తెలుగు రాష్ట్రాల్లో 350 మంది ఉద్యోగుల నియామకం:  శ్రీరాం హౌసింగ్‌ ఫైనాన్స్‌

అందుబాటు ధర ఇళ్ల కొనుగోలు కోసం రుణాలు అందించే శ్రీరాం హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిసి ఈ ఏడాది చివరికి 178

Updated : 09 Sep 2021 10:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: అందుబాటు ధర ఇళ్ల కొనుగోలు కోసం రుణాలు అందించే శ్రీరాం హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిసి ఈ ఏడాది చివరికి 178 శాఖలను ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. దీంతోపాటు కొత్తగా 350 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు వెల్లడించింది. అందుబాటు ధర ఇళ్ల రుణాల విపణిలో వాటా పెంచుకునేందుకు ఈ విస్తరణ తోడ్పడుతుందని సంస్థ ఎండీ, సీఈఓ రవి సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.


అధీకృత మూలధన విలువను రూ.901 కోట్లకు పెంచిన ఓయో

దిల్లీ: ఓయో హోటళ్లను నిర్వహించే ఓర్వల్‌ స్టేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన అధీకృత మూలధన విలువను రూ.1.17 కోట్ల నుంచి రూ.901 కోట్లకు పెంచింది. సెప్టెంబరు 1న జరిగిన ఈజీఎంలో (సర్వసభ్య సాధారణ సమావేశం) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు కంపెనీ సమర్పించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. అధీకృత మూలధనం అంటే.. ఏదేని సమయంలో కంపెనీ షేర్లను జారీ చేసేందుకు వీలున్న గరిష్ఠ మూలధన విలువ. ప్రస్తుతం ఓయో అధీకృత మూలధన విలువ రూ.1,17,80,010 కాగా.. ఇకపై రూ.9,01,13,59,300 కోట్లుగా మారనుంది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) యత్నాల్లో ఓయో ఉన్న నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.  రాబోయే కొన్ని నెలల్లో సెబీకి ఐపీఓ సంబంధిత దరఖాస్తు పత్రాలను సమర్పించే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. ఆగస్టులో మైక్రోసాఫ్ట్‌ నుంచి సుమారు 5 మిలియన్‌ డాలర్ల నిధులను ఓయో సమీకరించింది.


14 నుంచి సాన్సెరా ఇంజినీరింగ్‌ ఐపీఓ

ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.734- 744

దిల్లీ: వాహన విడిభాగాల తయారీ సంస్థ సాన్సెరా ఇంజినీరింగ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈనెల 14న ప్రారంభమై 16న ముగియనుంది. ఇష్యూలో భాగంగా జారీ చేసే షేర్లకు ధరల శ్రేణిగా రూ.734- 744ను నిర్ణయించారు. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,283 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో జరగనున్న ఈ ఐపీఓలో ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 1,72,44,328 షేర్లను విక్రయించనున్నారు. సగం షేర్లను అర్హులైన సంస్థాగత మదుపర్లకు (క్యూఐబీలు), 35 శాతాన్ని చిన్న మదుపర్లకు, మిగలిన 15 శాతం షేర్లను సంస్థాగతేతర మదుపర్లకు కేటాయించారు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు దరఖాస్తు ప్రక్రియ 13న ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని