9 నెలల్లో 13 శాతం పెరిగిన నగదు చలామణీ

దేశంలో ఓ వైపు డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు నగదును చేతిలో ఉంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనన్న ముందుజాగ్రత్తతో నోట్లను........

Published : 10 Jan 2021 19:17 IST

ముంబయి: దేశంలో ఓ వైపు డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు నగదును చేతిలో ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనన్న ముందు జాగ్రత్తతో నోట్లను అట్టిపెట్టుకుంటున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఏకంగా 13 శాతం నగదు చలామణీ పెరిగినట్లు ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి.

2020 మార్చి 31 నాటికి చలామణీలో ఉన్న నగదు విలువ రూ.24,47,312 కోట్లు కాగా..  ఈ ఏడాది జనవరి 1 నాటికి ఆ మొత్తం రూ.27,70,315 కోట్లకు పెరిగినట్లు రిజర్వ్‌ గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కరెన్సీ సర్క్యులేషన్‌ 6 శాతం పెరగడం గమనార్హం. లాక్‌డౌన్‌ వల్ల ఎప్పుడు ఏ అవసరం పొంచి ఉంటుందోనన్న ముందు జాగ్రత్తతో ప్రజలు నగదును అట్టిపెట్టుకుంటున్నారని కేర్‌ రేటింగ్స్‌ ముఖ్య ఆర్థిక వేత్త మదన్‌ సబ్నవీస్‌ అభిప్రాయపడ్డారు. అందుకే నగదు చలామణీ పెరిగిందన్నారు.

2019-2020 సంవత్సరానికి సంబంధించిన ఆగస్టులో విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ కొవిడ్‌ కారణంగా కరెన్సీ వినియోగానికి డిమాండ్‌ ఏర్పడిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఇక 2020 క్యాలెండర్‌ సంవత్సరం మొత్తంగా చూస్తే 22.1 శాతం నగదు చలామణీ పెరిగినట్లు తేలింది. ఇక చలామణీలో ఉన్న మొత్తం నగదు విలువలో కేవలం రూ.500, రూ.2 వేల నోట్ల వాటా రూ.83.4 శాతం కావడం గమనార్హం. ఇటీవల కాలంలో రూ.500 నోట్ల వాటా భారీగా పెరిగిందని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

ఇవీ చదవండి..
తేలికపాటి కార్లొస్తున్నాయ్‌..!!
హ్యాకింగ్‌కు గురైన న్యూజిలాండ్‌ కేంద్రబ్యాంక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని