అసలు ప్రత్యేక హోదాపై మీకు వాగ్దానం చేసిందెవరు?: వైకాపా ఎంపీని ప్రశ్నించిన స్పీకర్‌

‘ప్రతిసారి సభలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు.. అసలు మీకు ఆ వాగ్దానం ఎవరు చేశారు?’ అని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ను ప్రశ్నించారు.

Updated : 14 Dec 2022 07:50 IST

ఈనాడు, దిల్లీ: ‘ప్రతిసారి సభలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు.. అసలు మీకు ఆ వాగ్దానం ఎవరు చేశారు?’ అని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ను ప్రశ్నించారు. లోక్‌సభలో మంగళవారం భరత్‌ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీని నాటి యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిందని తెలిపారు. సభలో 25 మంది ఎంపీలుగా మేం మైనారిటీగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయపు తీవ్రతను గుర్తించాలి అని కోరారు. ఇద్దరు సోదరులు విడిపోయినప్పుడు ఒకరికి ఆస్తులు ఇచ్చి.. మరొకరి ఏం ఇవ్వకపోవడంపై తండ్రిగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ దశలో సభాపతి జోక్యం చేసుకున్నారు.. ‘విభజన బిల్లు ఎప్పుడు వచ్చిందని’ ప్రశ్నించారు. 2014లో అని పలువురు సభ్యులు బదులిచ్చారు. నాడు సభలో మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు అయిదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారని ఎంపీ తెలిపారు. ఈ దశలో భాజపా ఎంపీ నిశికాంత్‌ దూబే జోక్యం చేసుకున్నారు. నాడు వెంకయ్యనాయుడు మంత్రి కాదని తెలిపారు. ఈ దశలో తృణమూల్‌ ఎంపీ సౌగతారాయ్‌ స్పందిస్తూ 2014లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని తెలిపారు. విభజన సమయంలో వెంకయ్యనాయుడు హోదా పొడిగింపుపై మాట్లాడారని వివరించారు. సమయం ఆయిపోయిందని సభాపతి అనగా.. మరికొంత సమయాన్ని ఎంపీ కోరారు. తెదేపాకు చెంది ఓ ఎంపీ తాము జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని అబద్ధాలు చెప్పారని, తాము జీతాలు చెల్లించే స్థితిలోనే ఉన్నామని భరత్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని