ఇద్దరు నేతలకే ‘సంకల్పసిద్ధి!’

‘కోటీశ్వరుడయ్యే అవకాశం పిలుస్తోంది రా.. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ పేదవాడు ధనవంతుడు అవడం కేవలం సంకల్ప్‌ మార్ట్‌తోనే సాధ్యం’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు సంకల్ప్‌ మార్ట్‌ నిర్వాహకులు.

Published : 25 Nov 2022 04:50 IST

రూ.1100 కోట్ల డిపాజిట్ల వసూళ్లలో ప్రజాప్రతినిధుల కీలకపాత్ర
తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ డిపాజిటర్లు
పోలీసులు, వారి బంధువుల్లోనూ బాధితులు

ఈనాడు, అమరావతి: ‘కోటీశ్వరుడయ్యే అవకాశం పిలుస్తోంది రా.. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ పేదవాడు ధనవంతుడు అవడం కేవలం సంకల్ప్‌ మార్ట్‌తోనే సాధ్యం’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు సంకల్ప్‌ మార్ట్‌ నిర్వాహకులు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.1,100 కోట్లు వసూలు చేశారు. ఇక బోర్డు తిప్పేద్దామనుకునే క్రమంలో ఫిర్యాదు రావడంతో సంస్థ బండారం బయటపడింది. ఇందులో కీలకపాత్రధారులుగా భావిస్తున్న వేణుగోపాల్‌, కిరణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు పేరుకే నిర్వాహకులని, తెరవెనుక ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న ప్రచారం ఉంది. వీరి సన్నిహితులే వెనక ఉండి ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా వారే శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ నెల 13న విజయవాడలోని ఓ హోటల్‌లో కీలక వ్యక్తులు సమావేశం నిర్వహించి దీనిని ఎలా తొక్కిపెట్టాలా అని సమాలోచనలు సాగించినట్లు సమాచారం.

కనిగిరిలో పోలీసుల అదుపులో ఇద్దరు

విజయవాడ నగర పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయవాడతోపాటు ప్రకాశం జిల్లా కనిగిరి, కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, తదితర ప్రాంతాలకు బృందాలు వెళ్లాయి. కనిగిరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి నుంచి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకుని, రహస్య ప్రాంతంలో విచారణ జరిపారు. నిందితుల కుటుంబసభ్యులు, కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

సొమ్మంతా బెంగళూరుకు తరలింపు

సంస్థలో కీలక వ్యక్తులైన వేణుగోపాల్‌, కిరణ్‌ గన్నవరంలో స్థిరపడ్డారు. దీంతో ఈ ప్రాంతం వారే ఎక్కువ మంది డిపాజిట్‌ చేశారు. డబ్బు రెట్టింపవుతుందన్న ఆశతో విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన వ్యాపారులు, పోలీసులు, వారి బంధువులు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. పథకాలు బాగున్నాయని, తేలికగా డబ్బు సంపాదిస్తున్నామని నకిలీ సమీక్షలతో ఎక్కువ మందిని ఆకర్షించారు. నగదు విత్‌డ్రాయల్స్‌ను పది రోజుల క్రితం ఆపేశారు. డిపాజిటర్లు నిలదీయడంతో యాప్‌ హ్యాకయిందని, సరిచేస్తున్నామని నచ్చజెప్పి పంపారు. వ్యాపారంలో వసూలైన సొమ్మంతా ప్రతి శనివారం బెంగళూరులో ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి దాచేవారని తెలిసింది. అక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారని, బెంగళూరులో ఇటీవల కార్యాలయం కూడా తెరిచారని విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనూ కార్యాలయం ఏర్పాటు చేశారు. కనిగిరిలో ఓ ఆగ్రోఫామ్స్‌కు చెందిన భూమిలో 20 ఎకరాలు తీసుకున్నామని, ఇందులో ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నామని, స్థలంతోపాటు వీటిని కూడా కేటాయిస్తామని నిర్వాహకులు పలు పథకాల పేరుతో మోసం చేశారు. వాస్తవానికి నిర్వాహకులు ఎలాంటి భూములూ కొనలేదు. ఈ పథకాల్లో డబ్బు కట్టినవారికి కనిగిరిలో ప్లాట్‌ ఇస్తామని దస్తావేజుపై రాసిచ్చారు. ఇటీవల సత్తుపల్లిలో ఓ భూమికి సంబంధించి యజమానులతో ఒప్పందం చేసుకుని, ఆ పత్రాలను చూపించీ ప్రచారం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో నిత్యావసరాల మార్ట్‌లు తెరిచారు. డిపాజిట్‌దార్లు రూ.3 వేల విలువైన సరకులు కొంటే.. రూ.500 వరకు తగ్గింపు ఇస్తున్నారు. దీనిని ఎరగా చూపించి చాలా మందిని ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు