ముగ్గురు తెలుగువారికి జాతీయ పురస్కారాలు

దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Updated : 04 Dec 2022 04:43 IST

అందజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రదానం

ఈనాడు, దిల్లీ: దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఇందులో సర్వశ్రేష్ఠ్‌ దివ్యాంగ్‌జన్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్‌ కోటాబత్తిని పద్మావతి, శ్రేష్ఠ్‌ దివ్యాంగ బాలికగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన చిన్నారి శ్రేయా మిశ్ర, దివ్యాంగులకు ఉత్తమ ప్లేస్‌మెంట్స్‌ కల్పిస్తున్నందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ తరఫున కె.సతీశ్‌రెడ్డి అవార్డులు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన కోటాబత్తిని పద్మావతి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి దివ్యాంగులకు గానం, అభినయం, నృత్యం, కంప్యూటర్‌, కుట్టుపని, కొవ్వొత్తులు, సాఫ్ట్‌ టాయ్స్‌ తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రేయా మిశ్రకు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ 2020-21లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో జరిగిన నృత్య ప్రదర్శనలో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు. దివ్యాంగులకు ఉత్తమమైన ప్లేస్‌మెంట్స్‌ కల్పిస్తున్న ఏజెన్సీగా డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ను గుర్తించి సంస్థ ఛైర్మన్‌ కె.సతీశ్‌రెడ్డికి పురస్కారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని