అక్టోబ‌ర్ నెల‌లోనే `ఓలా` ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డెలివ‌రీ

ఓలా స్కూట‌ర్ కొన‌డానికి ప్లాన్ చేసేవారికి బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌లు రుణాలు ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాయి.

Updated : 07 Sep 2021 12:44 IST

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ జులైలో ప్రీ-లాంచ్ బుకింగ్‌ల‌ను రూ. 499/-కు ప్రారంభించింది. కేవ‌లం 24 గంట‌ల్లోనే 1 ల‌క్ష ఆర్డ‌ర్‌ల‌ను పొందింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఆర్డ‌ర్లు వ‌చ్చాయో కంపెనీ తెలుప‌లేదు. అయితే పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌, వాయు కాలుష్యం మూలంగా ఎల‌క్ట్రిక‌ల్‌ వాహ‌నాల‌కు భ‌విష్య‌త్తులో చాలా డిమాండ్ ఉండే అవ‌కాశం పుష్కలంగా ఉంది.  ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడే ఈ ఎల‌క్ట్రిక్ వాహానాల కొనుగోళ్ల‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌న్ను రాయితీలు, స‌బ్సీడీలు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇంకా మార్కెట్‌లోకి డెలివ‌రీ కాన‌ప్ప‌టికి లాంఛ‌నంగా అయితే ఈ ఆగ‌స్టు 15నే ప్రారంభ‌మ‌య్యింది. ఓలా స్కూట‌ర్ కొన‌డానికి ప్లాన్ చేసేవారికి బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌లు రుణాలు ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాయి. ఈ స్కూట‌ర్లు సెప్టెంబ‌ర్ 8 నుండి కొనుగోలు కోసం అందుబాటులో ఉంటాయి. డెలివ‌రీలు అయితే అక్టోబ‌ర్‌లో ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఓలా ప్ర‌తినిధి తెలిపారు.

ఓలా ఎల‌క్ట్రిక్ త‌న ఎస్‌1 స్కూట‌ర్ కొనాల‌నుకునే వినియోగ‌దారుల‌కు రుణాలు అందించ‌డానికి ప్ర‌ముఖ బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌ల‌తో ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చింది. యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎప్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, కోట‌క్ మ‌హీంద్రా ప్రైమ్‌, టాటా క్యాపిట‌ల్‌, ఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌, జ‌న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ ఇంకా కొన్ని ఆర్ధిక సంస్థ‌లు ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ల‌కు ఫైనాన్స్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నాయి. కంపెనీ ఓలా ఎస్‌1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను 2 ట్రిమ్‌ల‌లో - ఎస్‌1, ఎస్‌1 ప్రో వ‌రుస‌గా, రూ. 99,999, రూ. 1,29,999 వ‌ద్ద విడుద‌ల చేసింది (ఎక్స్‌-షోరూమ్ ధ‌ర‌లు ఫేమ్ 2 స‌బ్సిడీ, రాష్ట్ర స‌బ్సిడీల‌ను మిన‌హాయించి) అక్టోబ‌ర్‌లో డెలివ‌రీల‌ను ప్రారంభిస్తామ‌ని ఓలా తెలిపింది.

ఓలా స్కూట‌ర్ బ్యాంకుల‌తో ఒప్పందం త‌ర్వాత స్కూట‌ర్ ఫైనాన్సింగ్‌ను ఎంచుకోవాల‌నుకునే వినియోగ‌దారుల‌కు ఏ బ్యాంక్ అనే ఆప్ష‌న్ అందించ‌బ‌డుతుంద‌ని కంపెనీ తెలిపింది. రుణ ఆమోదం త‌ర్వాత స్కూట‌ర్ డెలివ‌రీ జ‌రుగుతుంది.  రుణ `ఈఎమ్ఐ` కేవ‌లం రూ. 2,999 నుండి ప్రారంభ‌మ‌వుతుంది. మొత్తం కొనుగోలు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. సెప్టెంబ‌ర్ 8 నుండి, వాహ‌నాన్ని రిజ‌ర్వ్ చేసుకున్న కాబోయే కొనుగోలుదారులు త‌గిన‌ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి వాహ‌న వేరియంట్‌, రంగు ఎంపిక‌ల‌ను ఖ‌రారు చేసి కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని కంపెనీ తెలిపింది. అయితే స్కూట‌ర్ డెలివ‌రీలు ఈ అక్టోబ‌ర్ నుండే ప్రారంభ‌మ‌వుతాయి. స్కూట‌ర్ ఇంటికి డెలివ‌రీ చేస్తాం అని కంపెనీ తెలిపింది.

కంపెనీ త‌న మొద‌టి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌, ఓలా ఎస్‌1ను ఆగ‌స్టు 15న ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌ల చేసింది. స్కూట‌ర్ 8.5 కేడ‌బ్ల్యూ మోట‌ర్‌, 3.97 కేడ‌బ్ల్యూహెచ్ బ్యాట‌రీ ప్యాక్‌ల‌తో 10 రంగుల‌లో విడుద‌ల చేయ‌బ‌డింది. త‌మిళ‌నాడులో `ఓలా` మెగా ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేసింది. త‌యారీ కేంద్రం 500 ఎక‌రాల‌లో విస్త‌రించ‌బ‌డింది. ఇది ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్కూట‌ర్ త‌యారీ క‌ర్మాగారం. మొద‌టి ద‌శ‌లో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా 10 ల‌క్ష‌ల స్కూట‌ర్ల వార్షిక ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యంతో ప్రారంభించి, ఆపై దానిని 20 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచుతామ‌ని కంపెనీ తెలిపింది. ఓలా ఫ్లాంట్ పూర్తిగా రెడీ అయిన త‌ర్వాత స్కూట‌ర్ల వార్షిక సామ‌ర్ధ్యం కోటి యూనిట్లు క‌లిగి ఉంటుంద‌ని, ఇది ప్ర‌పంచం మొత్తం ద్విచ‌క్ర వాహ‌నాల ఉత్ప‌త్తిలో 15 శాతం అని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని