స్వ‌ల్ప‌కాలానికి స‌రైన పెట్టుబ‌డి మార్గాలు

సాధార‌ణంగా, ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒక‌సారి పెద్ద‌మొత్తంలో డ‌బ్బు చేతికొస్తుంది. దీన్ని స్వ‌ల్ప‌కాల వ్య‌వ‌ధిలో 3 నుంచి 6 నెల‌ల దాకా మంచి రాబ‌డినిచ్చే పెట్టుబ‌డుల్లో పెట్టాల‌ని అనుకుంటాం. అత్య‌వ‌స‌ర నిధిగా అవ‌స‌ర‌మవుతుంద‌నే ఉద్దేశంతోనూ ఈ డ‌బ్బును ఎక్క‌డైనా మ‌దుపు చేద్దామ‌నుకుంటాం. చాలా మంది ఇలా పెద్ద‌మొత్తంలో అందుకున్న‌ డ‌బ్బును పొదుపు ఖాతాలో వేస్తుంటారు. కొంద‌రు..

Published : 16 Dec 2020 14:34 IST

సాధార‌ణంగా, ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒక‌సారి పెద్ద‌మొత్తంలో డ‌బ్బు చేతికొస్తుంది. దీన్ని స్వ‌ల్ప‌కాల వ్య‌వ‌ధిలో 3 నుంచి 6 నెల‌ల దాకా మంచి రాబ‌డినిచ్చే పెట్టుబ‌డుల్లో పెట్టాల‌ని అనుకుంటాం. అత్య‌వ‌స‌ర నిధిగా అవ‌స‌ర‌మవుతుంద‌నే ఉద్దేశంతోనూ ఈ డ‌బ్బును ఎక్క‌డైనా మ‌దుపు చేద్దామ‌నుకుంటాం. చాలా మంది ఇలా పెద్ద‌మొత్తంలో అందుకున్న‌ డ‌బ్బును పొదుపు ఖాతాలో వేస్తుంటారు. కొంద‌రు బ్యాంకు ఎఫ్‌డీల‌కు ప్రాధాన్య‌మిస్తే మ‌రి కొంద‌రేమో డెట్ మ్యూచువల్ ఫండ్లలో లిక్విడ్ ఫండ్స్‌, అల్ట్రా షార్ట్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు.

లిక్విడ్ ఫండ్స్‌:

ఇన్ని రోజులు లిక్విడ్ ఫండ్ల‌ ఎంపికకు మ‌దుప‌ర్లు ప్రాధాన్య‌మిచ్చేవారు. మంచి లిక్విడ్ ఫండ్‌లో కనీసం 7.5 నుంచి 8.5శాతం వార్షిక రాబ‌డి వ‌చ్చేది. అంతేకాదు ఇందులో ఉన్న సొమ్మును ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకునే వీలుంది. ఈ ప‌రిస్థితిలో మార్పు క‌నిపిస్తుంది. లిక్విడ్ ఫండ్లు ఇప్పుడు 8శాతం రాబ‌డిని అందించ‌డంలేవు. మంచి లిక్విడ్ ఫండ్స్ సైతం కేవ‌లం 6 నుంచి 6.5శాతం మేర‌కు వార్షిక రాబ‌డిని అందిస్తున్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు:

ఆర్‌బీఐ సూచించిన ప్ర‌కారం త‌గ్గిన వ‌డ్డీ రేట్ల ప్ర‌భావంతో బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తూ వ‌చ్చాయి. సాధార‌ణంగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు 6 నెల‌ల డిపాజిట్ కాలానికిగాను కేవ‌లం 6 నుంచి 6.5శాతం వార్షిక వ‌డ్డీనందిస్తున్నాయి.

పొదుపు ఖాతా:

సాధార‌ణ పొదుపు ఖాతా వార్షికంగా 4శాతం వ‌ర‌కు వ‌డ్డీనందిస్తున్నాయి. ఇటీవ‌లె దీన్ని మ‌రింత త‌గ్గించి 3-3.5 శాతానికి ప‌రిమితం చేశాయి. కాగా కొన్ని బ్యాంకులు మాత్రం ఖాతాదారుల‌ను ఆక‌ర్షించేందుకు ఇత‌ర వాటిక‌న్నా ఎక్కువ వ‌డ్డీనిస్తున్నాయి. కొన్నైతే 5-6 శాతం వ‌డ్డీ నిర్ణ‌యించాయి.

లిక్విడ్ ఫండ్స్‌- మూడేళ్ల లోపు విత్‌డ్రా చేసుకుంటే వ్య‌క్తి ఆదాయ‌పు ప‌న్ను శ్లాబ్‌ను అనుస‌రించి ప‌న్ను విధిస్తారు. అదే పెట్టుబ‌డి పెట్టిన‌ మూడేళ్ల త‌ర్వాత సొమ్మును విత్‌డ్రా చేసుకుంటే ఇండ‌క్సేష‌న్‌తో క‌లిపి 20శాతం. ఇదే ప‌న్ను విధానం అన్ని డెట్ ఫండ్ల‌కు వ‌ర్తిస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు- అన్ని లావాదేవీల‌కు వ్య‌క్తిగ‌త ఆదాయ‌పు ప‌న్ను శ్లాబ్‌ను అనుస‌రించి ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు. ఎన్నేళ్లు డిపాజిట్ చేశామ‌న్న దాన్ని ప‌రిగ‌ణించ‌జాల‌రు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో డిపాజిట్‌పై వ‌డ్డీ రూ.10వేలు దాటితే అప్పుడు మూలం వ‌ద్ద పన్ను కోత‌(టీడీఎస్‌) విధించ‌డం జ‌రుగుతుంది.

పొదుపు ఖాతా- జ‌మ అయిన వ‌డ్డీకి ఎలాంటి ప‌న్ను విధించ‌బోరు.వాస్త‌వానికి రూ.10వేలు, లేదా దాని లోపు వ‌డ్డీ జ‌మ అయితే ఎటువంటి ప‌న్ను వర్తించ‌దు. అది దాటితే పన్ను మిన‌హాయింపు పొందే అవ‌కాశమూ ఆదాయ‌పు శాఖ క‌ల్పిస్తుంది. సెక్ష‌న్ 80టీటీఏ కింద గ‌రిష్టంగా రూ.10వేల వ‌డ్డీకి ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

న‌గ‌దు ల‌భ్య‌త‌

న‌గ‌దు ల‌భ్య‌త (లిక్విడిటీ) చాలా ముఖ్య‌మైన అంశం. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో లిక్విడిటీదే కీల‌క పాత్ర‌. పైన పేర్కొన్న అన్ని పెట్టుబడి మార్గాలు మదుప‌రుల‌కు మంచి లిక్విడిటీ అవ‌కాశాన్ని క‌ల‌గ‌జేస్తాయి. రిల‌య‌న్స్ లిక్విడ్ ఫండ్ ఏటీఎమ్ కార్డు లాంటి Anytime Money card ను అందిస్తుంది. దీంతో ఎప్పుడైనా స‌రే డ‌బ్బు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌లుగుతుంది. చాలా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే రీడీమ్ చేసుకోవ‌చ్చు. పెనాల్టీ చార్జీలు కూడా వేయ‌కుండా నేరుగా మ‌న ఖాతాలోకే డ‌బ్బు వ‌చ్చి చేరుతుంది. కొన్ని బ్యాంకులు స్వీప్ ఇన్ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. అంటే సేవింగ్స్ ఖాతాలో డ‌బ్బు నిల్వ నిర్ణీత మేర‌క‌న్నా ఎక్కువ‌గా ఉంటే స్వ‌యంచాలితంగా(ఆటోమెటిక్‌గా) ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు వెళ్లిపోతాయి.

చివ‌ర‌గా…

వివిధ మార్గాల ద్వారా అందుకున్న రాబ‌డుల‌పై ప‌న్ను విష‌యంలో పొద‌పు ఖాతాకు ఉన్న ప్ర‌యోజ‌నాలు ఎఫ్‌డీలు, లిక్విడ్ ఫండ్లకు లేవు. త‌గ్గుతోన్న వ‌డ్డీ రేట్ల‌ను కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే స్వ‌ల్ప‌కాల అవ‌స‌రాల‌కు పొదుపు ఖాతా ఎంపికే లాభ‌దాయ‌కంగా అనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని