ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ

 ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 07 May 2024 06:53 IST

వేంపల్లె, నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 6న నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 8 నుంచి జూన్‌ 25 వరకు ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో లేదా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ rgukt.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలు జూలై ఒకటో తేదీ నుంచి 5 వరకు నూజివీడు క్యాంపస్‌లో పరిశీలన చేస్తామన్నారు. పరిశీలన అనంతరం జులై 11న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులందరికీ జులై మూడో వారంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో క్యాంపస్‌కు 1,000 సీట్లు, ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు అందించనున్నట్లు చెప్పారు. పీయూసీకి ట్యూషన్‌ ఫీజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు, బీటెక్‌ ప్రోగ్రాంకు ఏడాదికి రూ.50 వేలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 25 శాతం సూపర్‌ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షలుగా నిర్ణయించామన్నారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ నియమావళి అనుసరించి సీట్లు కేటాయిస్తామన్నారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు 4 శాతం మార్కులు కలుపుతామన్నారు. రెండేళ్ల పీయూసీ అనంతరం విద్యార్థులకు బయటకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా కేటగిరీ ప్రకారం ప్రాధాన్యత క్రమంలో క్యాంపస్‌లను కేటాయిస్తామన్నారు. అందువల్ల అభ్యర్థులు తమ క్యాంపస్‌ ప్రాధాన్యతలను జాగ్రత్తగా సూచించాలని తెలిపారు. ఒకసారి క్యాంపస్‌ నిర్ధారణ జరిగిన తర్వాత బదిలీకి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే చదవాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు