పారిశ్రామిక నడవాలకు భూమి.. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత

రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక నడవాలకు అవసరమైన భూమి అప్పగిస్తే అవి కార్యకలాపాలు సాగించేందుకు కాలపరిమితిని నిర్ణయించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్‌ తెలిపారు.

Published : 25 Mar 2023 04:56 IST

కేంద్ర మంత్రి సోం ప్రకాష్‌

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక నడవాలకు అవసరమైన భూమి అప్పగిస్తే అవి కార్యకలాపాలు సాగించేందుకు కాలపరిమితిని నిర్ణయించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్‌ తెలిపారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక నడవాలకు అవసరమైన భూమి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

చేపల లభ్యతపై ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యశాఖ 2017-18లో 407 గంటలు సర్వే చేయగా సగటున గంటకు చేపల లభ్యత 64 కేజీలుగా ఉందని, అత్యధికంగా కాకినాడ వద్ద గంటకు 358 కేజీలు లభ్యమయ్యాయని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020-21లో అత్యధికంగా భీమిలి వద్ద గంటకు 637 కేజీలు లభ్యమైనట్లు మంత్రి వెల్లడించారు. సర్వే చేపట్టిన గత అయిదేళ్లలో ఉత్తరాంధ్ర తీరంలో వాణిజ్య రకాల చేపలతో పాటు 19 రకాల పీతలు, ఒక రకం రొయ్య, నాలుగు రకాల స్టోమటోపొడ్స్‌, 12 రకాల అరుదైన జాతి ఫిన్‌ఫిష్‌లు దొరికాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదల్చిన బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమకు మొదటి విడత కింద ఈ నెల ఏడో తేదీన రూ.225 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కుబ తెలిపారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  


వందే భారత్‌ రైళ్ల తయారీకి రష్యా కంపెనీల టెండర్లు

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

భారత దేశ ప్రమాణాలకు తగినట్లు 200 వందేభారత్‌ రైళ్ల తయారీకి రష్యాకు చెందిన కంపెనీలు టెండర్లు వేశాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. జాయింట్‌ స్టాక్‌ కంపెనీ లోకోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో కలిపి రష్యాకు చెందిన జేఎస్‌సీ మెట్రో వాగన్‌మష్‌, మితీష్‌చి కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గతేడాది నవంబరు 30న ఆ టెండర్లు తెరిచామని, ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.


తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చిరుధాన్యాల ఉత్పత్తి

తెలుగురాష్ట్రాల్లో గత రెండేళ్లతో పోల్చుకుంటే చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. భాజపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2019-20, 2020-21ల్లో ఆంధ్రప్రదేశ్‌లో 514.19, 540.61 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి కాగా 2021-22లో అది 359.15కే పరిమితమైంది. తెలంగాణలో 2019-20లో 139.15, 2020-21లో 166.33 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తికాగా 2021-22లో అది 122.76కు పడిపోయిందని పేర్కొన్నారు.

2020 నుంచి 2023, ఫిబ్రవరి నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్‌లో 1,019 తెలంగాణలో 3,467 అంకుర పరిశ్రమలు ప్రారంభమైనట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని