డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప‌న్ను విధానం ఎలా?

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోమూల‌ ధ‌న ఆదాయం పై ప‌న్ను ఏవిధంగా వ‌ర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.​​​​​​.....

Published : 19 Dec 2020 13:13 IST

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోమూల‌ ధ‌న ఆదాయం పై ప‌న్ను ఏవిధంగా వ‌ర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.​​​​​​​

మ్యూచువల్ ఫండ్లు అనగానే మనకి గుర్తొచ్చేది అధిక రాబడి. అయితే, మ్యూచువల్ ఫండ్లలో ఎన్నో రకాల ఫండ్లు ఉంటాయి. వీటిలో కొన్ని సురక్షితమైనవి, కొన్ని స్థిరాదాయం ఇచ్చేవి, కొన్ని రిస్క్ తో కూడుకున్నవి, ఇలా ఎన్నో ఉంటాయి. ప్రధానంగా చుస్తే మ్యూచువల్ ఫండ్లు రెండు రకాలు - డెట్, ఈక్విటీ. డెట్ ఫండ్లు వివిధ ర‌కాల స్థిరాదాయ‌ ప‌థ‌కాల్లో మ‌దుపు చేస్తాయి. ఈక్విటీ ఫండ్ల‌తో పోలిస్తే వీటిపై మ‌దుప‌ర్ల‌కు వ‌చ్చే రాబ‌డి నిల‌క‌డ‌గా ఉంటుంది. పోర్టిఫోలియో వైవిధ్య‌త మూలంగా న‌ష్ట‌భ‌యం త‌గ్గి రాబ‌డి స్థిరంగా ఉంటుంది. అయితే వీటిలో మూల‌ధ‌న ఆదాయం పై ప‌న్ను ఏవిధంగా వ‌ర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌న్నువిధానం:

ఆదాయ‌ప‌న్నుకు సంబంధించి వివిధ ర‌కాల స్లాబుల‌కు చెందిన మ‌దుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తుంటారు. సాంప్ర‌దాయ డెట్ రాబ‌డి ప‌థ‌కాల్లో ప్ర‌తీ ఏడాది మ‌దుప‌రి స్లాబు రేటు వ‌ద్ద‌ ప‌న్నుచెల్లించాల్సి ఉంటుంది.

డెట్ ఫండ్ల‌లో మూడేళ్ల‌కు మించితే దీర్ఘ‌కాల మూల ధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. మూడేళ్ల‌కంటే త‌క్కువ‌గా ఉంటే స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. డెట్ ఫండ్ల‌లో స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న ఆదాయం మ‌దుప‌ర్ల వారి స్లాబు రేటు ప్ర‌కారం ఉంటుంది. డెట్ ఫండ్లో మ‌దుపు మూడేళ్లకు పైబ‌డి చేస్తే దీర్ఘ‌కాల రాబ‌డి పై మాత్రం 20శాతం (ఇండెక్సేష‌న్) ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ట్యాక్స్ 25% ఉంటుంది. సెస్ , స‌ర్ ఛార్జీల‌తో క‌లిపితే 29.12% డీడీటీ ఫండ్ నిర్వాహ‌కులు చెల్లించాలి. గ‌రిష్ట ప‌న్ను రేటు స్లాబు లో ఉన్న వారికి డెట్ ఫండ్ల ద్వారా ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక మ‌దుప‌రి రూ.10 ల‌క్ష‌ల‌ను 5 సంవ‌త్స‌రాల‌కు 9 శాతం వ‌డ్డీకి బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ చేశార‌నుకుందాం. దీని ద్వారా అత‌నికి ఐదేళ్ల‌కు మొత్తం రూ. 4.5 ల‌క్ష‌లు ఆదాయం ల‌భిస్తుంది. అంటే సంవ‌త్స‌రానికి రూ.90 వేలు ఆదాయం ల‌భిస్తుంది.

ఆ వ్య‌క్తి 30 శాతం ఆదాయ‌ప‌న్నుస్లాబులో ఉన్న‌ట్ల‌యితే దాదాపు రూ. 1.35 ల‌క్ష‌లు ప‌న్ను చెల్లించాలి. ప‌న్నుత‌ర్వాత ల‌భించే ఆదాయం రూ.3.15 ల‌క్ష‌లు అవుతుంది. అదే డెట్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాల మూల ధ‌న ఆదాయంపై ప‌న్ను ఇండెక్షేష‌న్ తో 20శాతం వ‌ర్తిస్తుంది. 9 శాతం రాబ‌డి చొప్పున లెక్కేస్తే వ‌చ్చిన రూ. 4.5 ల‌క్ష‌లు ఆదాయానికి ఇండెక్షేష‌న్ తో (ద్ర‌వ్యోల్బ‌ణ స‌ర్దుబాటుతో). ప‌న్ను 20 శాతం చెల్లించాలి.దీంతో త‌క్కువ ప‌న్ను చెల్లించ‌వ‌చ్చు.మ‌దుప‌ర్లు సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ద్వారా డ‌బ్బుతీసుకోవ‌చ్చు.

మ‌దుప‌ర్లు కొంత మ‌దుపును డెట్ ఫండ్లలో పెట్టుబ‌డి చేయ‌డంపై ఆలోచించాలి. అయితే మ‌దుపుచేసే ముందు ఆయా ప‌థ‌కాల‌ను బాగా అర్థం చేసుకోవాలి. ఆర్థిక‌ స‌ల‌హాదారుని సంప్ర‌దించి త‌గిన నిర్ణ‌యం తీసుకోవాలి.వీటిలో ఉండే క్రెడిట్ రిస్క్, వ‌డ్డీరేటు రిస్క్ ల‌పై అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని