రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం

‘రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతో పాటు పటిష్ఠ బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఈ

Published : 16 Aug 2022 03:15 IST

ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతాల ఆత్మగౌరవానికి ఇదే పునాది
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం వై.ఎస్‌.జగన్‌

ఈనాడు, అమరావతి: ‘రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతో పాటు పటిష్ఠ బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఈ మూడేళ్లలో మా ప్రభుత్వం మనసుపెట్టి తీసుకొచ్చిన మార్పు ఇది’ అని సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. వివిధ రంగాల్లో గత మూడేళ్లలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు కొద్దిమంది వ్యక్తులకు ప్రయోజనం కల్పించేందుకు ఉద్దేశించినవి కావని, అవి వ్యవస్థను మార్చేవన్నారు. రానున్న దశాబ్దాల్లో వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్ని, మహిళల అభ్యదయాన్ని, సామాజిక వర్గాలకు అందేలా రాజకీయ అధికారాన్ని నిర్ణయించే మార్పులని వివరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అధికారంలోకి వచ్చాక అందరూ మన ప్రజలే అని నమ్మి ప్రతి ఒక్క పథకంలోనూ సంతృప్త స్థాయి విధానాలను అమలు చేశామని గుర్తు చేశారు. అందుకే లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రధానాంశాలివీ...

వాటి అన్వేషణే మా మూడేళ్ల పాలన

‘స్వతంత్ర దేశంగా, అంతర్జాతీయంగా భారతీయులు సాధించిన విజయాలకు కొదవలేదన్నది ఎంత వాస్తవమో.. ఒక దేశంగా భారత్‌కు లభించిన స్వతంత్రం వ్యక్తులు, కులాలు, ప్రాంతాలుగా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేక మంది ప్రజల్లో ఇప్పటికీ ఉండిపోయిందనేది అంతే వాస్తవం. సమ సమాజం, సామాజిక న్యాయం, చదువుకునే హక్కు, మహిళలకు సమాన హక్కు, దోపిడీకి గురికాకుండా జీవించే రక్షణ కోసం ఈ గడ్డపై జరుగుతున్న పోరాటాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవన్నీ సమాజంలో జరుగుతున్న ఉద్యమాలు. వీటన్నింటికీ మనం మాటలతో కాకుండా చేతలతో సమాధానాలు ఇవ్వాలి. వాటి అన్వేషణే మా మూడేళ్ల పాలన.

రైతులు అర్ధాకలితో ఉండటాన్ని, భవన నిర్మాణ కార్మికులు గుడిసెల్లో జీవించటాన్ని, ప్రభుత్వ బడికెళ్లే పేదల పిల్లలు కేవలం తెలుగు మాధ్యమంలోనే చదవక తప్పని పరిస్థితిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పోకడల్ని, వైద్యం ఖర్చు భరించలేక నిస్సహాయంగా చనిపోవడాన్ని... మన రాష్ట్రానికి చెందిన కొందరు పరిపాలనగా చెప్పుకొంటారని రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా?’ అని ప్రశ్నించారు.

మూడేళ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం

‘ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే 2.7 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశాం. గత మూడేళ్లలో రైతు సంక్షేమానికి రూ.83 వేల కోట్లు వెచ్చించాం. వ్యవసాయంపై రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం. మా మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది.

పేదలకు ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే 1.25 కోట్ల జనాభాకు సొంతిల్లు లేదని తేలింది. వీరికి ఇప్పటికే ఇళ్ల పట్టాలిచ్చాం. 21 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నాం. వివిధ పథకాలతో విద్యారంగంపై రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని వివరించారు.

శకటాలు, కవాతు ప్రదర్శనలకు బహుమతులు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ శాఖల శకటాలు, సాయుధ బలగాల కవాతు ఆకట్టుకుంది. గ్రామ వార్డు సచివాలయ శాఖ (గడప గడపకూ ప్రభుత్వం), విద్యాశాఖ (నాడు-నేడు), గృహనిర్మాణ శాఖ (నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు) శకటాలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి. కవాతు ప్రదర్శనలో విజయనగరంలోని ఏపీఎస్పీ అయిదో బెటాలియన్‌ ప్రథమ, కర్నూలులోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని