Bapatla: బలిపశువుగా బాపట్ల ఆర్టీసీ డీఎం

ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను కాపాడటానికి ఏ అధికారి అయినా ప్రయత్నిస్తే  ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు.

Updated : 25 Dec 2022 10:50 IST

పోస్టు నుంచి తప్పించిన యాజమాన్యం
రూ.కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని వైకాపా కార్యాలయానికి ఇవ్వడంపై డీఎం అభ్యంతరం

ఈనాడు - అమరావతి : ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను కాపాడటానికి ఏ అధికారి అయినా ప్రయత్నిస్తే  ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. వైకాపా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆర్టీసీకి చెందిన రూ.కోట్ల విలువైన భూమిని కాపాడటానికి బాపట్ల ఆర్టీసీ డీఎం శ్రీనివాసరెడ్డి ప్రయత్నించడాన్ని పెద్ద నేరంగా ప్రభుత్వ పెద్దలు పరిగణించారు. తమ అభిమతానికి వ్యతిరేకంగా పని చేశారని ఆ పోస్టు నుంచి తప్పించి, ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

1990లో బాపట్లలో ఏపీఐఐసీ నుంచి ఆర్టీసీ 10.62 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇందులో 6.54 ఎకరాల్లో గ్యారేజీ నిర్మించుకుని 4.08 ఎకరాలను భవిష్యత్తు అవసరాలకు అట్టిపెట్టుకుంది. ఈ స్థలాన్ని 2003లో వెనక్కి తీసుకుంటామని ఏపీఐఐసీ ఆర్టీసీకి నోటీసిచ్చింది. వివిధ పన్నులు, నిర్వహణ వ్యయం తదితరాలు మినహాయించి రూ.3 వేల చెక్కును ఆర్టీసీకి పంపింది. తమ భవిష్యత్తు అవసరాలకు స్థలం కావాలంటూ చెక్కును తిప్పి పంపిన ఆర్టీసీ.. ఆ భూమి సాంకేతికంగా తమ పరిధిలోనే ఉందని భావించింది.

తాజాగా ఈ స్థలంలోనే రూ.16 కోట్ల విలువైన రెండెకరాల భూమిని ఏడాదికి రూ.వెయ్యి చెల్లించేలా ముప్పైమూడున్నర ఏళ్లకు వైకాపా జిల్లా కార్యాలయానికి లీజుకిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బాపట్ల జిల్లా ఆవిర్భవించిన వెంటనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైకాపాకు భూమి లీజుకు కేటాయించే తతంగం రహస్యంగా సాగింది. గుట్టుచప్పుడు కాకుండా బాపట్ల తహశీల్దారు ఈ నెల 15న రెండెకరాల భూమిని వైకాపాకు అప్పగించారు. వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణ పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేసే వరకు ఆర్టీసీ అధికారులకు కనీస సమాచారం  ఇవ్వలేదు.

అభ్యంతరం చెప్పినందుకే చర్యలు!

ఆర్టీసీ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మాణంపై ఆర్‌ఎం విజయ్‌కుమార్‌రెడ్డి, బాపట్ల డిపో మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి జిల్లా వైకాపా కన్వీనర్‌, ఎంపీ మోపిదేవి వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌, స్థానిక తహశీల్దారుకు ఈ నెల 19న డీఎం ఫిర్యాదు చేశారు. వైకాపా కార్యాలయ నిర్మాణంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తారా.. అంటూ ఆర్‌ఎం, డీఎంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కారాలు మిరియాలు నూరారు. బాపట్లలో ఎలా పని చేస్తారో చూస్తామంటూ అంతర్గత సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డిని డిపో మేనేజరు బాధ్యతల నుంచి తప్పించి, పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. బాపట్లలో తమ సంస్థ భూమిలో వైకాపా కార్యాలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా నిరసన తెలిపామని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియా ముందు ప్రకటించారు. సాయంత్రానికే మాట మార్చేసి.. ఆ స్థలం తమది కాదంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇలా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు కలిసి డీఎంను బలిపశువును చేశారని, తద్వారా తాము అడ్డగోలుగా చేసే పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వేటు తప్పదంటూ ప్రభుత్వం హెచ్చరించినట్లయిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.  


బాధ్యతాయుతంగా పనిచేసిన డీఎం బదిలీ అన్యాయం
ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌

ఓ రాజకీయ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపు అంశంలో బాపట్ల డీఎంను బదిలీ చేయడం అన్యాయమని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్‌కే జిలాని బాషా, అధ్యక్షులు సీహెచ్‌ సుందరయ్య, ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి  ప్రకటనలో పేర్కొన్నారు. ఆ స్థలాన్ని ఏపీఐఐసీ తీసుకొని, రెవెన్యూశాఖకు బదలాయించినట్లు ఆర్టీసీ వద్ద రాతపూర్వక ఆధారాలేవీ లేవన్నారు. అటువంటప్పుడు ఆ స్థలం ఆర్టీసీదిగానే భావిస్తారని తెలిపారు. ఆ స్థలాన్ని కాపాడేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే డీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కలెక్టర్‌ వివరణ ఇచ్చాక ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఆయన్ను బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని