DHFL: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు పూర్తి.. రూ.34,250 కోట్లు చెల్లించిన పిరమాల్‌

దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కొనుగోలు ప్రక్రియను పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఈఎల్‌) బుధవారం పూర్తి చేసింది.

Published : 30 Sep 2021 11:51 IST


 

ముంబయి: దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కొనుగోలు ప్రక్రియను పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఈఎల్‌) బుధవారం పూర్తి చేసింది. ఆ కంపెనీ రుణదాతలకు రూ.34,250 కోట్లను చెల్లించడం ద్వారా ఈ ప్రక్రియను ముగించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిష్కార ప్రణాళిక ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దార్లతో పాటు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణదాతలు రూ.38,000 కోట్లను రికవరీ చేయగలుగుతున్నారని పీఈఎల్‌ పేర్కొంది. పిరమాల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఈ రూ.34,250 కోట్లను నగదు, ఎన్‌సీడీల రూపంలో చెల్లించనుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వద్ద ఉన్న రూ.3,800 కోట్ల నగదు నిల్వను సైతం పరిష్కార ప్రణాళిక ప్రకారం రుణదాతలకే ఇస్తారు. 

అతిపెద్ద ‘పరిష్కారం’ ఇదే 

పిరమాల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌ మాట్లాడుతూ ‘ఆర్థిక సేవల రంగంలో దివాలా నిబంధనల కింద విజయవంతంగా పూర్తయిన తొలి పరిష్కారం ఇదే. విలువ పరంగా కూడా ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద పరిష్కారం. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను మేం విలీనం చేస్తాం. విలీన కంపెనీని పిరమాల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌గా పిలుస్తార’ని పేర్కొన్నారు. రాబోయే కొద్ది వారాల్లో ఈ విలీనం పూర్తవుతుంది. విలీన సంస్థ 100 శాతం పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధ కంపెనీగా మారుతుంది. 

1000 మంది నియామకం

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు 70,000 మంది రుణదాతలున్నాయి. వీరందరికీ తాము పొందాల్సిన బకాయిల్లో 46 శాతం వరకు అందనుందని పిరమాల్‌ పేర్కొన్నారు. ఈ లావాదేవీ నిర్వహించడానికి సరిపడా నిధులు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. పిరమాల్‌ గ్రూప్‌ పరిష్కార ప్రణాళికకు జనవరి 2021న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణదాతలు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. రాబోయే 3-4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1000 ప్రాంతాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. స్వల్పకాలం నుంచి మధ్యకాలంలో కనీసం 1000 మంది సిబ్బందిని నియమించుకుంటామని పిరమాల్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని