సంక్షిప్త వార్తలు (6)

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లకు భారీ స్పందన లభించింది. ఒక్కరోజే 94,263కు పైగా కేసులు పరిష్కారం కాగా, వీటిలో 87,805 పెండింగ్‌, 6,458

Updated : 14 Aug 2022 06:33 IST

లోక్‌ అదాలత్‌లలో 94,263 కేసుల పరిష్కారం

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లకు భారీ స్పందన లభించింది. ఒక్కరోజే 94,263కు పైగా కేసులు పరిష్కారం కాగా, వీటిలో 87,805 పెండింగ్‌, 6,458 ప్రీలిటిగేషన్‌ కేసులున్నాయి. రూ.93.07 కోట్ల పరిహారం అందజేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 380 లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి అవకాశమున్న పలు కేసుల్ని ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి బెంచ్‌లను నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న 451 కేసులు పరిష్కరించి, రూ.3.34 కోట్ల పరిహారం బాధితులకు అందజేశారు. లోక్‌ అదాలత్‌లకు సహకరించిన న్యాయవాదులు, అధికారులు, కక్షిదారులకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత కృతజ్ఞతలు తెలిపారు.


ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మారేష్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ భవానీపురం ప్రాంతానికి చెందిన డాక్టర్‌ ఎన్‌.మారేష్‌ నియమితులయ్యారు. శనివారం హైదరాబాద్‌ విద్యానగర్‌ బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమానికి విరామం లేదన్నారు.


స్వల్పంగా కంపించిన భూమి

వరికుంటపాడు, పామూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, ఉదయగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం 5:11 గంటలకు, రాత్రి 9:09 గంటలకు పెద్దశబ్దంతో 3 సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతంలోనూ శనివారం స్వల్పంగా భూమి కంపించింది. పామూరు పట్టణంలోని తూర్పు, ఆకుల వీధులు.. మండలంలోని తిరగలదిన్నె, గోపాలపురం, నర్రమారెళ్ల గ్రామాల్లో మూడు సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు.


నేడు ఐటీ సమన్వయకర్తలు, వాలంటీర్లతో పవన్‌ సమావేశం

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదివారం మంగళగిరిలో ఐటీ సమన్వయకర్తలు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఐటీ నిపుణుల సహాయ సహకారాలు ఏ రకంగా వినియోగించుకోవాలనే అంశాన్ని చర్చిస్తారు. పార్టీ నేతలు, శ్రేణులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌, ఐటీ విభాగం ఛైర్మన్‌ మిరియాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను నిర్వహించనున్నారు.


పదోన్నతుల్లో ఫీడర్‌ కేటగిరీ సర్వీసునే తీసుకోవాలి: ఉపాధ్యాయ సంఘాలు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులకు మెరిట్‌ కం రోస్టర్‌, ఫీడర్‌ కేటగిరీ సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ, బహుజన ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. సర్వీసు రెగ్యులరైజేషన్‌, ప్రొబేషన్‌ ఖరారు తేదీని తీసుకోవడం వల్ల చాలామందికి పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నాయి. గతంలో మెరిట్‌ కం రోస్టర్‌, ఫీడర్‌ కేటగిరీ సర్వీసునే ప్రాతిపదికగా తీసుకొని పదోన్నతులు కల్పించారని, ఇప్పుడూ అదే విధానాన్ని పాటించాలని డిమాండ్‌ చేశాయి.


బోధనేతర పనులతో ఉపాధ్యాయుల్లో మానసిక ఆందోళన: ఫ్యాప్టో

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులకు రకరకాల యాప్‌ల పేరుతో బోధనేతర కార్యక్రమాలు కేటాయిస్తూ మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఫ్యాప్టో) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మంజుల విమర్శించారు. ‘‘పాఠశాలల ప్రారంభంలో ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు ఉండవని, బోధనకే పరిమితం చేస్తామని అధికారులు చెప్పారు. యాప్‌ల సంఖ్యను కుదించి మరింత సరళీకరణ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఉపాధ్యాయుల సొంత సెల్‌ఫోన్‌లోనే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అంటున్నారు. నెట్‌ భారం సైతం వారిపైనే వేస్తున్నారు. విద్యాకానుక కిట్లు, విద్యార్థుల హాజరు, బేస్‌లైన్‌ పరీక్ష ఫలితాలు నమోదు చేయాలంటూ యాప్‌లను పెట్టి, సకాలంలో అప్‌లోడ్‌ చేయలేదని వందల మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయులను బోధన పనులకే పరిమితం చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని