కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలి

ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19 ప్రభావాన్ని తట్టుకోవడానికి తాము చేపట్టిన పలు చర్యలు బ్యాంకులపై ప్రభావం చూపించాయని, వాటి నుంచి కోలుకుని, కొత్త సవాళ్లకు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది.

Published : 30 Dec 2020 01:13 IST

2019-20లో బ్యాంకుల ధోరణి-పురోగతిపై రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదిక

ముంబయి: ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19 ప్రభావాన్ని తట్టుకోవడానికి తాము చేపట్టిన పలు చర్యలు బ్యాంకులపై ప్రభావం చూపించాయని, వాటి నుంచి కోలుకుని, కొత్త సవాళ్లకు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ‘2019-20లో బ్యాంకుల ధోరణి, పురోగతి’పై ఆర్‌బీఐ మంగళవారం నివేదిక వెలువరించింది. అందులో పలు అంశాలను ప్రస్తావించింది.
* కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే క్రమంలో బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లపై ఒత్తిడి పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నాం. కార్పొరేట్లు, ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తపడ్డాం.
* మారటోరియం గడువు ముగిసిన తరవాత రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు వేగంగా వచ్చాయి. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత, భవిష్యత్తు ఆదాయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
* ప్రస్తుత ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో బ్యాంకులు కొత్త సాంకేతికతల్ని ప్రవేశపెట్టి సవాళ్లను ఎదుర్కోవాలి
* కొవిడ్‌-19 మహమ్మారి దెబ్బతో ఎప్పుడూ ఊహించని రీతిలో స్థూల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. దీని నుంచి బయటపడి, ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు కృషి చేశాం. పరపతి విధాన సమీక్షలో కీలక రేట్ల కోత, వ్యవస్థలోకి నగదు చొప్పించడం వంటి పలు చర్యలు చేపట్టి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రయత్నించాం. వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థలు ఇంతలా సవాళ్లను ఎదుర్కోలేదు.
* గత ఆర్థిక సంవత్సరంలో (2019-20) పెద్ద మొత్తంలో జరిగిన బ్యాంకు మోసాల విషయానికొస్తే, తొలి 50 రుణ మోసాలే 76 శాతం వాటా కలిగి ఉండటం గమనార్హం.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య రూ.1 లక్ష అంత కంటే ఎక్కువ మోసాలు జరిగిన మొత్తం రూ.64,681 కోట్లు కాగా, 2019-20లో ఇది ఏకంగా రూ.1,13,374 కోట్లుగా నమోదైంది. మోసాల సంఖ్య పరంగా చూసినా, గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలతో పోలిస్తే 4,410 కేసుల నుంచి 3,488కి తగ్గాయి.
* రూ.1 లక్ష కంటే ఎక్కువమొత్తాల్లో చోటుచేసుకున్న మోసాలు 80 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే (పీఎస్‌బీలు) ఉన్నాయి.
* స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 2018 మార్చిలో గరిష్ఠ స్థాయికి చేరగా, 2019 మార్చికి 9.1 శాతానికి, 2020 మార్చికి 8.2 శాతానికి పరిమితమయ్యాయి. 2020 సెప్టెంబరు నాటికి 7.5 శాతానికి దిగి వచ్చాయి.
* షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల క్యాపిటల్‌-రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్స్‌ నిష్పత్తి (సీఆర్‌ఏఆర్‌) 2019 మార్చిలో 14.3 శాతం ఉండగా, 2020 మార్చికి 14.7 శాతానికి మెరుగైంది. 2020 సెప్టెంబరుకు అది 15.8 శాతానికి చేరింది.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో లోక్‌ అదాలత్‌లు, డీఆర్‌టీలు, సర్ఫాయిసి చట్టం, దివాలా స్మృతి (ఐబీసీ) కింద మొత్తం రూ.7.42 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో రూ.1.72 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులు రాబట్టుకున్నాయి.
జియో, మీడియోటెక్‌ ఇ-స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌
దిల్లీ: టెలికాం దిగ్గజం జియో, తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ చిప్‌ తయారీ సంస్థ మీడియాటెక్‌ సంయుక్తంగా 70 రోజుల పాటు సాగే ఇ-స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌ ‘గేమింగ్‌ మాస్టర్స్‌’ను మంగళవారం ప్రారంభించాయి. ఈ ఆటను జియో గేమ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించనున్నారు. మొత్తం టోర్నమెంట్‌ను జియోటీవీ హెచ్‌డీ ఇస్పోర్ట్స్‌ చానల్‌, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు రెండు కంపెనీలు వెల్లడించాయి. భారత్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. ఈ టోర్నమెంట్‌లో విజేతలకు మొత్తం రూ.12.5 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు. ఈ పోటీలో పాల్గొనేవారుఎటువంటి రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని