IPO: రూ.30,000 కోట్ల టెక్‌ ఐపీఓలు రానున్నాయ్‌

గత ఏడాదిన్నర కాలంలో (18 నెలలు) వృద్ధి ఆధారిత సాంకేతిక (టెక్‌) కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాయని సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ తెలిపారు....

Published : 17 Sep 2021 16:17 IST

ఏడాదిన్నరగా రూ.15,000 కోట్ల సమీకరణ

సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ

దిల్లీ: గత ఏడాదిన్నర కాలంలో (18 నెలలు) వృద్ధి ఆధారిత సాంకేతిక (టెక్‌) కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాయని సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ తెలిపారు. మరో రూ.30,000 కోట్ల సమీకరణకు ఈ తరహా కంపెనీలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ‘అంకురాల వ్యవస్థలో యూనికార్న్‌ల సంఖ్య పెరుగుతుండటం.. మన ఆర్థిక వ్యవస్థలో కొత్త తరం సాంకేతికత కంపెనీల వృద్ధిని సూచిస్తోంది. తక్షణమే లాభాలు ఆర్జించడం కంటే.. శరవేగంగా వృద్ధిని సాధించడంపై అవి దృష్టి సారిస్తున్నాయ’ని సీఐఐ సమావేశంలో ఆయన చెప్పారు. ఐపీఓల ద్వారా సుమారు రూ.30,000 కోట్లు సమీకరించేందుకు అనుమతులు కోరుతూ, దరఖాస్తులు సెబీ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. ‘అంకుర సంస్థల్లో తొలుత ఐపీఓకు వచ్చిన సంస్థ జొమాటో. ఈ ఐపీఓ విజయవంతం కావడంతో పేటీఎం, పాలసీ బజార్, మొబిక్విక్, నైకా లాంటి మరిన్ని సాంకేతిక సంస్థలు పబ్లిక్‌ ఇష్యూ నిమిత్తం సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. 2019-20లో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.21,000 కోట్లు సమీకరిస్తే.. 2020-21లో రూ.46,000 కోట్ల మేర నిధుల సమీకరణ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే ఇంచుమించు ఈ స్థాయిలో నిధులను కంపెనీలు సమీకరించాయ’ని వివరించారు.

మార్కెట్‌ వర్గాల ప్రయోజనార్థమే ‘టీ+1’

మార్కెట్‌ వర్గాల ప్రయోజనం కోసమే ‘టీ+1’ సెటిల్‌మెంట్‌ విధానాన్ని తీసుకొస్తున్నామని సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ తెలిపారు. ఈ  విధానంపై బ్రోకర్ల సంఘాలు, ఎఫ్‌పీఐలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంతో త్యాగీ ఈ స్పష్టత ఇచ్చారు. టీ+1 సెటిల్‌మెంట్‌ అంటే.. క్రయ, విక్రయం జరిగిన మర్నాడే లావాదేవీ పూర్తికావడం. ప్రస్తుత టీ+2 అంటే రెండు పని దినాల్లో సెటిల్‌మెంట్‌ చేసే విధానం అమల్లో ఉంది.

* బాండ్ల మార్కెట్‌ను మరింతగా విస్తరిస్తున్నామని అజయ్‌ త్యాగీ తెలిపారు. నిధుల లభ్యతను పెంచేందుకు కార్పొరేట్‌ బాండ్లకు కొనుగోలు, అమ్మకపు ధర రెండింటినీ బిడ్‌ చేసే మార్కెట్‌ మేకర్స్‌ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. సాధారణ సమయంలో లేదా ఒత్తిడిలో ఉన్న పెట్టుబడి గ్రేడ్‌ డెట్‌ సెక్యూరిటీ కొనుగోలుకు బ్యాక్‌స్టాప్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్‌ బాండ్ల కోసం లిమిటెడ్‌ పర్పస్‌ క్లియరింగ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

* బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఒత్తిడి రుణాలను కొనుగోలు చేసే నిమిత్తం ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లో (ఏఐఎఫ్‌) ఒక ఉప విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని త్యాగీ పేర్కొన్నారు.


మరొక యూనికార్న్‌.. అప్నా

100 మి.డాలర్ల పెట్టుబడి సమీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాల వెబ్‌సైట్‌ అయిన అప్నా, కొత్తగా యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల విలువైన) సంస్థల జాబితాలో చేరింది. ఈ సంస్థ సిరీస్‌-సి మూలధన సమీకరణలో భాగంగా టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్, ఔల్‌ వెంచర్స్, ఇన్‌సైట్‌ పార్టనర్స్, సిఖోయా కేపిటల్‌ ఇండియా, మావరిక్‌ వెంచర్స్, జీఎస్‌వి వెంచర్స్‌.. సంస్థల నుంచి 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి సమకూర్చుకుంది. ఈ సమీకరణను పరిగణనలోకి తీసుకుంటే ‘అప్నా’కు 110 కోట్ల డాలర్ల సంస్థాగత విలువ లభించినట్లు అవుతోంది. తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఈ నిధులు వినియోగిస్తామని అప్నా సీఈఓ నిర్మిత్‌ పారిఖ్‌ వివరించారు. కొత్తగా ఐటీ, ఇంజినీరింగ్‌ నిపుణుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. వివిధ నియామకాలకు సంబంధించి గత 15 నెలల్లో 10 కోట్ల ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు, గత నెల రోజుల్లోనే 1.8 కోట్ల ఇంటర్వ్యూలు చేసినట్లు పారిఖ్‌ చెప్పారు. అప్నా ఏర్పాటై రెండేళ్లే అయ్యింది. అతి తక్కువ సమయంలోనే ‘యూనికార్న్‌’ స్థాయికి ఎదిగిన అంకురాల్లో ఇదొకటి.


1000 నియామకాలు: ఎమిరిటస్‌

ఈ ఏడాది 1000 నియామకాలు జరుపుతామని ఎడ్‌ టెక్‌ సంస్థ ఎమిరిటస్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బోధించే కోర్సుల సంఖ్యను ప్రస్తుత 250 నుంచి రెట్టింపు చేస్తామని పేర్కొంది. ఏడాది వ్యవధిలో 100 శాతానికి పైగా వృద్ధి చెందినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని