లిక్విడ్ ఫండ్లు Vs పొదుపు ఖాతా

ఈ స‌దుపాయంతో పెట్టుబ‌డుదారులు ఒక‌ రోజుకు రూ.50,000 వ‌ర‌కు వెంట‌నే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు....

Updated : 01 Jan 2021 17:31 IST

సుందరం మ్యూచువల్ ఫండ్ తాజాగా తన లిక్విడ్ ఫండ్, ‘సుందరం మనీ’ కింద తక్షణ విముక్తి సౌకర్యాన్ని ప్రారంభించింది. అనేక ఇతర ఫండ్ హౌస్‌లు ఇప్పటికే ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీంతో పెట్టుబ‌డుదారులు ఏడాదిలో ఎప్పుడైనా రోజుకు రూ.50,000 వ‌ర‌కు వెంట‌నే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా లిక్విడ్ ఫండ్ల నుంచి ఉపసంహ‌ర‌ణ‌కు ఒక‌టి లేదా రెండు రోజులు ప‌డుతుంది.

పొదుపు ఖాతాల‌కు ప్ర‌త్యామ్నాయంగా రూపొందించిన‌వే లిక్విడ్ ఫండ్లు. ఇవి అత్య‌వ‌స‌ర నిధిని పెట్టేందుకు మంచి పెట్టుబ‌డి మార్గంగా చెప్పుకోవ‌చ్చు. ఇటీవ‌ల బ్యాంకులు పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తున్న నేప‌థ్యంలో పెట్టుబ‌డుదారుల చూపు ఇటువైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంది. పొదుపు ఖాతాల‌తో పోలిస్తే ఇవి ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మో తెలుసుకోండి.

ఇప్పుడు త‌క్ష‌ణ లిక్విడిటీ స‌దుపాయంతో చిన్న పెట్టుబ‌డుదారులకు ఉపసంహ‌ర‌ణ కోరిన వెంట‌నే త‌మ ఖాతాల్లో డబ్బు జ‌మ‌వుతుంది. నిప్పాన్ మ్యూచువ‌ల్ ఫండ్, ఈ స‌దుపాయాన్ని 2016 లో మొద‌ట‌గా ప్రారంభించింది. దీంతో పాటు యాక్సిస్ మ్యూచువ‌ల్ ఫండ్, డీఎస్‌పీ మ్యూచువ‌ల్ ఫండ్, పీజీఐఎమ్ ఇండియా మ్యూచువ‌ల్ ఫండ్లు కూడా ఈ విధానాన్ని అనుస‌రించాయి.

2017 లో సెబీ కొన్ని నిబంధ‌న‌ల‌తో దీనిని ప్ర‌తిపాదించింది. ఇత‌ర ప‌థకాల్లో రిస్క్ అధికంగా ఉన్నందున లిక్విడిటీ ఫండ్ల‌కు మాత్ర‌మే ఈ స‌దుపాయాన్ని క‌ల్పించింది. సెబీ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, పెట్టుబ‌డుదారులు రోజుకు రూ.50,000 లేదా మొత్తం నుంచి 90 శాతం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఇది ఎలా ప‌నిచేస్తుంది?
విత్‌డ్రా క‌సం అభ్య‌ర్థ‌న దాఖ‌లు చేయాలి. ర‌ద్దు చేయాల్సిన యూనిట్ల సంఖ్య‌కు త‌గిన నిక‌ర విలువ (ఎన్ఏవీ) ఉందా లేదా అని చూసుకోవాలి. మీరు ఎంత ఉపసంహ‌రించుకోవాల‌నుకుంటున్నారో దాన్ని బ‌ట్టి ఎన్ఏవి వ‌ర్తిస్తుంది. క‌ట్‌-ఆఫ్ టైమ్ కంటే ముందే అభ్య‌ర్థ‌న చేస్తే ఆ రోజు ఎన్ఏవీ లేదా అంత‌క‌ముందు రోజు ఎన్ఏవీ ఏది త‌క్కువ‌గా ఉంటే దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. క‌ట్-ఆఫ్ టైమ్ త‌ర్వాత అభ్య‌ర్థ‌న చేరితే ఆ రోజు లేదా త‌ర్వాత రోజు ఎన్ఏవీలో ఏది త‌క్కువ‌గా ఉంటే దాన్ని వ‌ర్తింప‌జేస్తారు. ఆ రోజున యూనిట్ల సంఖ్యతో విభజించిన‌ అంతర్లీన సెక్యూరిటీల విలువ ఆధారంగా ఎన్ఏవీ లెక్కిస్తారు.

పొదుపు ఖాతాతో పోలిస్తే?
ప్ర‌స్తుతం బ్యాంకు పొదుపు ఖాతాల వ‌డ్డీ రేట్లు రెండు మూడేళ్ల క‌నిష్ఠంగా ఉన్నాయి. ఇంకా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ) పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ రేట్లను తాజాగా 3.5 శాతం నుంచి 3 శాతానికి త‌గ్గించింది. ఇక ఎస్‌బీఐ కూడా అత్య‌ధిక క‌నిష్ఠంగా 2.7 శాతానికి కోత విధించింది. వీటితో పోలిస్తే లిక్విడ్ ఫండ్లు స‌గ‌టుగా ఏడాది నుంచి 5.41 శాతం రాబ‌డిని ఇస్తున్నాయి.

మీరు ఏం చేయాలి?
అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకు పొదుపు ఖాతాల‌కు బ‌దులుగా లిక్విడ్ ఫండ్ల‌ను సూచిస్తారు నిపుణులు. త‌క్ష‌ణ ఉప‌సంహ‌ర‌ణ స‌దుపాయం మ‌రింత ప్ర‌యోజ‌నాన్ని క‌ల్పిస్తుంది. అయితే పొదుపు ఖాతాలు క‌చ్చిత‌మైన రాబ‌డిని అందించ‌డంతో పాటు రిస్క్ ఉండ‌దు. లిక్విడ్ ఫండ్ల రాబ‌డిని క‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేం. దీంతో పాటు లిక్విడ్ ఫండ్ల‌లో డిపాజిట్ చేసిన ఏడు రోజుల్లోపు ఉప‌సంహ‌రించుకుంటే కొంత ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ప‌న్ను త‌ర్వాత వ‌చ్చే లాభాల‌ను ఇత‌ర ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేయాలి.

పొదుపు ఖాతాల‌పై వ‌చ్చిన వ‌డ్డీ ఏడాదికి రూ.10,000 లోపు ఉంటే ప‌న్ను ఉండ‌దు. లిక్విడ్ ఫండ్ల‌లో స్వ‌ల్ప‌కాలిక లేదా దీర్ఘ‌కాలిక లాభాల‌పై ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఇది మీ ఫండ్ కాల‌ప‌రిమితి అధారంగా నిర్ణ‌యిస్తారు. మూడేళ్ల కాలం కంటే త‌క్కువ కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే స్వ‌ల్ప‌కాలిక ప‌న్ను మీ శ్లాబు ప్ర‌కారం ఉటుంది. మూడేళ్ల త‌ర్వాత కొన‌సాగిస్తే ఇండేక్సేష‌న్ బెనిఫిట్ తో, 20 శాతం దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ప‌న్ను చెల్లించాలి. మీరు చేసే పెట్టుబ‌డిపై వ‌చ్చే వ‌డ్డీ ఏడాదికి రూ.10,000 కంటే ఎక్కువ‌గా ఉంటే ఉంటుంద‌నుకంటే దానికోసం లిక్విడ్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

అయితే పెట్టుబ‌డుదారులు లిక్విడ్ ఫండ్ల పోర్ట్‌ఫోలియోను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల‌కు, అత్య‌వ‌స‌ర నిధికి లిక్విడ్ ఫండ్లు మంచి ఎంపిక‌. అయితే ఇందులో క్ర‌మంగా పొదుపు చేస్తుండాలి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఈ త‌క్ష‌ణ ఉప‌సంహ‌ర‌ణ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే నిర్ణ‌యం తీసుకునేముందు మీ ఆర్థిక అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని