ఆదాయ ప‌న్ను శాఖ కోణంలో ప్ర‌వాస భార‌తీయులు

ప్ర‌వాస భార‌తీయులంటే ఎవ‌రు? వారికి వ‌ర్తించే ప‌న్ను మిన‌హాయింపుల‌పై చ‌ర్చిద్దాం...

Published : 15 Dec 2020 18:20 IST

ర‌క‌ర‌కాల ప‌నుల నిమిత్త‌మై విదేశాల‌కు వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డిన‌వారిని ప్ర‌వాస భార‌తీయులు లేదా నాన్ రెసిడెంట్లుగా వ్య‌వ‌హ‌రిస్తాం. ప‌న్ను వ్య‌వ‌హారంలో ఆదాయ‌పు ప‌న్ను శాఖవారు వివిధ ప్రామాణికాల‌ను ప‌రిగ‌ణిస్తారు. స్వ‌దేశంలో ప్ర‌త్యక్షంగా నివాసముండేవారిని స్థానికులు(రెసిడెంట్లు)గా గుర్తిస్తుంది ఐటీ శాఖ‌.

ఈ స్థానిక‌త మీదే పన్ను వ‌సూలు ఆధార‌ప‌డి ఉంటుంది. 1) స్థానికులు(రెసిడెంట్లు) 2) స్థానికేత‌రులు/ప‌్ర‌వాస భార‌తీయులు (నాన్ రెసిడెంట్లు)… ఈ రెండు వ‌ర్గాల్లో ఏ దానికి చెందుతామ‌నేది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌లో కొన్ని ప్రాథ‌మిక నిబంధ‌న‌లు తేలుస్తాయి. ఆ నిబంధ‌న‌లేమిటో చూద్దాం…

స్థానిక హోదా:

భార‌త‌దేశంలో నివ‌సించే పౌరుల‌కు ఆదాయ‌పు ప‌న్ను విధించే విష‌యంలో ఆ పౌరుల స్థానికతే ప్రామాణికంగా తీసుకుంటారు. ఓ పౌరుడి స్థానిక హోదాను ఏ సంవ‌త్సానికి ఆ సంవ‌త్స‌రం విడిగా చూస్తారు. ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు అంటే మార్చి 31వ తేదీని స్థానిక హోదా లెక్కింపున‌కు ప‌రిగ‌ణిస్తారు. ఈ సంవ‌త్స‌రం మొత్తంలో ఎంత కాలంపాటు భార‌త‌దేశంలో ఉన్నార‌న్న విష‌యంపైనే స్థానిక హోదాను నిర్ణ‌యిస్తారు. స్థానికులు కానివారంతా నాన్ రెసిడెంట్లు.

ఐటీ శాఖ వారి దృష్టిలో స్థానికులుగా గుర్తింపు పొందేందుకు రెండు ప్రాథ‌మిక నిబంధ‌న‌లను పూర్తి చేసి ఉండాలి.

182 రోజుల‌పాటు స్థానిక నివాసం:

ఈ వ్య‌వ‌హారాన్ని సుల‌భంగా అర్థం చేసుకునేందుకు ఆర్థిక సంవ‌త్స‌ర ముగింపు తేదీ అయిన 31 మార్చి 2017ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుందాం. ఏప్రిల్ 1, 2016 నుంచి 31 మార్చి, 2017 వ‌ర‌కు ఉన్న‌ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎవ‌రైనా క‌నీసం 182 రోజుల‌పాటు భార‌త్‌లో ప్ర‌త్య‌క్షంగా స్థానిక నివాసం ఏర్ప‌ర్చుకున్న‌ట్ల‌యితే అలాంటి వారిని స్థానికులుగా గుర్తిస్తుంది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌.

రెండో ప్ర‌త్యామ్నాయం:

దీనికి ప్ర‌త్యామ్నాయంగా గ‌డ‌చిన ఆర్థిక సంవ‌త్సంలో క‌నీసం 60 రోజులపాటు భార‌త్‌లో ఉండాలి. దాంతో పాటు ఏప్రిల్ 1, 2012 మొద‌లుకొని 31 మార్చి, 2016 దాకా నాలుగేళ్ల‌కు క‌లిపి క‌నీసం 365 రోజులు ప్ర‌త్య‌క్ష నివాసం ఉన్న‌వారిని స్థానికులుగా గుర్తిష్తారు.

వీరికి వ‌ర్తించ‌దు ఈ నిబంధ‌న‌:

60 రోజుల ప్ర‌త్య‌క్ష‌ నివాసం ఏర్ప‌ర్చుకున్న‌వారే స్థానికులుగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే నిబంధ‌న‌ నుంచి కింద పేర్కొన్న మూడు వర్గాల వారికి మిన‌హాయింపు ఉంది. వీళ్లు కాకుండా ఇక మిగ‌తా వారంద‌రికీ 182రోజుల‌పాటు స్థానిక‌త నియ‌మం వ‌ర్తిస్తుంది. ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు తేదీ అయిన 31 మార్చి, 2017ను ప్రామాణికంగా తీసుకొని 60రోజుల ప్ర‌త్య‌క్ష నివాసం ఏయే వ‌ర్గాల‌కు చెందుతుందో చూద్దాం…

  1. భార‌త పౌరులై ఉండి, దేశీయ నౌకాయానంలో ప‌నిచేసే సిబ్బంది గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో స్వ‌దేశంలో క‌నీసం 60రోజులు ఉన్నా చాలు వారిని స్థానికులుగానే ప‌ర‌గ‌ణిస్తారు.
  2. గ‌డ‌చిన ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉపాధి నిమిత్తం దేశం వెలుపలికి వెళ్లిన భార‌తీయ పౌరులు
  3. భార‌తీయ పౌరులు లేదా ఈ దేశ మూలాలున్నవారు ఎవ‌రైనా గ‌డ‌చిన ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త‌దేశాన్ని సంద‌ర్శించినట్ల‌యితే…

పైన పేర్కొన్న రెండు నిబంధ‌న‌లైన‌ 60రోజులు, 182 రోజుల స్థానిక‌త‌ల్లో దేన్ని సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేక‌పోయినా స‌ద‌రు వ్య‌క్తిని నాన్ రెసిడెంట్లుగా గుర్తిస్తుంది ఆదాయ‌పు ప‌న్నుశాఖ‌.

నాట్ ఆర్డిన‌రీ రెసిడెంట్‌:

ఈ రెండు వ‌ర్గీక‌ర‌ణ‌లు కాకుండా మ‌రో వ‌ర్గీక‌ర‌ణకూ స్థానం క‌ల్పించాయి చ‌ట్టాలు. వారినే నాట్ ఆర్డిన‌రీ రెసిడెంట్‌ అని వ్య‌వ‌హ‌రిస్తారు. ఇంత‌వ‌ర‌కూ చెప్పుకొన్న నియ‌మాల‌ను సంతృప్తి ప‌ర్చ‌డ‌మే కాకుండా మ‌రో రెండు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉంటే వారిని నాట్ ఆర్డిన‌రీ రెసిడెంట్‌గా ప‌రిగ‌ణిస్తారు.

  • మొద‌టి నిబంధ‌న ప్ర‌కారం మార్చి 31, 2016 ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు నాటికి ప‌దేళ్ల‌లో క‌నీసం 9ఏళ్లు నాన్ రెసిడెంట్‌గా ఉండి తీరాలి.
  • పై నిబంధనకు ప్ర‌త్యామ్నాయంగా రెండో నిబంధ‌నను అనుస‌రించి ఆర్థిక సంవ‌త్సరం ముగింపు నాటికి గ‌డ‌చిన ఏడేళ్ల‌లో క‌నీసం 729రోజులు భార‌త‌దేశంలో ప్ర‌త్య‌క్ష నివాసం ఏర్ప‌ర్చుకొని ఉండాలి.

ప్ర‌పంచంలో ఎక్క‌డ సంపాదించినాః

భార‌తీయ ప‌న్ను చట్టాల ప్ర‌కారం స్థానికులుగా గుర్తింపు పొందిన‌వారెవ‌రైనా ప్ర‌పంచంలో ఎక్క‌డ సంపాదించినా ఇక్క‌డ ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. విదేశాల్లో సంపాదించిన సొమ్ముపై ఆ దేశ చ‌ట్టాల ప్ర‌కారం అక్క‌డా ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌న దేశం కొన్ని దేశాలతో చేసుకొన్న ద్వంద్వ ప‌న్ను మిన‌హాయింపు ఒప్పందం ప్ర‌కారం ఇక్క‌డి స్థానికులుగా గుర్తింపు పొందిన‌వారికి ప‌న్ను మిన‌హాయింపు పొందే ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

ఎన్‌.ఆర్‌.ఐ ల‌కు ఇలా…

నాన్ రెసిడెంట్లుగా గుర్తింపు పొందిన‌వారు భార‌త‌దేశంలో ఎక్క‌డ ఆదాయం సముపార్జించినా, ఇక్క‌డి ఆస్తుల ద్వారా ఆదాయం పొందినా, ఇక్క‌డ సేవ‌లు అందించ‌డం ద్వారా ఆర్జ‌న చేసినా భార‌త ఆదాయ చ‌ట్టాల ప్ర‌కారం ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. ప్ర‌వాస భార‌తీయులుగా విదేశాల్లో ప‌నిచేస్తూ ఉండి, భార‌త‌దేశంలోని మీ బ్యాంకు ఖాతాలో వేతనం జ‌మ అయితే ఇక్క‌డి చ‌ట్టాల ప్ర‌కారం వేత‌నంపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కాకుండా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టాల‌ ప్ర‌కారం స్థానికుల‌కు ఉన్న ప్ర‌యోజ‌నాలు కొన్ని ఎన్‌.ఆర్‌.ఐల‌కు వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS Bombay Oxygen Corporation Limited.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని