ఇంటర్మీడియట్‌లో 66.21% ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 66.21% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 5,38,327 మంది ఉత్తీర్ణత సాధించారు.

Published : 27 Apr 2023 05:08 IST

మొదటి ఏడాదిలో బాలికలు 65%, బాలురు 58% ఉత్తీర్ణత
ద్వితీయ సంవత్సరంలో బాలికలు 75%, బాలురు 68% పాస్‌
ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఫలితాల్లో అమ్మాయిలే టాప్‌
అబ్బాయిలు అటూ ఇటూ  తిరగడం వల్లే ఉత్తీర్ణతలో  వెనకబడ్డారన్న బొత్స
అట్టడుగున సీఎం జగన్‌, మంత్రి బొత్స జిల్లాలు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 66.21% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 5,38,327 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది 4,33,275 మంది పరీక్షలు రాయగా.. 2,66,326 (61%) మంది పాస్‌ అయ్యారు. రెండో సంవత్సరంలో 3,79,758 మంది పరీక్షలకు హాజరవగా.. 2,72,001 (72%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌ ఫలితాలను బుధవారం విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలుర కంటే బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 65%, బాలురు 58% ఉత్తీర్ణులు కాగా.. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 75%, బాలురు 68% పాసయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, కడప చివరి స్థానంలో నిలిచాయి. రెండో ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలోనూ, విజయనగరం జిల్లా అట్టడుగున నిలిచాయి. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా కడప, విద్యాశాఖ మంత్రి బొత్స ఇలాకా విజయనగరం జిల్లాలు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతలో అట్టడుగున నిలవడం గమనార్హం. వృత్తి విద్యా కోర్సుల్లో మొదటి ఏడాదిలో 49%, రెండో సంవత్సరంలో 62%మంది ఉత్తీర్ణులయ్యారు.

పెరిగిన ఉత్తీర్ణత శాతం

గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది మొదటి సంవత్సరంలో 54%, ద్వితీయ సంవత్సరంలో 61% మంది ఉత్తీర్ణులు కాగా.. ఈసారి వరసగా 61%, 72%మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 2018 తర్వాత, ద్వితీయ సంవత్సరంలో 2017 తర్వాత ఇదే అత్యధిక ఉత్తీర్ణత.

విజయనగరాన్ని ముందుకు తీసుకొస్తాం

ఇంటర్మీడియట్‌లో బాలురు అటూ ఇటూ తిరుగుతూ చదవకపోవడం వల్లే ఉత్తీర్ణతలో వెనుకబడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాలికలు బాగా చదువుకోవడం వల్లే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారన్నారు. రెండో ఏడాది ఫలితాల్లో అట్టడుగున నిలిచిన విజయనగరాన్ని ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని, ఎక్కడ లోపం ఉందో పరిశీలిస్తామని వెల్లడించారు. ఇంటర్మీడియట్‌ మార్కులు, ర్యాంకులు ప్రకటనలపై నిషేధం ఉందని, గతంలోనే దీనిపై ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించారు. ఇంటర్మీడియట్‌లో రెసిడెన్షియల్‌లో ప్రైవేటు కంటే ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత ఎక్కువగా ఉందని, ఇతర ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు సైతం ప్రభుత్వ బడుల్లా ఉండాలని తల్లిదండ్రులు కోరుకునే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో పాఠ్యపుస్తకాలు

ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ, నాడు-నేడు అమలు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. గతంలో పోల్చితే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ బడుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, దీనికి సంతోషిస్తున్నామని తెలిపారు. చదువుకునే పిల్లలకు అమ్మఒడి ఇస్తున్నామని, ఎక్కడ చదివించుకోవాలన్నది తల్లిదండ్రుల ఇష్టమని వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలలు, వర్సిటీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలు బాగున్నాయని, తగ్గినట్లు మీడియా చెబుతున్నందున మరోసారి ఆ వివరాలను ప్రత్యేకంగా అందిస్తానని తెలిపారు. 1-10 తరగతి వరకు పాఠ్యపుస్తకాల పీడీఎఫ్‌లను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వెబ్‌సైట్‌లో పీడీఎఫ్‌ల అప్‌లోడ్‌ను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లోని 42 లక్షల మంది పిల్లలకు 3.16 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. చదువుకోవడం కోసం ఈ పాఠ్య పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషనర్‌ సురేష్‌ చెప్పారు. అయితే ముద్రణకు, మార్పులు చేసి గైడ్లుగా వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని