గ్రూప్‌లో ఆరోగ్య‌బీమా ఉన్నా సొంత‌ పాలసీ అవసరమా?

వ్య‌క్తిగ‌త ఆరోగ్యబీమా, గ్రూపు ఆరోగ్య బీమా ప‌థ‌కాలు చూసేందుకు ఒక‌టే అనిపించినా వ‌ర్తించే క‌వ‌రేజీ, ప్లాన్ మొద‌లైన అంశాల విష‌యంలో తేడాలుంటాయి

Published : 27 Dec 2020 20:10 IST

గ్రూప్ ఆరోగ్య బీమా పాల‌సీ ఉండ‌గా వ్య‌క్తిగ‌త/ ఫ్లోటర్ ఆరోగ్య‌ బీమా పాల‌సీ అవ‌స‌ర‌మా?వ్య‌క్తిగ‌త ఆరోగ్యబీమా, గ్రూపు ఆరోగ్య బీమా ప‌థ‌కాలు చూసేందుకు ఒక‌టే అనిపించినా వ‌ర్తించే క‌వ‌రేజీ, ప్లాన్ మొద‌లైన అంశాల విష‌యంలో తేడాలుంటాయి. పాల‌సీ ప్రీమియం, ఇత‌ర ప్ర‌త్యేక రైడ‌ర్లు వంటివి రెండింటికీ తేడాను స్ప‌ష్టంగా తెలియజేస్తాయి. అయితే వాటిలో ఉండే తేడాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం .

290220.jpg

ప్రీమియం:
గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ ల‌కు ప్రీమియం త‌క్కువ, ఎందుకంటే ఎక్కువ మంది క‌లిపి ఒక బీమా సంస్థ నుంచి పాల‌సీలు తీసుకున్న‌పుడు స‌హ‌జంగానే కొంత త‌గ్గింపు ఉంటుంది. వ్య‌క్తిగ‌త బీమాకి ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. సాధారణంగా బృంద బీమా లో 30-35 శాతం వరకు ప్రీమియం లో తగ్గింపు పొందొచ్చు.

సౌలభ్యం, నియంత్రణ:
సమూహ బీమా ప‌థ‌కం తీసుకోవాలనుకుంటే , సంస్థ ద్వారా ఉద్యోగికి అందుతుంది. వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా ప‌థ‌కం విష‌యానికొస్తే అండర్ రైటింగ్ ప్రక్రియలో ప‌రిశీలించే వైద్య,ఆర్థిక చరిత్ర ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా వ్య‌క్తిగ‌త పాల‌సీల దరఖాస్తును కొన్ని సార్లు తిర‌స్క‌రించే అవ‌కాశ‌ముంటుంది. ఆ లెక్క‌న చూస్తే సంస్థ ద్వారా బీమా ప‌థ‌కాన్ని పొంద‌డం కొంత సుల‌భ‌మ‌ని చెప్పాలి.

నో క్లెయిం బోన‌స్:
సాధార‌ణంగా వ్య‌క్తిగ‌తంగా తీసుకునే బీమా ప‌థ‌కాల్లో పాల‌సీదారులు క్లెయిం చేయ‌కుంటే వారికి నోక్లెయిం బోన‌స్ అందుతుంది. గ్రూపు బీమా ప‌థ‌కాల్లో నో క్లెయిం బోన‌స్ ఉండ‌దు.

ఉద్యోగం మారే సమయం లో…
కంపెనీ పరిస్థితులు అనుకూలించని సమయం లో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించినా, మీరు మరొక మంచి అవకాశం వచ్చినప్పుడు వేరే సంస్థకి మారుదాం అనుకున్న కాస్త సమయం పట్టచ్చు. ఈ లోపు మీకు, మీ కుటుంబానికి ఏదైనా వైద్య పరమైన ఇబ్బందులు ఎదురైతే మీకు గ్రూప్ పాలసీ వర్తించదు. కాబట్టి మీరు ఆర్ధికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

రెండింటిలో ఏది తీసుకోవాలి?
గ్రూపు ప‌థ‌కాల్లో అంద‌రికీ ఒకే విధ‌మైన ష‌ర‌తులు ఉంటాయి. వాటికి అనుగుణంగా పాల‌సీ ఉంటుంది. ఉద్యోగ సంస్థ‌లు ఈగ్రూపు బీమా ప‌థ‌కాల‌ను అందించాల‌నే నియమం లేదు. కొన్ని సంస్థ‌లు ఇవ్వొచ్చు, కొన్ని ఇవ్వ‌క‌పోవ‌చ్చు. త‌ర‌చూ ఉద్యోగాలు మారేవారు గ్రూప్ బీమా ప‌థ‌కాల‌తో ప్ర‌యోజ‌నం పొంద‌క‌పోవ‌చ్చు. త‌దుప‌రి వెళ్లిన కంపెనీలో ఆ స‌దుపాయం లేక‌పోవ‌చ్చు.కాబ‌ట్టి వ్యక్తిగ‌తంగా ఆరోగ్య బీమా తీసుకోవ‌డం ప్ర‌యోజ‌న‌మ‌నే చెప్పాలి. కనీసం గ్రూప్ పాలసీ పైన టాప్ అప్/ సూపర్ టాప్-అప్ పాలసీ అయినా తీసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని