మురుగు నీటివల్లే విద్యార్థినులకు అస్వస్థత

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయ బాలికలు అస్వస్థతకు గురి కావడానికి నీరు కలుషితం కావడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది.

Updated : 01 Feb 2023 05:47 IST

ఈనాడు, అమరావతి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయ బాలికలు అస్వస్థతకు గురి కావడానికి నీరు కలుషితం కావడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది. ఈ విద్యాలయంలో చదివే వారిలో 206 మంది విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన అధికారులు జరిపిన తనిఖీల్లో విద్యాలయానికి నీటి సరఫరాకు సంబంధించిన ఆర్‌ఓ ప్లాంటు, పైపులైను వ్యవస్థ దారుణంగా ఉందని తేలింది. పైపు లైను మురుగునీటి డ్రైనేజీ నుంచి వెళుతోందని.. పైపులకు తుప్పు పట్టి.. రంద్రాలు ఏర్పడటంతో వాటి ద్వారా మురుగునీరు పైపుల్లోకి వెళుతోందని గుర్తించారు. ఆర్‌ఓ ప్లాంటుకు ఉండే ఫిల్టర్లను రెండు, మూడేళ్ల నుంచి మార్చలేదని కనుగొన్నారు. నీటి శుద్ధి అనంతరం 50% నీరు వృథా అవుతుంది. దీనిని వదిలేయాల్సి ఉండగా.. వీటితో బియ్యం శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

గురుకులం ప్రిన్సిపల్‌, మరో ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గురుకుల బాలికల విద్యాలయం ప్రిన్సిపల్‌ చిలకా జయలక్ష్మి, వసతి గృహ పర్యవేక్షకురాలు జ్యోత్స్న, ఆరోగ్య పర్యవేక్షకురాలు జి.వరలక్ష్మిని సస్పెండు చేసినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గుంటూరు జిల్లా సమన్వయకర్త శాంతి విశాల మంగళవారం తెలిపారు. సస్పెండైన ప్రిన్సిపల్‌ జయలక్ష్మి స్థానంలో అచ్చంపేట బాలుర గురుకులం ప్రిన్సిపల్‌ కె.ఎస్‌.వి.స్వర్ణకుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని