AirIndia: ‘వెల్‌కమ్‌ బ్యాక్ ఎయిరిండియా’.. రతన్‌ టాటా ట్వీట్‌

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన సొంత యజమానుల చెంతకు చేరుకుంటోంది. అప్పుల ఊబిలో

Updated : 26 Oct 2021 13:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన సొంత యజమానుల చెంతకు చేరుకుంటోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు బిడ్డింగ్‌ నిర్వహించగా.. టాటా సన్స్‌ విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపికమైంది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ఛైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎయిరిండియాకు తిరిగి స్వాగతం’’ అంటూ ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ మాజీ ఛైర్మన్‌ జేఆర్‌డీ టాటా ఎయిరిండియా విమానం నుంచి దిగుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. 

‘‘ఎయిరిండియా కోసం టాటా గ్రూప్‌ బిడ్ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం! ఎయిరిండియా పునర్నిర్మాణానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ.. ఈ పరిణామాలు విమానయాన పరిశ్రమలో టాటాగ్రూప్‌నకు బలమైన మార్కెట్‌ అవకాశాలు కల్పిస్తాయని విశ్వసిస్తున్నాం. ఒకప్పుడు జేఆర్‌డీ టాటా నాయకత్వంలో ఎయిరిండియా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విమానయాన సంస్థగా ఖ్యాతి గడించింది. ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్‌ వైభవం తీసుకొచ్చేందుకు టాటాలకు మళ్లీ అవకాశం లభించింది. ఈ రోజు జేఆర్‌డీ టాటా మన మధ్యన ఉంటే ఎంతో ఆనందపడేవారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వెల్‌కమ్‌ బ్యాక్‌, ఎయిరిండియా!’’ అని రతన్‌ టాటా రాసుకొచ్చారు. 

1932లో జేఆర్‌డీ టాటా విమానయాన రంగంలో అడుగుపెట్టారు. టాటా ఎయిర్‌ సర్వీసెస్ పేరుతో ఎయిర్‌లైన్‌ ప్రారంభించారు. ఆ తర్వాత 1953లో జాతీయీకరణలో భాగంగా ఈ కంపెనీ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. అయితే 1977 వరకు జేఆర్‌డీ టాటానే ఛైర్మన్‌గా కొనసాగారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిన ఎయిరిండియా గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అప్పుల గుట్టలు పెరిగాయి. దీంతో ఈ సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు చాలా సంస్థలే ఆసక్తి చూపించాయి. అయితే టాటా సన్స్‌ వేసిన బిడ్‌ ఆకర్షణీయంగా ఉండటంతో ప్రభుత్వం టాటాలను విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపికచేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని