కార్పొరేటీకరణ విధానాలను ప్రతిఘటిద్దాం

ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేటీకరణ విధానాలు, మనువాద పునరుద్ధరణ చర్యలను ప్రతిఘటించాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా సంస్థ నాయకురాలు హరిందర్‌బింద్‌ కౌర్‌ పిలుపునిచ్చారు.

Published : 26 Jun 2022 05:17 IST

పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల్లో వక్తల పిలుపు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేటీకరణ విధానాలు, మనువాద పునరుద్ధరణ చర్యలను ప్రతిఘటించాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా సంస్థ నాయకురాలు హరిందర్‌బింద్‌ కౌర్‌ పిలుపునిచ్చారు. ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర 8వ మహాసభలను శనివారం ఆమె ప్రారంభించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పార్టీలకతీతంగా ఏడాది పాటు సాగిన ఉద్యమంలో మహిళల పాత్ర ప్రధానమని గుర్తుచేశారు. వ్యవసాయ రంగం సంక్షోభం అంచున ఉండగా, పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలకు నేతృత్వం వహించిన జెబా ఆఫ్రిన్‌ మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగాన్ని, లౌకిక స్ఫూర్తిని కాలరాస్తూ, హిందూత్వ ఎజెండాతో సాగుతోందని విమర్శించారు. ఎన్‌ఆర్సీ, సీఏఏ ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుల ఇళ్లను కూల్చడం రాజ్యాంగ సమ్మతమేనా అని ప్రశ్నించారు. మహాసభల్లో ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు పి.రాజ్యలక్ష్మి, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.విష్ణు, ప్రధాన కార్యదర్శి బి.పద్మ, ఉపాధ్యక్షురాలు రమాసుందరి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో అరుణోదయ కళాకారుల ర్యాలీ ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని