ఏపీజీఎల్ఐ గురించి తెలుసా?

ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాజిక భ‌ద్ర‌త, సంక్షేమం కోసం ఆంధ్ర‌ప్రదేశ్ గ‌వ‌ర్న‌మెంట్ లైప్ ఇన్సురెన్స్‌ ప‌నిచేస్తుంది.

Published : 22 Dec 2020 20:20 IST

ఏపీజీఎల్ఐ శాఖ రాష్ట్రంలోని పురాత‌న విభాగాల‌లో ఒక‌టి. మొట్టమొద‌ట‌ ఈ ప‌థ‌కాన్ని 1907లో నిజామ్‌ల‌ కాలంలో హైద‌రాబాద్ రాష్ట్ర ఉద్యోగుల కోసం ప్రారంభించారు. ముందుగా ఫ్యామిలీ పెన్ష‌న్ ఫండ్ పేరుతో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. 1913లో హైద‌రాబాద్ స్టేట్ లైఫ్ ఇన్సురెన్స్‌గా మార్పుచేశారు. 1956లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అవ‌త‌రించిన త‌రువాత ఆంధ్ర‌ప్రదేశ్ గ‌వ‌ర్న‌మెంట్ లైఫ్ ఇన్సురెన్స్‌గా రూపాంత‌రం చెందింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత 1957 సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 25న‌ జ‌రిగిన తొలి నిర్వ‌హ‌ణ క‌మిటీ స‌మావేశంలో న‌లుగురు స‌భ్యులు, సెక్రెట‌రీ, ప్రెసిడెంట్‌ ఉన్నారు. అప్ప‌టి ఆర్థిక మంత్రి గౌర‌నీయులు శ్రీ బి. గోపాల‌రెడ్డి, స‌మావేశానికి అద్య‌క్ష‌త వ‌హించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంక్షేమం, స‌మాజిక భ‌ద్ర‌త కోసం ఏపీజీఎల్ఐ ప‌థ‌కం ప‌నిచేస్తుంది. ప్ర‌భుత్వ ప్రాంతీయ ఉద్యోగులంద‌రూ ఈ ప‌థ‌కంలో చేర‌డం త‌ప్ప‌నిస‌రి. ఏపీజీఎల్ఐ శాఖ, ఆర్థ‌క శాఖ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

ముఖ్యమైన అంశాలు:

  1. 21 నుంచి 53 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు ఏపీజీఎల్ఐ పాల‌సీల‌ను తీసుకునేందుకు అర్హులు.

  2. ఏపీజీఎల్ఐ శాఖ ఎండోమెంట్ పాల‌సీల‌ను మాత్ర‌మే జారీ చేస్తుంది. 58 సంవ‌త్స‌రాల వ‌య‌సుకు ఒక రోజుకు ముందుగా మెచ్యూర్ అవుతాయి.

  3. ఈ పాల‌సీలు ర‌ద్దు కావు.

  4. ప్రీమియం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

  5. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

  6. బోన‌స్ రేట్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి.

  7. ప్ర‌స్తుత బోన‌స్ రేటు, వార్షిక హామీ మొత్తంలో ప్ర‌తి వెయ్యి రూపాయిల‌కు 100 రూపాయిలు ఉంది.

  8. స‌రెండ‌ర్ విలువ‌పై 90 శాతం రుణం మంజూరు చేస్తారు.

  9. మంజూరు చేసిన రుణాల‌కు వార్షికంగా 9 శాతం సాధార‌ణ వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

  10. పాల‌సీ మెచ్యూర్ అయితే, హామీ మొత్తంతో పాటు, అప్ప‌టి వ‌ర‌కు ఉన్న బోన‌స్‌ను పాల‌సీదారునికి చెల్లిస్తారు.

  11. పాల‌సీ దారుడు ప్ర‌భుత్వ ఉద్యోగం నుంచి వైదొల‌గిన, ప్రీమియంలు చెల్లించ‌డం నిలిపివేసి పాల‌సీ స‌రెండ‌ర్ చేసిన‌, వారికి స‌రెండ‌ర్ విలువ‌తో పాటు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న బోన‌స్ మొత్తాన్ని చెల్లిస్తారు.

  12. మెచ్యూరిటీ స‌మయానికి కంటే ముందుగానే పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, హామీ మొత్తంతో పాటు, అప్ప‌టి వ‌ర‌కు ఉన్న బోన‌స్‌ను కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు అంద‌చేస్తారు.

ఈ కింది ప‌ట్టిక పే స్లాబులు, త‌ప్ప‌నిస‌రి ప్రీమియంల‌ను సూచిస్తుంది.

apgli.jpg

పై స్లాబ్‌ల‌ ప్ర‌కారం త‌ప్ప‌నిస‌రిగా చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియంతో పాటు ఉద్యోగి సాధార‌ణ వేత‌నం నుంచి గ‌రిష్టంగా 20 శాతం వ‌ర‌కు వేత‌నాన్ని అద‌న‌పు ప్రీమియంగా చెల్లించ‌వ‌చ్చు. అయితే వైద్య ప‌రీక్ష‌ల నివేదిక‌ల‌ను అందించాల్సి ఉంటుంది.

పాల‌సీ ప‌నితీరు:

  1. మొద‌టి ప్రీమియం డిడ‌క్ట్ చేసిన అనంత‌రం ఉద్యోగిప్ర‌పోజ‌ల్ ఫార‌మ్‌(ప్ర‌తిపాద‌నా ప‌త్రం) పూర్తి చేసి, అత‌ని/ఆమె, డీడీఓ/ కార్యాల‌య నిర్వాహ‌కుని సంత‌కంతో పాటు, అటాస్టేష‌న్ చేయించి ఏపీజీఎల్ఐ పాల‌సీకి ద‌ర‌ఖాస్తు చేయాలి.

  2. రెండవ, తదుపరి పాల‌సీలకు కూడా ఇదే విధంగా ప్రతిపాదన పత్రాలను సమర్పించి పాలసీదారు తదుపరి పాల‌సీల‌ను పొందవలసి ఉంటుంది.

  3. ప్ర‌తిపాద‌న ప్ర‌తం ఇవ్వ‌కుండా ప్రీమియం మాత్రం చెల్లిస్తే, అటువంటి పాల‌సీలు రిస్క్‌ను క‌వ‌ర్‌చేయ‌వు, అంతేకాకుండా చందాదారునికి ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందించ‌వు. అటువంటి చెల్లింపులు అన‌ధికార చెల్లింపుల కిందికి వ‌స్తాయి. ఈ మొత్తాన్ని ఎటువంటి వ‌డ్డీ, బోన‌స్ లేకుండా తిరిగి చెల్లిస్తారు.

  4. 53 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటిన ఉద్యోగులు ఏపీజీఎల్ఐ పాల‌సీలు తీసుకునేందుకు అర్హ‌లు కారు.

  5. 53 సంవ‌త్స‌రాల ముందు ప్రీమియం చెల్లింపులు మొద‌లుపెట్టి 53 సంవ‌త్స‌రాల త‌రువాత ప్ర‌తిపాద‌నా ప‌త్రాన్ని స‌మ‌ర్పించిన పాల‌సీలను కూడా తిర‌స్క‌రిస్తారు.

ప్రీమియంల చెల్లింపులు:

ప్రీమియం ఉద్యోగుల జీతం నుంచి డిడ‌క్ట్ చేస్తారు. వివ‌రాలు ఉద్యోగికి షెడ్యూల్ ద్వారా పంపుతారు. ట్ర‌జెరీ/ పీఏఓ ద్వారా జీతాలు పొంద‌ని ఉద్యోగులు ప్రీమియం మొత్తాన్ని చ‌లానా ద్వారా చెల్లించాలి. పాల‌సీ దారుల‌కు చేరువైయ్యేందుకు, ఉత్త‌మ సేవ‌ల‌ను అందించేందుకు గానూ అన్ని జిల్లా ప్ర‌ధాన కార్యాల‌యాల‌లో, క్రిష్ణ జిల్లాకు విజ‌య‌వాడలోనూ, జిల్లా ఇన్సురెన్స్ కార్యాల‌యాలను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

రుణాలు మంజూరు, సెటిల్‌మెంట్‌ క్లెయిమ్లను ఆన్‌లైన్ పొందేదుకు, ఎస్ఎమ్ఎస్ ద్వారా సామాచారాన్ని పొందేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది స‌మాచారాన్ని అందిచాల్సి ఉంటుంది.

  1. ఉద్యోగి గుర్తింపు సంఖ్య

  2. మొబైల్ నెంబ‌ర్‌

  3. ఈ కింది వివ‌రాల‌తో కూడిన ఉద్యోగి పొదుపు ఖాతా పాస్ పుస్త‌కంలోని మొద‌టి పేజీ జిరాక్స్ కాపీని ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌తో జ‌త‌చేయాలి.

  • బ్యాంకు ఖాతా సంఖ్య

  • బ్యాంకు బ్రాంచ్ పేరు

  • ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌
    ఈ విధంగా ద‌ర‌ఖాస్తు చేయ‌ని వారి ద‌ర‌ఖాస్తుల భ‌విష్య‌త్తు ప్రాసిసెంగ్‌కు ఆటంకం ఏర్ప‌డ‌వ‌చ్చు. తాజా పాల‌సీల‌కు గానీ పొడిగిస్తున్న పాల‌సీ వివ‌రాల‌ను ఎస్ఎమ్ఎస్ ద్వారా పంపేందుకు వీలుగా ద‌ర‌ఖాస్తు ప‌త్రంలో మొబైల్ నెంబ‌రును ఇవ్వాలి. వివ‌రాల‌కు ఈ కింది లింక్‌లను క్లిక్ చేయండి:

http://apgli.ap.gov.in/Home.aspx
http://apgli.ap.gov.in/ContactUs.aspx

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని