Akasa Air: సీఎఫ్‌ఎంతో ఆకాశ ఎయిర్‌ భారీ ఒప్పందం

బోయింగ్‌ విమానాలకు కావాల్సిన ఇంజిన్ల కోసం నేడు సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో ఒప్పందం కుదుర్చుకొంది.... 

Published : 17 Nov 2021 20:42 IST

విలువ దాదాపు రూ.33,000 కోట్లు

దిల్లీ: దిగ్గజ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నేతృత్వంలో ఏర్పాటు కానున్న కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’ రెండు రోజుల వ్యవధిలో మరో భారీ ఒప్పందం కుదుర్చుకొంది. భారత్‌లో సేవలను ప్రారంభించడం కోసం అమెరికాకు చెందిన విమాన తయారీ కంపెనీ బోయింగ్‌కు 72 ‘737 మాక్స్‌’ విమానాలకు మంగళవారం ఆర్డరు చేసిన విషయం తెలిసిందే. ఆ విమానాలకు కావాల్సిన ఇంజిన్ల కోసం నేడు సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో ఒప్పందం కుదుర్చుకొంది.

కొనుగోలు సర్వీసుతో కూడిన ఈ ఒప్పంద విలువ 4.5 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.33,000 కోట్లు). ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఎయిర్‌షోలో ఈ డీల్‌ ఖరారైంది. దీంతో సీఎఫ్‌ఎం లీప్‌-1బీ ఇంజిన్లను సీఎఫ్‌ఎం అందించనుంది. ‘737 మాక్స్‌లోని రెండు వేరియంట్లు 737-8, 737-7-200 విమానాల కోసం ఆర్డరు పెట్టినట్లు ఆకాశ ఎయిర్‌ మంగళవారం తెలిపింది. ఈ ఆర్డరు విలువ దాదాపు 9 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.67,500 కోట్లు).

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ‘నిరభ్యంతర పత్రాన్ని(ఎన్‌ఓసీ)’ ఆకాశ ఎయిర్‌కు ఇచ్చింది. ఈ సంస్థకు రాకేశ్‌తో పాటు ఇండిగో మాజీ అధ్యక్షుడు ఆదిత్య ఘోష్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబేలు ఉన్నారు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని