వాహ‌నం విక్ర‌యిస్తున్నారా? బీమా వృథా అవ్వాల్సిందేనా?

కొత్త వాహ‌నం కొనుగోలు చేయ‌డంతోనే పాత బీమా ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రంలేదు

Published : 25 Dec 2020 20:35 IST

కొత్త వాహనం కొన్న వారికి అప్పటికే పాత వాహనంపై బీమా ఉంటే ఎలా? పాత బీమా పాలసీని రద్దు చేసుకొని కొత్త పాలసీని కొనుగోలుచేయాల్సిందేనా? అధికంగా ఖర్చు తప్పదా? మరి దీనికి పరిష్కార మార్గం…

కొత్త వాహ‌నానికి బీమా బ‌దిలీ…

కొత్త వాహనం పాత వాహనం తరహాదే అయితే పాత బీమానే కొనసాగించవచ్చు. మిగిలి ఉన్న బీమా కాలానికి ప్రీమియంను సరిచేసి తదుపరి ప్రీమియం చెల్లింపులు ఎలా జరపాలో బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం కొత్త వాహన వివరాలను, బీమా కాలపరిమితి కొనసాగుతున్న వివరాలను బీమా కంపెనీకి తెలియపర్చాల్సి ఉంటుంది. పాత, కొత్త వాహనాల్లో పెద్దగా తేడాలు లేనట్టయితే బీమా కంపెనీలు పాత పాలసీనే కొనసాగించేందుకు అనుకూలత చూపిస్తాయి.

ఇత‌రుల నుంచి వాహ‌నాన్ని కొనుగోలు చేసిన‌ప్పుడు…

  • ఇత‌రుల నుంచి వాహ‌నాన్ని పొందిన‌ప్పుడు మ‌న పేరిట బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టు రిజిస్ట్రేష‌న్ లో మార్పుచేర్పులు చేసుకుంటాం. వాహ‌న విక్రేత బీమాను కూడా మ‌న పేరిట బ‌దిలీచేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిస్తే చ‌ట్ట‌బ‌ద్ధంగా ఎలా ముందుకు సాగాలో చూద్దాం…

  • ఇత‌రుల నుంచి వాహనాన్ని పొందిన‌ట్టుగా కొనుగోలు చేసిన‌ 14రోజుల్లోపు బీమా కంపెనీకి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి.

  • వాహన రిజిస్ట్రేషన్‌ వివరాలు, బదిలీ తేది, పాత యాజమాని పేరు వివరాలతోపాటు పాలసీ సంఖ్య, బీమా తీసుకున్న తేదీ తదితర వివ‌రాలు ద‌ర‌ఖాస్తులో పేర్కొనాలి. అప్పుడు బీమా కంపెనీ తమ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేసుకొని కొత్త బీమా పత్రాన్ని కొత్త యాజమాని పేరిట జారీచేస్తుంది.

నో క్లెయిమ్ బోన‌స్ వ‌ర్తించ‌దు

  • నో క్లెయిం బోనస్‌ కొత్త యాజమానికి వర్తించదు. ఈ ప్ర‌యోజ‌నం వ్య‌క్తుల‌ సొంతం, వాహ‌నాల‌ది కాదు. నో క్లెయిమ్ బోన‌స్ వాహ‌నాన్ని జాగ్ర‌త్త‌గా న‌డిపినందుకు ఇచ్చే ప్ర‌శంస‌లాంటిది. త‌దుప‌రి ప్రీమియం చెల్లింపుల్లో త‌గ్గుద‌ల నో క్లెయిమ్ బోన‌స్‌తో సాధ్య‌మ‌వుతుంది. పాలసీ బదిలీ స‌మ‌యంలో ఈ విష‌యాన్ని జాగ్ర‌త్తగా గ‌మ‌నించాలి.

ఓన్ డ్యామేజ్‌, ప్యాకేజీ పాల‌సీ ర‌కాల బ‌ద‌లాయింపు

  • ప్యాకేజీ పాలసీల విషయంలో సొంత నష్టానికి (ఓన్‌ డ్యామేజీ) సెక్షన్‌ను కొత్త యాజమాని పేరిట మార్చుకునేందుకు పాత యాజమాని సమ్మతి అవసరముంటుంది.

  • వాహనాన్ని ఇత‌రుల నుంచి కొనుగోలు చేసిన‌ట్టుగా ఆధారాలు, పూర్తి వివరాలతో నింపి సంతకం చేసిన కొత్త దరఖాస్తు ఫారం సమర్పించాకే ప్యాకేజీ పాలసీని కొత్త యాజమాని పేరిట బదిలీ చేస్తారు. ఇందుకోసం పాత బీమా పత్రాన్ని బీమా కంపెనీకి స్వాధీనపర్చాలి. ఒక వేళ బీమా పత్రం సమర్పించలేకపోతే సరైన వివరణ ఇస్తూ లేఖ రాయాల్సి ఉంటుంది.

వాహ‌నాన్ని అమ్మ‌కానికి ఉంచిన వెంట‌నే బీమాను ర‌ద్దు చేసుకోవ‌డం మంచి నిర్ణ‌యం కాదు. ర‌ద్దు చేసుకునేందుకైనా, ఇత‌రుల‌కు బీమాను బ‌దిలీ చేయాల‌నుకున్నా స‌రైన స‌మ‌యం కోసం వేచి చూడాలి. ఆ స‌రైన స‌మ‌యం ఎప్పుడో వేచిచూస్తే మీకే తెలిసిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని