దసపల్లా.. వారికి రసగుల్లా

అది విశాఖ చరిత్రలోనే అరుదైన వ్యవహారం! స్థిరాస్తి వ్యాపారంలో ఒక అసాధారణ ఒప్పందం! రాష్ట్రంలో ఎక్కడా ఇంత వరకు అలాంటి విస్తుగొలిపే ఒప్పందం జరిగి ఉండదేమో!

Updated : 07 Oct 2022 06:42 IST

విశాఖ నడిబొడ్డున కారుచౌకగా భూమి బేరం
విస్తుగొలిపే డెవలప్‌మెంట్‌ ఒప్పందం
భూమి యజమానులుగా చెప్పుకుంటున్నవారికి పప్పుబెల్లాలు
డెవలపర్‌కు అనుచిత లబ్ధి
ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- విశాఖపట్నం వన్‌టౌన్‌

ది విశాఖ చరిత్రలోనే అరుదైన వ్యవహారం! స్థిరాస్తి వ్యాపారంలో ఒక అసాధారణ ఒప్పందం! రాష్ట్రంలో ఎక్కడా ఇంత వరకు అలాంటి విస్తుగొలిపే ఒప్పందం జరిగి ఉండదేమో! ఒకటా రెండా? చదరపు గజం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల విలువ చేసే చోట వాటి యజమానులుగా చలామణి అవుతున్నవారికి పప్పుబెల్లాలు పంచిపెడుతూ, డెవలపర్‌ తన ఖాతాలో రూ.కోట్లు వేసుకోబోతుంటే షాకింగే కదా? అత్యంత విలువైన ఆ భూముల్లో చేపట్టే ప్రాజెక్టులో డెవలపర్‌ 70 శాతానికి పైగా తీసుకుంటూ, భూయజమానులమని చెబుతున్నవారికి 30 శాతం కంటే తక్కువ ఇవ్వడం కంటే విస్తుగొలిపే ఒప్పందం ఏముంటుంది? విశాఖ నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉన్న ఆ స్థలాలు తమ సొంతమని చెబుతూ, వాటి కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న 64 మంది వ్యక్తుల నుంచి 15 ఎకరాల భూముల్ని.. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా తీసేసుకుంటున్నారంటే దాని వెనుక ఎంత మంత్రాంగం నడిచి ఉండాలి? అయిదేళ్ల క్రితం ఆ భూములపై విచారణ జరపాలంటూ అప్పటి వైకాపా నేత, ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారమే ఆ భూముల విలువ రూ.1,500 కోట్లు. ఈ అయిదేళ్లలో వాటి విలువ ఇంకెంత పెరిగి ఉండాలి? అంత విలువైన భూముల్ని కారుచౌకగా తీసుకుంటున్న ఆ డెవలపర్‌ వెనుక.. ఎంత బడాబాబులు, పలుకుబడిగలవాళ్లు ఉండుంటారు? విశాఖలోని దసపల్లా భూముల వ్యవహారాన్ని గమనిస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి.

మరీ అంత హాస్యాస్పదమా?

దసపల్లా భూముల్లో విలాసవంతమైన నివాస, వాణిజ్య టవర్ల నిర్మాణానికి ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ.. ఆ స్థలాల యజమానులుగా చెలామణీ అవుతున్న 64 మందితో చేసుకున్న డెవలప్‌మెంట్‌ ఒప్పందం కంటే హాస్యాస్పదం మరొకటి ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దసపల్లా భూములు విశాఖ నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతం ఇప్పటికే వాణిజ్యపరంగా చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అక్కడ కొనడానికి స్థలం దొరకడమే గగనం. అలాంటిచోట భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా 15 ఎకరాల భూమి అందుబాటులో ఉంటే, దాని గిరాకీ ఏ స్థాయిలో ఉండాలి? స్థల యజమానులు ఎన్ని డిమాండ్లు పెడతారు? ఏదైనా స్థలాన్ని డెవలప్‌మెంట్‌కి ఇచ్చినప్పుడు.. నిర్మించిన భవనంలో 50 శాతం భూయజమానికి, 50 శాతం బిల్డర్‌కు వెళ్లేలా ఒప్పందం చేసుకోవడం సహజం. ఎక్కడో మరీ నగరానికి దూరంగా, స్థలం విలువ తక్కువగా ఉన్న చోట్ల తప్ప ఏ ఒప్పందంలోనైనా భూ యజమానులకు కనీసం 50 శాతం వాటా ఉంటుంది. భూమి విలువ తక్కువగా ఉండి, అంత డిమాండ్‌ లేని చోట కూడా భూ యజమాని వాటా 40 శాతానికి తగ్గదు. భూమి విలువ పెరిగే కొద్దీ భూయజమానుల వాటా 60, 70 ఇలా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఎంతో విలువైన దసపల్లా భూముల ఒప్పందంలో.. డెవలపర్‌ 70 శాతం కంటే ఎక్కువ తీసేసుకుంటూ, భూ యజమానులుగా చలామణి అవుతున్నవారికి 30 శాతం కంటే తక్కువ ఇవ్వడం విస్మయపరుస్తోంది.

ఇదేం చోద్యం?

దసపల్లా భూ యజమానులతో, ఎష్యూర్‌ డెవలపర్స్‌ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం... షెడ్యూల్‌-ఎ, బీల్లో కలిపి మొత్తం 75,939 చ.గజాల స్థలం అందుబాటులో ఉంది. వీటిలో మొత్తం 27.55 లక్షల చ.అడుగుల్లో భవనాలు నిర్మిస్తారట. ఇందులో దానిలో 7,96,580 చ.అడుగులు మాత్రం స్థల యజమానులుగా చలామణి అవుతున్నవారికి ఇస్తారట. మిగతా 19,58,420 చ.అడుగుల భవనాల్ని డెవలపర్‌ తీసుకుంటారట. అంటే ఇక్కడ స్థలాల యజమానులమంటున్నవారికి ఇచ్చేది కేవలం 29 శాతమే. ఇంతకంటే చోద్యం ఇంకెక్కడైనా ఉంటుందా? ఈ ప్రాజెక్టులో భాగంగా నివాస, వాణిజ్య భవనాలు రెండింటినీ నిర్మిస్తున్నారు. కానీ స్థలాల యజమానులుగా చలామణి అవుతున్నవారికి కేవలం నివాస భవనాల్లో మాత్రమే ఫ్లాట్లు కేటాయిస్తారు. వాణిజ్య నిర్మాణాల్లో వాటా ఇవ్వరు.

అంతర్గత లావాదేవీ ధరే చ.అడుగుకు రూ.6 వేలు

దసపల్లా భూ యజమానులుగా చలామణి అవుతున్నవారికి వారి స్థలం విస్తీర్ణాన్ని బట్టి... ప్రాజెక్టు పూర్తయ్యాక ఒక్కొక్కరికి ఎన్ని చ.అడుగుల నిర్మిత ప్రాంతం కేటాయించేదీ ఒప్పందంలోనే పేర్కొన్నారు. ఏ స్థల యజమానికైనా ఇప్పుడు కేటాయించిన బిల్టప్‌ ఏరియా కంటే ఎక్కువ వచ్చినా, వారి నుంచి కొంత బిల్టప్‌ ఏరియాను డెవలపర్‌ తీసుకోవలసి వచ్చినా చ.అడుగుకి రూ.6 వేల చొప్పున చెల్లించాలి. అంటే అంతర్గత లావాదేవీ కోసమే ఆ ప్రాజెక్టులో చ.అడుగు కనీస ధరను రూ.6 వేలుగా నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో దానికి కనీసం 50 శాతం ఎక్కువ ధర ఉంటుందనుకున్నా చ.అడుగు ధర కనీసం రూ.9 వేలు.


అబ్బో...ఒక్కొక్కరికీ రూ.50 వేలు కూడా!

త్యంత ఖరీదైన స్థలాలకు సంబంధించిన కొన్ని డెవలప్‌మెంట్‌ ఒప్పందాల్లో.. స్థలాల యజమానులకు మెజారిటీ వాటా ఇవ్వడంతో పాటు, డెవలపర్‌ కొంత డబ్బు కూడా చెల్లిస్తారు. సహజంగానే అది రూ.కోట్లలో ఉంటుంది. దాన్ని ‘గుడ్‌విల్‌ ఎమౌంట్‌’గా పిలుస్తారు. కానీ దసపల్లా భూములకు సంబంధించి స్థల యజమానులుగా చెలామణీ అవుతున్న వారికి డెవలపర్‌ ఇస్తున్న మొత్తం ఎంతో తెలుసా? ఒక్కొక్కరికి రూ.50 వేలు. అంటే 64 మందికి ఇచ్చే మొత్తం రూ.32 లక్షలన్న మాట!  దసపల్లా స్థలాలపై హక్కుదారులమని చెబుతున్న వారు సామాన్య వ్యక్తులేమీ కాదు. వారిలో బడా వ్యాపారులు, బడా బిల్డర్లూ ఉన్నారు. వారి నుంచి ఒక డెవలపర్‌ అత్యంత కారుచౌకగా భూములు తీసుకోవడం ఇప్పుడు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


డెవలపర్‌ కంపెనీ విజయసాయిరెడ్డి సన్నిహితులది..

నిధులు సమకూర్చిన కంపెనీ ఆయన కుమార్తె, అల్లుడిదీ

సపల్లా భూముల లావాదేవీలకు సంబంధించి తెదేపా, జనసేన నాయకులు విడుదల చేసిన పత్రాల ప్రకారం.. విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి ఉమేష్‌, ఆయన భార్య లక్ష్మి డైరెక్టర్లుగా 2020 జనవరి 6న ‘వైజాగ్‌ కోస్ట్‌ రిసార్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. అదే ఏడాది జూన్‌ 12న శ్రియపురెడ్డి గోపీనాథ్‌రెడ్డి అనే వ్యక్తి ఆ కంపెనీలో డైరెక్టర్‌గా చేరారు. ఆ కంపెనీ పేరును ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీగా మార్చారు. 2020 సెప్టెంబరు 7న పెనక నేహారెడ్డి, పెనక రోహిత్‌రెడ్డి డైరెక్టర్లుగా అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే కంపెనీ ఏర్పాటైంది. వారిద్దరూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడు అని జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ పేర్కొన్నారు. ‘ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎష్యూర్‌ డెవలపర్స్‌ సంస్థ రూ.9.75 కోట్ల స్టాంప్‌ డ్యూటీ చెల్లించింది. ఆ డబ్బు విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ నుంచే ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌కు వెళ్లింది’ అని మూర్తియాదవ్‌ చెప్పారు. ‘దసపల్లా భూములకు యజమానులుగా చెబుతున్న 64 మందితో.. ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ సంస్థ 2021 జూన్‌, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకుంది. ‘నిషిద్ధ’ జాబితాలో ఉంచిన దసపల్లా భూములకు సంబంధించిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయడమే నిబంధనలకు విరుద్ధం’ అని తెదేపా విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఉమేష్‌, గోపీనాథ్‌రెడ్డి.. విజయసాయిరెడ్డికి చెందిన ట్రస్ట్‌లో సభ్యులు, అత్యంత సన్నిహితులని దీన్నిబట్టే వెనకున్న అదృశ్యశక్తులెవరో తెలుస్తోందన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts