-చెడు, పరోపకారం, స్వచ్ఛమైన ఆలోచనలు, పరిశుద్ధమైన అలవాట్లు... ఇవన్నీ ఈ తరంలో పిల్లలే కాదు- పెద్దలూ తెలుసుకోవలసిన అగత్యం ఏర్పడింది. కాలానుగుణంగా అనేక పరిస్థితులవల్ల మన జీవన విధానంలో, ప్రవృత్తుల్లో ఆలోచనల్లో, ఆచరణలో కోరదగనివెన్నో చోటు చేసుకుంటున్నాయి.

సంస్కరణ వ్యక్తి నుంచి ప్రారంభం కావాలి. శీలమే పరమావధిగా వ్యక్తుల్ని తీర్చిదిద్దాలి. వ్యక్తి సంస్కారవంతుడు కానిదే ఏ సమాజమూ సుఖసంతోషాలతో మనలేదు. వస్తువులు లేదా ఆలోచనల విలువను సరిగ్గా అంచనా వేయలేకనే ఈ ప్రపంచంలో ప్రజలు క్లేశాలను అనుభవిస్తున్నారని అంటారు విజ్ఞులు. ప్రజా శ్రేయస్సు కోసం పాలన సాగించడం పాలకుల కర్తవ్యమైతే, ప్రజల్ని నీతిమంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసిన విధి పండితులది. పూర్వకాలంలో ధర్మప్రవక్తలు, సంస్కర్తలు జనం మధ్యకు వెళ్ళి మంచిని ప్రబోధించేవారు. కొందరు మాటల్లో చెబితే మరికొందరు పాటలు పాడారు. సామాజిక దృక్పథంతో ఆధ్యాత్మిక విషయాలను ప్రవచించారు.

వచనం అంటే మాట. మామూలు మాటలుకాక ఉన్నతమైన విషయాలను మనసుకు ఎక్కేలా ఆహ్లాదకరంగా దృష్టాంతాలతో బోధించడం ప్రవచనం. ప్రవచనం ఒక కళ. నైమిశారణ్యంలో మునులు సూతుడి ద్వారా పురాణాలు విన్నారు. హరి కథలు, దేవాలయాల్లో పురాణ కాలక్షేపాలు ఉండేవి. ఈ యాంత్రిక యుగంలో ప్రసార మాధ్యమాల్లో ప్రవచనాలు వినిపిస్తున్నాయి. లక్షల శ్రోతలు వింటున్నారు. ఇవన్నీ సమాజంలో మంచి మార్పు కోసమే. అందుకే ఎంతమందైనా మంచిమాటలు పదేపదే చెప్పాల్సిందే. వినేవారు వినాల్సిందే. తెలిసినవారు చెప్పడం, తెలియనివారు విని అర్థం చేసుకోవడం, విన్నదాన్ని ఆచరించడం సమాజ ఆరోగ్యానికి ఎంతైనా అవసరం.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని