Paytm IPO: నేడే దేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారా మరి?

వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నేటి నుంచి ప్రారంభమైంది....

Updated : 08 Nov 2021 16:09 IST

దిల్లీ: వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నేటి నుంచి ప్రారంభమైంది. నవంబరు 10న ముగియనుంది. మొత్తం రూ.18,300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఈక్విటీ షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు; ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద రూ.10,000 కోట్లు సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌ పరిమాణంలో దాదాపు సగం విలువ యాంట్‌ఫిన్‌ గ్రూప్‌దే. పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ, ఎలివేషన్‌ క్యాపిటల్ V FII హోల్డింగ్స్‌‌, ఎలివేషన్‌ క్యాపిటల్‌ V, సైఫ్‌ III మారిషస్‌ కంపెనీ, సైఫ్‌ పార్ట్‌నర్స్‌ ఇండియా IV వంటి కీలక కంపెనీలు ప్రతిపాదిత ఓఎఫ్‌ఎస్‌లో కొంత వాటాను విక్రయించనున్నాయి. ప్రొఫెషనల్లీ మ్యానేజ్డ్‌ కంపెనీగా పేటీఎం  మార్కెట్లో లిస్టవనుంది. సెబీ మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి కంపెనీలో ఏ ఒక్క సంస్థకు 25 శాతానికి మించి వాటాలు ఉండొద్దు. ప్రతిపాదిత ఐపీఓ విజయవంతమైతే భారత్‌లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఇదే అవుతుంది. 2010లో కోల్‌ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీఓనే ఇప్పటి వరకు అతిపెద్దది.

ఐపీఓ లక్ష్యం: వ్యాపార విస్తరణ, బలోపేతానికి రూ.4,300 కోట్లు, కొనుగోళ్లు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు రూ.2,000 కోట్లు వినియోగించనున్నారు. మిగిలిన మొత్తాన్ని జనరల్‌ కార్పొరేట్‌ అవసరాలకు సర్దుబాటు చేయనున్నారు.


ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలు...

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: నవంబరు 8, 2021

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: నవంబరు 10, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: నవంబరు 15, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: నవంబరు 16, 2021

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: నవంబరు 17, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: నవంబరు 18, 2021

ముఖ విలువ: రూ.01 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

లాట్‌ సైజు: 06 షేర్లు

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 06 (ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 90 (15 లాట్లు)

ఐపీఓ ధర శ్రేణి: ₹2,080 - ₹2150 (ఒక్కో ఈక్విటీ షేరుకు)


జాక్‌ మా, వారెన్‌ బఫెట్‌ను ఆకర్షించిన సంస్థ

పేటీఎం మాతృసంస్థ అయిన వన్‌97కమ్యూనికేషన్స్‌ను 2000లో ప్రారంభించారు. తొలుత మొబైల్‌ టాప్‌-అప్‌లు, బిల్లు చెల్లింపుల సేవల్ని అందించేది. 2009లో డిజిటల్‌ చెల్లింపుల నిమిత్తం ప్రారంభించిన పేటీఎం మొబైల్‌ యాప్‌తో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. అనతికాలంలో దేశంలో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులకు ప్రధాన డిజిటల్‌ మాధ్యమంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు జాక్‌మా, వారెన్‌ బఫెట్‌ వంటి వారిని ఆకర్షించింది. దేశంలో మొబైల్‌ పేమెంట్లకు ఓ దశలో మారుపేరులా మారిపోయింది. ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చిన అనేక ఫిన్‌టెక్‌లతో సమర్థంగా పోటీ పడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సేవల్ని మరింత విస్తృతం చేస్తోంది. 

ఆర్థిక చెల్లింపులతో పాటు విమానం, బస్‌, రైళ్ల టికెట్‌ బుకింగ్‌, పేటీఎం మనీ ద్వారా మదుపు, పేటీఎం మాల్‌ ద్వారా ఇ-కామర్స్‌, డిజిటల్‌ గోల్డ్‌, ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులు ఇలా అనేక సేవల్ని ప్రజలకు చేరువచేస్తోంది. ప్రస్తుతం పేటీఎంకు 333 మిలియన్లకు పైగా క్లయింట్లు, 21 మిలియన్లకు పైగా నమోదిత వ్యాపారులు ఉన్నారు. కంటర్‌ బ్రాండ్జ్‌ ఇండియా 2020 నివేదిక ప్రకారం.. పేటీఎం బ్రాండ్‌ విలువ 6.3 బిలియన్ డాలర్లు. ఏటా 114 మిలియన్ల మంది లావాదేవీలు నిర్వహిస్తున్నారు.


ఆర్థిక వివరాలు(రూ.కోట్లలో)

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని