భరోసానూ బరికేశారు!

రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు.

Updated : 07 May 2024 06:42 IST

రైతులకు రూ.9,830 కోట్ల ఎగనామం
వ్యవసాయ రాయితీ పథకాలనూ ఎత్తేసిన ఘనుడు జగన్‌
ఐదేళ్ల పాలనలో అడుగడుగునా దగా
ఈనాడు, అమరావతి

రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు.

రైతు భరోసా కింద ఏపీలో ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి ఇచ్చింది రూ.7,500. ఐదెకరాలున్నా వచ్చింది రూ.7,500 మాత్రమే. అంటే ఐదేళ్లలో అందింది రూ.37,500 మాత్రమే.

రెండింటిలో ఏది గొప్ప... జగన్‌ మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు సాయం చేస్తున్నామంటారు. చెప్పేది అబద్ధమే అని తెలిసినా... దాన్ని పదేపదే వల్లెవేయడం ద్వారా రైతుల్ని నమ్మించడంలో ఆయన ఎంత నేర్పరో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ?

రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని జగన్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఐదేళ్లలో రూ.37,500 మాత్రమే ఇచ్చారు. పంట వేయడానికి ముందే మే నెలలో రైతు ఖాతాలో ఒకేసారి రూ.12,500 జమ చేస్తామని చెప్పిన జగన్‌... దాన్ని రూ.7,500 తగ్గించారు. అంటే ఇస్తామన్న రూ.50 వేలలో రూ.12,500 కోత పెట్టారు. ఇది నమ్మిన రైతులకు ద్రోహం చేయడం కాదా?

ఆయన చెప్పే మరో పచ్చి అబద్ధమేంటో తెలుసా? రైతు భరోసా రూపంలో వైకాపా సర్కారు ఇచ్చే రూ.7,500 మొత్తంతో అన్నదాతల ఖర్చులన్నీ తీరిపోతాయట. అందుకే పంట నష్టపోయినా వారికి వచ్చే ఇబ్బంది ఏముంటుందని అన్నదాతలను చులకన చేసి మాట్లాడటమూ ఆయనకే చెల్లుతుందేమో?

అది చాలదన్నట్లు రైతులకు అయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చులో 80% తామే భరిస్తున్నామంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అధికారం కోసం ఇలా పచ్చి అబద్ధాలు చెప్పాలా? రూ.7,500 íట్టుబడితో ఎన్ని ఎకరాలు సాగవుతుంది?

తీవ్ర కరవొస్తే దెబ్బతిన్న పంటల పరిశీలనకూ వెళ్లని పాలకుడు... తుపాను అతలాకుతలం చేస్తే కార్పెట్లు వేసుకుని వెళ్లి అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సీఎం.. దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగనే. తాను రైతు బిడ్డనని, తమది రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పే ఆయన.. ఐదేళ్ల పాలనలో రైతు భరోసా రూపంలో అన్నదాతలకు ఎగ్గొట్టిందెంతో తెలుసా? ఏకంగా రూ.9,830 కోట్లు. ఒక్కో రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.12,500 ఎగ్గొట్టారు. అయినా వారిని ఎంతో ఉద్ధరిస్తున్నామని, ఇతర పథకాలెందుకనే భావనతో గతంలో ఉన్న రాయితీ పథకాలను ఎత్తేశారు. సమస్యలన్నింటికీ రైతు భరోసా ఒక్కటే మందు అన్నట్లుగా వారిని నిలువెల్లా వంచించారు. ఐదేళ్లుగా వర్షాలు, వరదలు, కరవులతో వ్యవసాయంలో సంక్షోభం నెలకొన్నా... రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఎంతమాత్రం పట్టించుకోలేదు. వరి సహా   ఇతర పంటల సాగు ఏటికేడు తగ్గిపోతున్నా.. ఉత్పత్తి పెరుగుతోందంటూ భుజాలు చరచుకుంటున్నారు.

జగన్‌ వచ్చాకే వ్యవసాయం మొదలైనట్లు కలరింగ్‌

గతంలో రాష్ట్రంలో వ్యవసాయమే లేదని, తామొచ్చాకే ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు వ్యవసాయ పాఠాలు మొదలు పెట్టినట్లు జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. 10,778 రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) ఏర్పాటు చేసి రైతుల చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూ అదేపనిగా బాకాలూదుతోంది. ఆర్‌బీకేల్లో ఏడు వేల మందికి పైగా సిబ్బంది కొరత ఉంది. వాటికి భవనాల్లేవు, మౌలిక వసతుల్లేక సిబ్బంది అల్లాడుతున్నారు. రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు, సూచనలు అందించాల్సిన బాధ్యత వారిది. అయితే వ్యవసాయంలో కీలకమైన విస్తరణను గాలికొదిలేశారు. అక్కడ వారిచేత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మిస్తున్నారు.

నిధుల విడుదలలో కొత్త ఎత్తుగడ

ఏ ప్రభుత్వమైనా పంటల బీమా, సున్నా వడ్డీ, రాయితీలను పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటుంది. కానీ, తరచూ వాటికోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి విడుదల చేసిన సందర్భాలు లేవు. వైకాపా పాలనలో కొత్త ఎత్తుగడ మొదలైంది. పథకాలకు నిధులను విడుదల చేసే కార్యక్రమం పేరిట ఏడాదికోసారి హంగామా చేస్తున్నారు. రైతులకు కలిగే మేలు పావలా అయితే ప్రచారం మాత్రం ముప్పావలా తీరున ఉంటోంది.

తెదేపా హయాంలో రూ.50 వేల రుణాలకు ఒకేసారి మాఫీ

తెదేపా హయాంలో రుణమాఫీ అమలులో భాగంగా రైతులకు రూ.15,148 కోట్లు ఇచ్చారు. రూ.50వేల లోపు ఉన్న లక్షల మంది పంట రుణాలను ఒకేసారి రద్దుచేశారు. 2.23 లక్షల మంది ఉద్యాన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున ఒకేసారి రూ.50వేల వరకున్న రుణాల్ని రద్దు చేశారు. దీనికి రూ.385 కోట్లు ఇచ్చారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద 2018-19లో రూ.2వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

  • ఏడాదికి రూ.80 కోట్ల విలువైన సూక్ష్మపోషకాలను అందించారు. దీనితో రైతులకు దిగుబడులు పెరిగాయని, అదనపు ఆదాయం లభించిందని అధ్యయనాల్లో వెల్లడైంది. జగన్‌ వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు.
  • వ్యక్తిగత యాంత్రీకరణ కింద టార్పాలిన్లు, పిచికారీ యంత్రాలు, ఇతర వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై ఇచ్చారు. వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతింటున్నా... టార్పాలిన్లు కూడా ఇవ్వకుండా వైకాపా సర్కారు కళ్లు మూసుకుంది. రైతుల్ని వానలు, వరదలకు వదిలేసింది.
  • గతంలో సున్నా వడ్డీతోపాటు పావలా వడ్డీ పథకాలను అమలు చేశారు.

పీఎం కిసాన్‌ సొమ్మునూ ఖాతాలో వేసుకుని..

రైతుభరోసా కింద ఇచ్చే సాయం దేశంలో మరెక్కడా ఇవ్వడం లేదని జగన్‌ చేసే ప్రచారమంతా అసత్యమే. ఐదేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,500 మాత్రమే ఇచ్చారు. కానీ,    రూ.13,500 ఇస్తున్నామంటూ కేంద్రం అందించే పీఎం కిసాన్‌ సొమ్మునూ తన ఖాతాలో కలిపేశారు. ఐదేళ్లలో ఆయనిచ్చింది రూ.19,170 కోట్లే. హామీకి అనుగుణంగా రూ.29 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే... అందులో రూ.9,830 కోట్లు ఎగ్గొట్టారు. అదే తెలంగాణలో ఏడాదికి రూ.14,800 కోట్ల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేశారు. జగన్‌ మాత్రం వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలను కుదించి, రాయితీ ఎత్తేయడం ద్వారా అన్నదాతలకు రూ.5వేల కోట్లకు పైగా కోత పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని