Health Insurance: ఫ్యామిలీ ఫ్లోట‌ర్ గురించి తెలుసా?

కుటుంబ సభ్యులెవరైనా , ఒక‌రు గానీ లేదా అందరూ గానీ ఈ బీమా హామీని వినియోగించుకోవచ్చు.

Updated : 10 May 2021 09:51 IST

ఫ్యామిలీ ఫ్లోటర్ ద్వారా కుటుంబ సభ్యులందరికీ ఒక పాలసీలోనే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.  కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికి అనారోగ్యం వ‌చ్చినా ఈ పాలసీ ద్వారా చికిత్స పొందవచ్చు. ఇవి ఇద్దరు పెద్దలకు లేదా ఇద్దరు పెద్దలతోపాటు ఒక సంతానం ఉన్నవారికి, ఇద్దరు పెద్దలు వారితోపాటు ఇద్దరు సంతానం ఉన్నవారికి, కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు/ జీవిత భాగ‌స్వామి త‌ల్లిదండ్రుల‌ను కలిపి పాలసీ తీసుకునే వెసులుబాటు కల్పించారు.  

అయితే ఫామిలీ ఫ్లోటర్ పాలసీలో చాలా వరకు బీమా కంపెనీలు గరిష్టంగా ఇద్దరు పెద్దలకు(18-65 ఏళ్ళ వరకు వయసు గల వారు) మాత్రమే అనుమతిస్తున్నారు.  2-4 పిల్లలను (గరిష్టంగా 21-25 ఏళ్ళ వరకు వయసు గల వారు) చేర్చవచ్చు. ఒకవేళ ఈ గరిష్ట వయసు దాటినట్టయితే, వారిని బీమా కంపెనీలు పెద్దలుగా పరిగణిస్తాయి కాబట్టి,  పిల్లలకు విడిగా వేరొక పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.  

ఫ్యామిలీ ఫ్లోటర్ అందించే ప్ర‌యోజ‌నాలు:

* ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ హామీ పరిధిలో పైన తెలిపిన  కుటుంబసభ్యులు వస్తారు.  
* ఒక ఏడాదిలో కుటుంబ సభ్యులెవరైనా , ఒక‌రు గానీ లేదా అందరూ గానీ ఈ బీమా హామీని వినియోగించుకోవచ్చు. 
* కుటుంబంలోని మూడు నెలల చిన్నారుల నుంచి 65ఏళ్ల వయసున్న పెద్దల వరకు కలుపుకొని ఈ పాలసీ తీసుకోవచ్చు.
* పాలసీలో పెద్ద వయసువారిని దృష్టిలో ఉంచుకొని ప్రీమియం విధిస్తారు.
* ఈ పాలసీలు ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రెండేళ్లకు ఒక‌సారి పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో క్లెయిమ్ చెల్లింపు వ్యక్తిగత ఆరోగ్య పాలసీల మాదిరిగానే  ఉంటుంది.
* పాలసీని బట్టి సంవత్సరానికి ఒకసారి లేదా మూడేళ్లకోసారి ఆరోగ్య పరీక్షల ఖర్చును క్లెయిమ్ చేసుకోవచ్చు.
* పాలసీదారుడు ఎలాంటి క్లెయిం చేయకపోతే నోక్లెయిం బోనస్ పొందొచ్చు.  
* ముందస్తుగా ఉన్న వ్యాదులు కొన్నింటికయితే 2 ఏళ్లు,  తీవ్రమైన  వ్యాధులకు  3 లేదా 4ఏళ్ల తర్వాత బీమా వర్తిస్తుంది. 
* పాలసీలో ఏ సభ్యుడు మృతి చెందినా, మిగిలిన సభ్యులకు యథాతథంగా పాలసీ కొనసాగుతుంది. ఈ విషయం  బీమా కంపెనీకి తెలియచేయడం వలన , పునరుద్ధరణ సమయంలో ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుంది. 
* ఈ ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీకి కొత్త సభ్యులను చేర్చడం సులభం. కుటుంబంలోకి వచ్చిన జీవితభాగస్వామిని, చిన్నారులను,  జీవిత భాగ‌స్వామి త‌ల్లిదండ్రుల‌ను సులభంగా ఇందులో చేర్చవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని