
Economy: ఈ ఏడాది రెండంకెల ఆర్థిక వృద్ధి
ధీమా వ్యక్తం చేసిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అంచనా వేశారు. కరోనా మరోసారి విజృంభిస్తే.. సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే నేర్చుకున్న పాఠాలు, అనుభవాలతో మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు సైతం సంసిద్ధంగా ఉన్నాయన్నారు.
ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు బలోపేతమవుతాయని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు. ఉక్కు, సిమెంట్, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు ఇప్పటికే గణనీయంగా పెరిగాయన్నారు. అయితే, మహమ్మారి ఆందోళనల నేపథ్యంలో వినియోగదారులతో నేరుగా సంబంధం ఉండే రంగాలు గాడిలో పడడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు సైతం సజావుగానే సాగుతాయని రాజీవ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రెండో దశ కరోనా వల్ల మార్కెట్లు పెద్దగా ప్రభావితం కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే గత ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రికార్డు స్థాయిలో వచ్చాయన్నారు. అలాగే అనేక కంపెనీలు ఐపీఓకి వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.