Stock Market: బేర్‌ జోరు.. మదుపర్లకు బేజారు!

గతకొన్ని రోజులుగా తీవ్ర ఒడుదొడుకుల ఎదుర్కొంటున్న స్టాక్‌ మార్కెట్లు సోమవారం పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి......

Updated : 22 Nov 2021 15:54 IST

ముంబయి: గతకొన్ని రోజులుగా తీవ్ర ఒడుదొడుకుల ఎదుర్కొంటున్న స్టాక్‌ మార్కెట్లు సోమవారం పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో మదుపర్లు నేడు తీవ్ర నష్టాల్ని చవిచూశారు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో సూచీల్లో వచ్చిన ర్యాలీ నేటితో పూర్తిగా నెమ్మదించినట్లైంది. స్టాక్ విలువలు గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు ఇప్పటి వరకు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ వచ్చారు. దీనికి అంతర్జాతీయ ప్రతికూలతలు జతకావడంతో సూచీలు నేడు పూర్తిగా బేర్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఈరోజు మార్కెట్లకు మరో బ్లాక్‌ మండేగా మిగిలిపోయింది.

ఉదయం సెన్సెక్స్‌ 59,710.48 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,778.37 - 58,011.92 మధ్య కదలాడింది. ఓ దశలో సెన్సెక్స్‌ 1600 పాయింట్లకు పైగా కుంగింది. చివరకు 1,170 పాయింట్ల నష్టంతో 58,465.89 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 17,280.45 వద్ద కనిష్ఠాన్ని, 17,805.25 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 348.25 పాయింట్లు నష్టపోయి 17,416.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.40 వద్ద నిలిచింది. 

సెన్సెక్స్‌ 30 సూచీలో 04 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అధికంగా నష్టపోయిన వాటిలో బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, సన్‌ఫార్మా, మారుతీ, ఐటీసీ షేర్లు ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

రంగాలవారీగా చూస్తే.. ఒక్క టెలికాం మినహా దాదాపు అన్ని రంగాలు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ భారీ దిద్దుబాటుతో ఈ నెలలో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన ఏడు కంపెనీల్లో నాలుగింటి షేర్లు ఇష్యూ ధర కంటే కిందికి దిగజారాయి. పేటీఎం అత్యధికంగా 14 శాతం మేర నష్టపోయింది.

కారణాలివే..

* అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గతవారం నష్టాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి

* ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం సెంటిమెంటును దెబ్బతీసింది. జర్మనీలో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. ఆస్ట్రియా సహా మరికొన్ని దేశాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. యూకే, ఇటలీ, స్పెయిన్‌ వంటి ప్రముఖ దేశాల్లో కేసులు మళ్లీ పెరుతున్నాయి.

* ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. భారత్‌లోనూ గత నెల రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం పెరిగిన విషయం తెలిసిందే.

* ఈ వారంలోనే నవంబరు నెలవారీ ఎక్స్‌పైరీ కూడా ఉంది.

* మరోవైపు టెక్నికల్‌గా నిఫ్టీ సూచీ 50 రోజుల మూవింగ్‌ యావరేజీ కిందకు వెళ్లింది. ఇది మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.

* ఇక, ఫార్మా రంగం మరీ బలహీనంగా ట్రేడవుతోంది.

* రిలయన్స్‌-ఆరామ్‌కో మధ్య కుదిరిన ఒప్పందం దాదాపు రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేర్లు దాదాపు 4.5 శాతం మేర కుంగాయి.

* బీఎస్‌ఈలో మెజారిటీ వాటా కలిగిన బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ, టైటన్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ షేర్లకు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.

* ఇక గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన పేటీఎం షేరు నేడు భారీ నష్టాల్ని చవిచూసింది. లిస్టింగ్‌ ధరతో పోలిస్తే నేటి ట్రేడింగ్‌లో ఓ దశలో 36 శాతం కుంగి రూ.1271 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని