Nirmala Sitharaman: కొవిడ్‌ సంక్షోభం భారత్‌కు ఓ అవకాశం!

కొవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ ఓ అవకాశంగా మలుచుకుందని.. కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తద్వారా దేశ సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసిందన్నారు....

Published : 16 Oct 2021 02:20 IST

ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీలో నిర్మలా సీతారామన్‌

వాషింగ్టన్‌: కొవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ ఓ అవకాశంగా మలుచుకుందని.. కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తద్వారా దేశ సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. ఆ ఫలితంగానే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుందని తెలిపారు. వాషింగ్టన్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీ సమావేశంలో గురువారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్‌ సంక్షోభ పరిస్థితుల్లోనూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 82 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని సీతారామన్‌ తెలిపారు. భారత్‌ పెట్టుబడులకు స్వర్గధామమని ఇది సూచిస్తోందన్నారు. కరోనా మహమ్మారిని భారత్‌ సమర్థంగా ఎదుర్కొందని తెలిపారు. జీవితాలు, జీవనాధారాలు.. ఈ రెండింటినీ కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా రెండో వేవ్‌ దేశవ్యాప్తంగా ఒకేసారి వెలుగు చూడలేదని పేర్కొన్నారు. దీంతో స్థానిక లాక్‌డౌన్ల ద్వారా మహమ్మారిని కట్టడి చేశామన్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్దఎత్తున ప్రభావం పడలేదని తెలిపారు.

రెండో దశ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత్‌ 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని సీతారామన్‌ తెలిపారు. ఆంక్షల సడలింపు తర్వాత జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటిన విషయాన్ని సీతారామన్‌ గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న నెలల్లో మరింత జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 

వ్యాక్సిన్ల పంపిణీ విషయంలోనూ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. సెప్టెంబరు 30 నాటికి దేశవ్యాప్తంగా 951.35 మిలియన్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 72.8 శాతం మందికి కనీసం ఒక డోసు టీకా అందిందన్నారు. అలాగే వ్యాక్సిన్‌ మైత్రి పేరిట ప్రపంచదేశాలకూ టీకాలు అందించిన విషయాన్ని నిర్మలా సీతారామన్‌ గుర్తుచేశారు. వ్యాక్సిన్ల కోసం రూపొందించిన కొవిన్‌ యాప్‌.. కొవిడ్‌పై పోరులో ప్రపంచవ్యాప్తంగా ఓ సమర్థమైన సాధనంగా మారిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని