సంక్షిప్త వార్తలు (4)

గిరిజనాభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. ఎస్టీల విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో

Updated : 26 Sep 2022 05:54 IST

గిరిజనాభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గిరిజనాభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. ఎస్టీల విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో విజయవాడలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘సంక్షేమ పథకాలను గిరిజనులకు అందించడానికి ఎస్టీ కమిషన్‌ చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఆదివాసీల రాజ్యాంగపరమైన హక్కులను కాపాడతాం’ అని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ.. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా గిరిజన బాలికల పాఠశాలల్లో తనిఖీల పేరిట బయటి వ్యక్తులు వస్తే సహించబోమన్నారు. గిరిజన ఉపాధ్యాయ సంఘాలను గుర్తిస్తామని, 5 డిప్యూటీ డీవో పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పలు సమస్యలను ఉపాధ్యాయులు కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. కమిషన్‌ కార్యదర్శి సతీశ్‌, సభ్యులు విశ్వేశ్వరరాజ, శంకర్‌నాయక్‌, మురళి, లిల్లీ, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్‌ వాటా 40 శాతం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యం 18,800 మెగావాట్లలో సుమారు 40 శాతం (7,500 మెగావాట్లు) పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే అందుతోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పంప్డ్‌ స్టోరేజి పవర్‌ ప్రాజెక్టులతో పాటు విద్యుత్‌ ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందని ఆయన చెప్పారు. ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో ఏపీ, కేరళ తరహాలో మిగిలిన రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలు ఏర్పాటు చేయాలని బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే సూచించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్‌ టన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌ (ఎంటీవోఈ) పొదుపు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు.


సూపర్‌వైజర్ల నియామకాన్ని ఆపాలి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌2) పోస్టుల నియామకాన్ని ప్రభుత్వం నిలిపేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ.బేబిరాణి, కే. సుబ్బరావమ్మ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. మే 18న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ‘కీ’ని ఇప్పటివరకు విడుదల చేయకపోవడం పలు అనుమానాలు, అపోహలకు తావిస్తోందని స్పష్టం చేశారు. పరీక్ష రాసిన వారికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియజేయాలని, ఆ తర్వాతే మెరిట్‌ ఆధారంగా వీడియోలు తీసి ఫైనల్‌ లిస్టు ప్రకటించాలని కోరారు.


బదిలీలు చేయాలి

ఏపీ దళిత, గిరిజన ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తమ స్వస్థలాల నుంచి సుదూర ప్రాంతాల్లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రలను బదిలీ చేయాలని ఏపీ దళిత, గిరిజన ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్న కొందరు ఆరోగ్యమిత్రలు వారి స్వస్థలాల నుంచి సుమారు 70 కి.మీ దూరం వెళ్లి పని చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. రవాణా ఖర్చులకే సగం జీతం ఖర్చవుతోందని వాపోయారు. దీనిపై ప్రభుత్వ స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts