ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి

పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం..

Updated : 07 May 2024 06:43 IST

రాష్ట్రంలో అప్రజాస్వామిక ప్రభుత్వం పోవాలి
సామాజికవేత్త డా. గుంటుపల్లి శ్రీనివాస్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. ఆర్థికంగా దెబ్బతీయడం వంటివి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వం పోయి.. ప్రజలు స్వేచ్ఛగా ప్రశ్నించే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. ‘ఎలాంటి ప్రభుత్వం కావాలి?’ అంటూ ప్రజల్ని చైతన్యపరిచేలా సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ప్రస్తుతం న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చాలావరకు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కోర్టు తీర్పులను గౌరవించే ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం. యువత భవితను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. వారిని ఉత్పత్తిలో భాగస్వాముల్ని చేసే నాయకుల్ని మాత్రమే ఎన్నుకోవాలి. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికాలో సామాజిక భద్రత కింద ఇచ్చే నెలవారీ పింఛను 2035 నాటికి 25 శాతం తగ్గుతుంది. అమెరికా వంటి దేశాల్లోనే వృద్ధులకు నిర్దేశించిన పింఛను ఇవ్వలేకపోతే.. అందినకాడికి అప్పులు చేసే సర్కారులో సంక్షేమ పథకాలు ఎక్కువ కాలం కొనసాగవు. ఈ పరిస్థితిని నివారించాలంటే అభివృద్ధిపై దృష్టిపెట్టి, సంపద సృష్టించే ప్రభుత్వం రావాలి. స్వల్పకాలిక రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించే వారు కాకుండా.. ముందుచూపుతో నడిపించే దార్శనికులు కావాలి.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చదివే వారిలో 10 లక్షల మంది విద్యార్థులు తెలుగులో రెండు వాక్యాలున్న పేరా చదవలేరు. 17 లక్షల మంది పైగా ‘ఐ లైక్‌ దిస్‌ బుక్‌’, ‘దిస్‌ ఈజ్‌ మై హౌస్‌’ వంటి మూడు పదాలున్న ఆంగ్ల వాక్యాలు చదవలేరు. పిల్లలకు కనీస నైపుణ్యాలు లేవని వారి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా, వాస్తవాలను మార్కులతో కప్పేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనల్ని బడి స్థాయిలోనే పిల్లలకు నేర్పించాలి. అందుకు మాతృభాషలో విద్యా బోధన చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అంతర్జాతీయ సైన్స్‌ ల్యాబ్‌లు ఉన్నప్పుడే వారిలో శాస్త్రీయ సృజనాత్మకత పెరుగుతుంది. ఇవి చేయడానికి దార్శనికత ఉన్న పాలకులు కావాలి’’ అని శ్రీనివాస్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని