AP News: ఉదారంగా ఆదుకోండి

‘‘వరదలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఈ సంక్షోభ సమయంలో ఆదుకోవాలి. తక్షణం తాత్కాలికంగా రూ.1,000 కోట్ల సాయం అందించాలి. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన వారితో కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసి వరదలు,

Updated : 25 Nov 2021 06:01 IST

 వరద నష్టం అంచనాలకు కేంద్ర బృందాన్ని పంపండి

తక్షణం రూ.వెయ్యి కోట్ల సాయం చేయండి

మోదీ, అమిత్‌ షాలకు ముఖ్యమంత్రి జగన్‌ లేఖలు

ఈనాడు, అమరావతి: ‘‘వరదలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఈ సంక్షోభ సమయంలో ఆదుకోవాలి. తక్షణం తాత్కాలికంగా రూ.1,000 కోట్ల సాయం అందించాలి. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన వారితో కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసి వరదలు, వర్షాలతో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అంచనా వేయించి, పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు, ధ్వంసమైన మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించేందుకు కేంద్రం ఉదారంగా ఆర్థిక సాయం అందించాలి’’ అని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం విడివిడిగా లేఖలు రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో రూ.6,054 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, ఏయే శాఖల వారీగా ఎంత నష్టం వాటిల్లిందో పట్టికను కూడా జత చేసి పంపారు. సంబంధిత లేఖల్లో ముఖ్యమంత్రి ఏమేం కోరారో ఆయన మాటల్లోనే...

* నవంబరు 18, 19 తేదీల్లో వాయుగుండంతో కురిసిన వర్షాలతో నాలుగు కోస్తా జిల్లాలు, నాలుగు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. సాధారణంగా సగటున 3.2 సెంటీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా ఏకంగా సగటున 11.1 సెంటీమీటర్లు కురిసింది. ఫలితంగా తిరుపతి, తిరుమల, నెల్లూరు నగరం, మదనపల్లె, రాజంపేట ముంపులో చిక్కుకున్నాయి. 40 మంది మృతిచెందగా 25 మంది గల్లంతయ్యారు.

ఈ వర్షాలకు 196 మండలాల్లోని 1,402 గ్రామాలు, నాలుగు పట్టణాలు ప్రభావితమయ్యాయి. 324 సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటికీ 69,916 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాం.

* నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో రహదారులు, కాలువలు, చెరువులు ధ్వంసమయ్యాయి. కడప జిల్లాల్లో అన్నమయ్య జలాశయానికి గండి పడింది. రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. 1.43 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు, 42,999 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 1,887.65 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. 59.6 కిలోమీటర్ల పైపులైను, 2,764 వీధి లైట్లు, 71 మున్సిపల్‌ పాఠశాలల భవనాలు, కమ్యూనిటీ సెంటర్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

* పంచాయతీ రోడ్లు 2,254.32 కిలోమీటర్ల మేర పాడయ్యాయి. 1,085 గ్రామీణ రక్షిత నీటి పథకాలు, 376 చోట్ల నీటి పంపింగ్‌ సామగ్రి ధ్వంసమైంది. 8,474 విద్యుత్తు స్తంభాలు, ఫీడర్లు, 102 సబ్‌ స్టేషన్లు  దెబ్బతిన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని