Adani Power: ₹లక్ష పెట్టుబడికి ఒక్క నెలలో ₹లక్ష లాభం!

మార్కెట్‌ విలువ పరంగా తొలి 50 కంపెనీల జాబితాలోకి అదానీ పవర్‌ చేరింది....

Updated : 22 Apr 2022 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్‌ విలువ పరంగా తొలి 50 కంపెనీల జాబితాలోకి అదానీ పవర్‌ చేరింది. గత నెల వ్యవధిలో ఈ కంపెనీ స్టాక్‌ విలువ రెండింతలు కావడం విశేషం. గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని ఈ సంస్థ షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో రూ.259.20 వద్ద తాజా గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఎన్‌ఎస్‌ఈలో నెల క్రితం రూ.125.50 వద్ద ఉన్న ఈ స్టాక్‌ ధర ఇప్పటి వరకు 106 శాతం ఎగబాకింది. అంటే మార్చి 25న రూ.1,00,000 పెట్టుబడిగా పెట్టినవారు ఇప్పటి వరకు రూ.1,06,000 లాభాన్ని గడించారన్నమాట! కేవలం ఒక్క నెల వ్యవధిలో పెట్టిన పెట్టుబడి రెట్టింపవడం విశేషం.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా అదానీ పవర్‌ రూ.లక్ష కోట్లకు చేరువైంది. ప్రస్తుతం రూ.99,972 కోట్లతో అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీల జాబితాలో 49వ స్థానంలో ఉంది. డాబర్‌ ఇండియా (రూ.98,470 కోట్లు), డీఎల్‌ఎఫ్‌ (రూ.95,052 కోట్లు)ను దాటేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఇప్పటి వరకు ఆరు సంస్థలు టాప్‌-50లో చోటు సంపాదించుకున్నాయి. అదానీ గ్రీన్‌ (రూ.4.44 లక్షల కోట్లు), అదానీ ట్రాన్స్‌మిషన్‌ (రూ.2.92 లక్షల కోట్లు), అదానీ టోటల్‌ గ్యాస్‌ (రూ.2.66 లక్షల కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.(రూ.2.51 లక్షల కోట్లు), అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (రూ.1.85 లక్షల కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. ఇటీవల మార్కెట్‌లో లిస్టయిన అదానీ విల్మర్‌ రూ.94,493 కోట్లతో 12వ స్థానంలో కొనసాగుతోంది.

అదానీ పవర్‌ భారత్‌లో అతిపెద్ద ప్రైవేట్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి సంస్థ. ఈ కంపెనీకి 12,410 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, గుజరాత్‌లో దీని విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.218.49 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

(గమనిక: స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న అంశం. మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని