క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేయకపోవచ్చు

ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 17 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. దివాలా స్మృతిలో

Published : 15 Jul 2021 16:41 IST

పూర్తి నిషేధమూ ఉండదు
ముసాయిదా బిల్లుపై ఆర్‌బీఐ,  బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు

ఈనాడు, దిల్లీ: ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 17 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. దివాలా స్మృతిలో మార్పులకు సంబంధించిన బిల్లు, డిపాజిట్‌పై బీమా కవరేజీని రూ.5 లక్షలకు పెంచే బిల్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రిప్టో కరెన్సీ బిల్లు మాత్రం ఈ సారి జాబితాలో లేదు. క్రిప్టో బిల్లుగా వ్యవహరించే క్రిప్టో- కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు- 2021ను ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల జాబితాలో చేర్చారు. కొవిడ్‌-19 రెండో దేశ ఉద్ధృతి నేపథ్యంలో అప్పుడు సమావేశాల రోజులను తగ్గించడంతో ఆ బిల్లును ప్రవేశపెట్టలేకపోయారు. ‘ఆర్‌బీఐ క్రిప్టోకరెన్సీలను పూర్తిగా నిషేధించాలని కోరుకుంటోంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొన్ని వర్గాలు మాత్రం ‘ట్రేడింగ్‌-పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ఒక పెట్టుబడి సాధానంగా క్రిప్టోకరెన్సీకి అనుమతి ఇవ్వాల’ అభిప్రాయ పడుతున్నాయి. అందువల్ల క్రిప్టో కరెన్సీలపై పూర్తిగా నిషేధం ఉండదు. అలాగని చెలామణి కోసం దీనికి చట్టబద్ద అనుమతులూ ఉండవ’ని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మొత్తంమీద చట్టబద్దంగా అనుమతులు ఇవ్వకూడదనే విషయంపైనే ఏకాభిప్రాయం వ్యక్తం అవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌కు ఉపయోగించే పెట్టుబడి సాధనంగా క్రిప్టోకరెన్సీకి అనుమతులు ఇచ్చే అంశంపై ఆర్‌బీఐ, బ్యాంకులు, ఇతరత్రా సంబంధిత వర్గాలతో ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీలో ఇప్పటివరకు భారీగా పెట్టుబడులు పెడుతున్నా, వాస్తవ ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం ఇప్పటివరకు పరిమితంగానే ఉంది. క్రిప్టో ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు సుమారు 1.5 కోట్ల మంది భారతీయులు రూ.15,000 కోట్ల మేర క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టారు. బ్లాక్‌ చెయిన్, క్రిప్టో విభాగాల్లో 350 వరకు అంకురాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని