Stock market: 2021కి లాభాలతో వీడ్కోలు.. సూచీల్లో కొత్త ఏడాది జోష్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఈరోజు ఆద్యంతం మార్కెట్లలో కొత్త సంవత్సరం జోష్‌ కనిపించింది....

Updated : 31 Dec 2021 16:10 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు ఈ ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఈ రోజు ఆద్యంతం మార్కెట్లలో కొత్త సంవత్సరం జోష్‌ కనిపించింది. ఈ సంవత్సరం తరహాలోనే వచ్చే ఏడాది కూడా మార్కెట్లలో లాభాలు ఆర్జింజే అవకాశాలు మెండుగానే ఉంటాయన్న విశ్లేషణలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి.

త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్‌(Budget) అంచనాలు, కొత్త సంవత్సరంలో ఎఫ్‌ఐఐ(FII)ల రీఎంట్రీ వంటి పరిణామాలతో జనవరి నెల సూచీలకు కలిసొచ్చే అవకాశం ఉందన్న అంచనాలు శుక్రవారం నాటి మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ(GST) పెంపు అమలును వాయిదా వేయడం కూడా సెంటిమెంటును పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు రాణించడం విశేషం.

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 57,849.76 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆద్యంతం అదే జోరును కొనసాగించిన సూచీ 58,409.30 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 459.50 పాయింట్ల లాభంతో 58,253.82 వద్ద ముగిసింది. 17,244.50 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,400.80 - 17,238.50 మధ్య కదలాడింది. చివరకు 150.10 పాయింట్లు లాభపడి 17,354.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో లాభపడ్డ/నష్టపోయిన షేర్లు

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు అమలును వాయిదా నిర్ణయంతో టెక్స్‌టైల్‌ రంగ షేర్లు రాణించాయి. రేమండ్స్‌, ట్రైడెంట్‌ వంటి కంపెనీల షేర్లు లాభపడ్డాయి. 

* హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు వరుసగా తొమ్మిదో రోజూ లాభపడ్డాయి. గత 20 ఏళ్లలో ఇలా వరుసగా ఇన్ని రోజులు లాభపడడం ఇదే తొలిసారి.

* క్యాడిలా హెల్త్‌కేర్‌ షేర్లు నేడు రాణించాయి. పార్కిన్సన్‌ వ్యాధికి సంబంధించి ఓ ఔషధాన్ని తయారు చేయడానికి క్యాడిలా అనుబంధ సంస్థకు అనుమతి లభించింది.

* ‘సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ లిమిటెడ్‌’ షేర్లు స్టాక్స్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.216తో పోలిస్తే రెండు శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. చివరకు 12 శాతం లాభంతో రూ.241.95 వద్ద స్థిరపడ్డాయి. 

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బ్రిటన్‌కు చెందిన బ్యాటరీ తయారీ సంస్థ ఫరాడియన్‌ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.1003 కోట్లు.

* అలీస్‌ ఇండియా, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 100 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రముఖ ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రా ప్రకటించింది.

* దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. లోహ రంగ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని