Budget 2023: రైతులకు ₹20 లక్షల కోట్ల రుణాలు.. శ్రీఅన్న కేంద్రంగా భారత్
Budget 2023: బడ్జెట్ 2023 (Budget 2023)ను నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రైతుల సంక్షేమం కోసం పలు కీలక ప్రకటనలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యాన్ని 11 శాతం పెంచి రూ.20 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. భారత్‌ను చిరుధాన్యాల (శ్రీఅన్న) కేంద్రంగా మారుస్తామని తెలిపారు. ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని పెంచడం కోసం పీఎం-ప్రణామ్ పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రతిపాదించారు. వ్యవసాయ రంగంలోని అంకుర సంస్థల కోసం ప్రత్యేక నిధిని ప్రకటించారు. బడ్జెట్ 2023 (Budget 2023)ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన మంత్రి.. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రైతుల సంక్షేమం కోసం పలు కీలక ప్రకటనలు చేశారు.
రూ.20 లక్షల కోట్ల రుణాలు..
వ్యవసాయ రుణ వితరణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. పశుపోషణ, మత్స్య సాగు, పాడి పరిశ్రమ రుణాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. స్వల్పకాల పంట రుణాలను 7 శాతం వడ్డీరేటుకే అందజేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతుల కోసం తనఖాలేని రుణ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచారు.
‘శ్రీఅన్న’ కేంద్రంగా భారత్..
చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయడంలో భారత్ ముందుందని సీతారామన్ తెలిపారు. చిరుధాన్యాలను మంత్రి తన ప్రసంగంలో ‘శ్రీఅన్న (Shree Anna)’గా వ్యవహరించడం గమనార్హం. వీటి వినియోగం ద్వారా పోషకాహారం, ఆహార భద్రతతో పాటు రైతుల సంక్షేమం కూడా సాధ్యమవుతుందని ప్రధాని మోదీ గతంలో చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్‌లో జొన్న, రాగి, బాజ్రా, సామలు.. సహా పలు రకాల చిరుధాన్యాలను పండిస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయని గుర్తుచేశారు. శతాబ్దాలుగా దేశ ఆహార పద్ధతుల్లో ఇవి భాగంగా ఉన్నాయన్నారు.
భారత్‌ను ప్రపంచ శ్రీఅన్న కేంద్రంగా మార్చడంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. తద్వారా శ్రీఅన్న సాగుకోసం మేలైన పద్ధతులు సహా ఇతర పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
ప్రత్యామ్నాయ ఎరువుల కోసం పీఎం ప్రణామ్..
ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పీఎం- ప్రణామ్ (PM-PRANAM- PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth)’ పథకాన్ని ప్రకటించింది. దీంట్లో భాగంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మరోవైపు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం కోటి మంది రైతులకు సహకారం అందిస్తామన్నారు. అందుకోసం 10 వేల బయో-ఇన్‌పుట్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
వ్యవసాయ అంకురాలకు ప్రత్యేక నిధి
‘అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (Agriculture Accelerator Fund)’ ద్వారా వ్యవసాయ సంబంధిత అంకుర సంస్థలకు నిధుల ప్రోత్సాహాన్ని అందజేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువ ఆవిష్కర్తలు ఏర్పాటు చేసే అంకురాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రైతులు ఎదుర్కొనే సవాళ్లకు నవీన, అందుబాటులో ఉండే పరిష్కారాలను చూపే స్టార్టప్‌లకు ఈ నిధులను అందజేస్తామన్నారు. సాగు పద్ధతులను ఆధునికీకరించే సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడానికి కూడా ఈ నిధిని ఉపయోగిస్తామన్నారు. పంట దిగుబడి, రైతుల లాభదాయకతను పెంచేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.
ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ పథకం..
ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం కోసం ‘ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ పథకం (Atmanirbhar Horticulture Clean Plant Program)’ ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ద్వారా వ్యాధి నిరోధకత, నాణ్యత కలిగిన ప్లాంటింగ్ మెటీరియల్‌ను రైతులకు అందిస్తామన్నారు. దీనికోసం రూ.2,200 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
మత్స్యకారులకు..
రూ.6,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంతో ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ అనే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా మత్స్యకారులు, విక్రేతలు, ఈ రంగంలోని సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మత్స్య దాణా తయారీకి కావాల్సిన ముడి సరకుల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తామన్నారు.
పత్తి దిగుబడి కోసం..
నాణ్యమైన పత్తి దిగుబడిని పెంచడానికి, ప్రభుత్వం క్లస్టర్ ఆధారిత, వాల్యూ చైన్ విధానాన్ని ‘పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP)’ ద్వారా అవలంబించనున్నట్లు సీతారామన్ తెలిపారు. తద్వారా రైతులు, ప్రభుత్వం, పరిశ్రమ మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్రాప్ ఇన్‌పుట్‌లతో పాటు మార్కెట్‌తో అనుసంధానం సహా ఇతర అదనపు సహకారం దీంతో సాధ్యమవుతుందన్నారు.
ప్రత్యేక డిజిటల్ మౌలిక సదుపాయాలు..
వ్యవసాయం కోసం ప్రత్యేకంగా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వీటిని అభివృద్ధి చేస్తామన్నారు. పంట ప్రణాళిక, దిగుబడి అంచనా, మార్కెట్ ఇంటెలిజెన్స్, అగ్రిటెక్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు.
సహకార వ్యవస్థ..
చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసం సహకార వ్యవస్థ ఆధారిత ఆర్థిక నమూనాను అవలంబిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. దీనికోసం 63,000 ‘ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల (PACS)’ కంప్యూటరీకరణను చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి రూ.2,516 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పీఏసీఎస్‌లను బహుళ ఉపయోగ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో పీఏసీఎస్, ప్రాథమిక మత్స్య సొసైటీలు, డెయిరీ సహకార సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు